ఆరోగ్య రక్ష.. అందని ద్రాక్ష
* అటకెక్కిన ‘జవహర్ బాల ఆరోగ్య రక్ష’ పథకం
* ఆరోగ్య కార్డులిచ్చి సరిపెట్టిన అధికారులు
* వైద్య పరీక్షల ఊసెత్తని వైద్యులు
* పాఠశాల మెట్లెక్కని ఎంపీహెచ్‌ఏలు
* పట్టించుకోని మండల కమిటీలు
* జిల్లాలో 3.96 లక్షల విద్యార్థుల ఆరోగ్యం గాలిలోనే..
చాగల్లు : నేటి బాలలే రేపటి పౌరులు. వారే భారత భాగ్యవిధాతలు. అందుకే బాలలకు సకాలంలో సరైన పోషకాహారం అందాలి. వారు సంపూర్ణ ఆరోగ్యంతో పెరిగేలా చూడాలి. ఈ బాధ్యత కేవలం తల్లిదండ్రులది మాత్రమే కాదు.. ప్రభుత్వాలది కూడా. ఈ విషయూన్ని గుర్తెరిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 2010 నవంబర్ 14న ‘జవహర్ బాల ఆరోగ్య రక్ష’ పేరిట ఓ పథకాన్ని ప్రారంభించారుు. ప్రభుత్వ పాఠశాలల్లో 1నుంచి 10వ తరగతి చదువుతున్న బాలలకు వైద్య పరీక్షలు చేయించడం, వారిలో ఏవైనా రుగ్మతలుంటే మందులు పంపిణీ చేయడం.
అవసరమైతే శస్త్ర చికిత్సలు చేయించడం వంటి సేవలను జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకం కింద ఉచితంగా అందించాల్సి ఉంది. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల నిర్లిప్తత కారణంగా ఈ పథకం పూర్తిగా అటకెక్కింది. బాలలకు మంచి చేస్తుందని అందరూ భావిం చినా ఆచరణలో విఫలమైంది. విద్యార్థులకు హడావుడిగా ఆరోగ్య కార్డులు జారీ చేసినా.. ఆ తరువాత పిల్లల స్థితిగతులపై సమీక్షలు, నిర్దేశించిన సమయూల్లో వైద్య పరీక్షలు చేయకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు.
ఏం చేయూలంటే...
1 నుంచి 10వ తరగతి విద్యార్థుల్లో కొందరు అనారోగ్య కారణాల వల్ల తరగతులకు హాజరు కాలేకపోతున్నారు. దీనిని నివారించడంతోపాటు దేశానికి సంపూర్ణ ఆరోగ్యవంతమైన యువతను అందించాలనే లక్ష్యంతో జవహర్ బాల ఆరోగ్య పథకానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు శ్రీకారం చుట్టారుు. ఈ పథకం అమలు బాధ్యతను జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, రాజీవ్ విద్యామిషన్, పాఠశాల విద్యాశాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చేపట్టారుు. ఈ శాఖలు సమన్వ యంతో వ్యవహరిస్తూ విద్యార్థులకు నిర్దేశించిన సమయాల్లో వైద్య పరీక్షలు నిర్వహించాలి. అవసరమైన ఉచితంగా చికిత్సలు చేయడంతోపాటు మందులు అందించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలి.
అవసరమైతే రిఫరల్ ఆసుపత్రికి తరలిం చి మెరుగైన వైద్యం అందించాలి. ఇందుకోసం విద్యార్థులకు గతంలోనే ఆరోగ్య రక్ష కార్డులను పంపిణీ చేశారు. ఆ కార్డులో విద్యార్థి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయాలి. పీహెచ్‌సీ వైద్యులు తమ పరిధిలోని పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి విధిగా ఏడాదిలో రెండుసార్లు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. ప్రతి గురువారం స్కూల్ హెల్త్ డేగా పాటించాలి. విద్యార్థి ఆరోగ్య సమాచారాన్ని ఆరోగ్య రికార్డులో నమోదు చేయడం, ప్రతి మంగళవారం పాఠశాల ఆరోగ్య రిఫరల్ డేగా పాటించి ఆ రోజు ఎంపీహెచ్‌ఏలు విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను సమీక్షిం చాలి. అనారోగ్యం వల్ల పాఠశాలలకు ఎక్కువ రోజులు హాజరుకాని విద్యార్థులను గుర్తించి మెరుగైన వైద్యం అందించాలి. కానీ.. జిల్లాలో ఎక్కడా ఇవేమీ అమలు కావడం లేదు.
