పాఠశాలల్లో కానరాని జవహర్ బాల ఆరోగ్య రక్ష
విద్యార్థుల్లో పెరుగుతున్న రక్తహీనత
అందుబాటులో లేని హెచ్‌బీ పరీక్షల కిట్లు
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్:
జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకం పనితీరులో కనీస ప్రగతి లేదు. జిల్లాలో యువ క్లినిక్‌లు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితి. ఏడాదిలో ప్రతి పాఠశాలను రెండుసార్లు తనిఖీ చేసి వైద్య కార్యక్రమాలు విద్యార్థులకు అందుతున్నాయో లేదో చూడాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. 12-17 సంవత్సరాల మధ్య యువత కోసం యువ క్లినిక్‌లు ప్రారంభించారు. ఇవి ఎక్కడున్నాయో యువతకు తెలీదు. యువతకు సందేహాలు, అనుమానాలు నివృత్తి చేసి తగిన సేవలందించాలన్న సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ క్లినిక్‌లు ఆశించిన ఫలితాలివ్వడం లేదు.
12-17 సంవత్సరాల మధ్య వారిలో ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది వరకు కేవలం యువతుల్లో మాత్రమే ఉండే రక్తహీనత ప్రస్తుతం యువకులకూ ఉంటోంది. ఫలితంగా శారీరక సమస్యలతో ఏ రంగంలోనూ రాణించలేకపోతున్నారు. యువతలో ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను నిర్ధారించేందుకు సరైన వ్యవస్థ అందుబాటులో లేదు. జిల్లాలో 3,33,000 మంది విద్యార్థులు ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థులకు జవహర్ బాల ఆరోగ్య రక్ష ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సమస్యలు గుర్తిస్తున్నారు. రక్తహీనత ఉన్నవారికి పాఠశాలల్లోనే ఐరన్ మాత్రలు ఇస్తున్నారు. సమస్య తీవ్రంగా ఉంటే ఆరోగ్య కేంద్రాల ద్వారా చికిత్స అందిస్తున్నారు. ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు 7 లక్షల ఐరన్ మాత్రలు పంపిణీ చేసినట్లు ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నివేదికలో పేర్కొంది. వారానికి ఒక్కసారి మాత్రమే ఒక ఐరన్ మాత్రను ఒక్కో విద్యార్థికి అందించినట్లు నివేదికలో తెలిపారు.
కౌమార దశలో ఉన్న వారికి మాత్రం ఎలాంటి సేవలు అందుబాటులో లేవు. ఒక వ్యక్తికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని గుర్తించడానికి పరీక్షలు చేసి నిర్ధారించాల్సి ఉంటుంది. అయితే పలు అనారోగ్య సమస్యలకు దారి తీసే రక్తహీనతను గుర్తించడానికి ప్రభుత్వ యంత్రాంగం వద్ద సామూహిక పరీక్షల వ్యవ స్థ లేదు. దీంతో విద్యార్థుల్లో రక్త హీనత సమస్య తీవ్రతను గుర్తించడంలో విఫలమవుతున్నారు.
అందుబాటులో లేని హెచ్‌బీ పరీక్షల కిట్లు:
12 నుంచి 17 ఏళ్ల వయస్సు ఉన్న యువతకు డెస్సీ లీటర్‌కు రక్తంలో 14 గ్రాములకు పైగా హిమోగ్లోబిన్ ఉండాలి. పరీక్షలు చేయకుండానే రక్త హీనత ఉందని గుర్తించే విద్యార్థుల్లో 9-14 మధ్య హిమోగ్లోబిన్ ఉన్న వారే ఎక్కువగా ఉన్నారని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. 8 శాతం మంది యువతలో 7 గ్రాముల వరకూ హిమోగ్లోబిన్ ఉంటోందని అధికారులు పేర్కొంటున్నారు. బాలికల్లో 12.5 గ్రాములు ఉండాల్సి ఉండగా, 7-10 గ్రాముల మధ్య మాత్రమే ఉంటోంది. హెచ్‌బీ గుర్తించడానికి రక్త పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేకమైన కిట్లు పంపిణీ చేయకపోవడంతో ఎవరికి ఎంత శాతం హిమోగ్లోబిన్ ఉందో పూర్తిస్థాయిలో గుర్తించలేకపోతున్నారు.
శాఖల మధ్య సమన్వయ లోపం:
విద్యార్థుల ఆరోగ్యం కోసం విద్య, వైద్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు పనిచేయాలి. కానీ ఈ శాఖల మధ్య సమన్వయం కొరవడటంతో ఆశించిన ఫలితం దక్కడం లేదు. కౌమార బాలికల్లో రక్తహీనత సమస్య ఉన్న వారికి పౌష్టికాహారంపై, శుభ్రతపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత స్త్రీశిశు సంక్షేమ శాఖది. సమస్య ఉన్నట్లు గుర్తించాల్సింది వైద్య ఆరోగ్య శాఖ. చదువుకుంటున్న వారికి విద్యాసంస్థల్లో జబార్ ఆధ్వర్యంలో శిబిరాలు నిర్వహించాలి. కానీ ఈ శాఖలు సమన్వయంతో వ్యవహరించడం లేదు. యువత ఆహారంలో సహజ సిద్ధంగా రక్తాన్ని పెంచే బెల్లం, ఆకుపచ్చటి కూరగాయలు, బచ్చలి కూర, గోంగూర, క్యారెట్, బీట్‌రూట్, మాంసాహారంలో లివర్ తీసుకుంటే రక్తం సమృద్ధిగా లభిస్తుంది. కనీసం వాటిపై అవగాహన కల్పించడంలోనూ ప్రభుత్వ శాఖలు విఫలమవుతున్నాయి.
బాలల ఆరోగ్యానికి రక్షణేదీ..
Published Sun, Feb 2 2014 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM
Advertisement