కమిటీలూ పడుకున్నాయ్
ప్రతి విద్యార్థికి వైద్య సేవలు అందించేవిధంగా ప్రభుత్వ వైద్యులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ పథకం అమలులో ఉపాధ్యాయులకూ బాధ్యత ఉంది. ప్రతి విద్యార్థికి ఆరోగ్య కార్డు అందేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా చూడాలి. విద్యార్థి ఆరోగ్య సమాచారాన్ని కార్డులలో నింపి ఎంపీహెచ్‌ఏలకు సహకారం అందించాలి. విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలకు ఆహ్వానించి వారి పిల్లల ఆరోగ్య విషయాలను వారికి చెప్పడంతోపాటు రికార్డుల్లో నమోదు చేసి తల్లిదండ్రుల సంతకాలు సేకరించాలి. విద్యార్థులు పాఠశాలను విడిచి వేరే పాఠశాలకు వెళ్లే సమయంలో వారి ఆరోగ్య రికార్డును తల్లిదండ్రులకు అందజేయూలి. ఆరోగ్య విద్యపై పిల్లలకు అవగాహన కల్పించాలి.
మొత్తంగా ఈ పథకం అమలును పర్యవేక్షించేందుకు, సమీక్షించేందుకు మండల స్థాయిలోనూ కమిటీలు ఉన్నారు. ఎంపీడీవో చైర్మన్‌గా, పీహెచ్‌సీ వైద్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కమిటీల్లో సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, రాజీవ్ విద్యామిషన్ ఈ పథకం అమలుకు కృషి చేయడంతోపాటు ఎప్పటికప్పుడు సమీక్షించాలి. అయితే, ఏ స్థాయిలోనూ.. ఏ ఒక్క అధికారి, కిందిస్థాయి ఉద్యోగులు ఈ పథకాన్ని పట్టించుకోవడం లేదు. ఫలితంగా విద్యార్థులకు వరంలా మారాల్సిన ఆరోగ్య రక్ష పథకం అక్కరకు రావడం లేదు.
వైద్యసేవలకు 3.96 లక్షల మంది దూరం
ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ, ఎరుుడెడ్, మునిసిపల్, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లో సుమారు 3.96 లక్షల మంది చదువుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్కరికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించలేదు. కనీసం ఒక్క మందు బిళ్ల కూడా పంపిణీ చేయలేదు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, రాజీవ్ విద్యామిషన్ అధికారుల మధ్య సమన్వయం లోపించడంతో బాల ఆరోగ్యరక్ష పథకం ఒకటి ఉందనే విషయూన్నే అంద రూ మర్చిపోయూరు.
ఏడాదిలో రెండుసార్లు ప్రతి విద్యార్థికి పరీక్షలు నిర్వహించాల్సిన పీహెచ్‌సీ వైద్యాధికారులను ఇదేమని అడిగితే పీహెచ్‌సీ నిర్వహణలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని, వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా పాఠశాలలకు వెళ్లలేకపోతున్నామని చెబుతున్నారు. వారానికి ఒకసారి పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితుల్ని గమనించాల్సిన ఎంపీహెచ్‌ఏలు సైతం మొహం చాటేస్తున్నారు. ప్రతివారం విద్యార్థులకు ఐరన్/ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇవ్వాలి. చాలాచోట్ల వీటిని కూడా ఇవ్వడం లేదు.
పరీక్షలు చేరుస్తాం
జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకం అమలుకు నోచుకోకపోవడంపై రాజీవ్ విద్యామిషన్ కో-ఆర్డినేటర్ (ఐఈడీ) జి.నాగేశ్వరరావును వివరణ కోరగా... గత విద్యా సంవత్సరం ఈ పథకం కింద జిల్లాలోని 63 శాతం పాఠశాలల్లో వైద్య పరీక్షలు చేరుుంచామని, అప్పట్లో 56 శాతం మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు జరిగాయని చెప్పారు. వైద్యుల కొరత, పాఠశాలలు సక్రమంగా తెరవకపోవడంతో పరీక్షలు సక్రమంగా చేయలేకపోయారని చెప్పారు. ఈ ఏడాది 3.96 లక్షల మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించినట్టు పేర్కొన్నారు.