Referral hospital
-
ఈఎస్ఐలో ధన్వంతరి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కార్మిక రాజ్యబీమా (ఈఎస్ఐ) ఆస్పత్రుల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. గత ప్రభుత్వ హయాంలో రూ.వందలాది కోట్ల నిధులు దుర్వినియోగమైన విషయం తెలిసిందే. ఇకపై ఇలాంటి కొనుగోళ్లలో అవినీతికి తావు లేకుండా ఇ–ఔషధి తరహాలోనే ‘ధన్వంతరి’ విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. గతంలోనే ధన్వంతరి సాఫ్ట్వేర్ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర కార్మిక శాఖ ఆంధ్రప్రదేశ్‌కు పదేపదే సూచించింది. ఈ విధానం అమల్లోకి తెస్తే.. అవినీతికి ఆస్కారం ఉండదని, నిధులు కాజేసేందుకు అవకాశం ఉండదన్న ఉద్దేశంతో చంద్రబాబు సర్కారు దీనిని పక్కన పడేసింది. అన్ని విభాగాల్లో అవినీతికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించిన ప్రస్తుత ప్రభుత్వం ఈ నెలాఖరు నాటికి ఈ విధానం అమల్లోకి తీసుకు రావాలని నిర్ణయించింది. దీనివల్ల 14 లక్షల మంది కార్మికులతో పాటు మరో 30 లక్షల మందికి పైగా కార్మికుల కుటుంబ సభ్యులకూ మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో 78 డిస్పెన్సరీలు, 4 ప్రాంతీయ ఆస్పత్రులు, 4 డయాగ్నస్టిక్ సెంటర్లకు వెళ్లే కార్మికులకు కొత్త విధానం వల్ల ఊరట కలగనుంది. ప్రస్తుతం ఢిల్లీలో మాత్రమే ధన్వంతరి విధానం అమల్లో ఉంది. ఆన్‌లైన్‌లోకి రిఫరల్ ఆస్పత్రులు ఈఎస్ఐ ఆస్పత్రుల్లో తగిన వైద్యం అందుబాటులో లేకపోతే రిఫరల్ ఆస్పత్రులుగా గుర్తించిన ప్రైవేట్ ఆస్పత్రులకు కార్మికులు వెళ్లేవారు. అక్కడ పూర్తిగా మాన్యువల్ బిల్లులే ఉండేవి. దీంతో కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు కార్మికుల పేరిట నకిలీ బిల్లులు సృష్టించి రూ.కోట్లు కొల్లగొట్టేవారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈఎస్ఐ పరిధిలో ఉండే 120 రిఫరల్ ఆస్పత్రులు ధన్వంతరి సాఫ్ట్వేర్ పరిధిలోకి రానున్నాయి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు ఏ విధంగా బిల్లులు చెల్లిస్తున్నారో.. వీటికి కూడా అదే తరహాలోనే చెల్లింపులు చేస్తారు. 10 కిలోమీటర్ల దూరంలో ఈఎస్ఐ ఆస్పత్రి లేకపోతే అక్కడి కార్మికుడు నేరుగా ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లచ్చు. ఆస్పత్రి నుంచి పేషెంట్ వివరాలు ఈఎస్ఐకి అందించాలి. ఆ వెంటనే ఇక్కడ నుంచి అనుమతులు ఇస్తారు. రోగుల చేరిక, ఓపీ, ఐపీ, బిల్లులు పెట్టడం ఇకపై అన్నీ ఆన్లైన్లో చేయాల్సిందే. మందుల కొనుగోళ్లకూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ఆన్లైన్లో మందులు కొంటున్నది ఏపీఎంఎస్ఐడీసీ పరిధిలోనే. ఇప్పుడు అదే విధానాన్ని ఈఎస్ఐలోనూ అనుసరించబోతున్నారు. ఇప్పటివరకు మందుల కొనుగోలు పేరిట రూ.వందల కోట్లు దుర్వినియోగమయ్యాయి. గతంలో పితాని సత్యనారాయణ, అచ్చెన్నాయుడు మంత్రులుగా ఉన్న సమయంలో ఇదే తంతు జరిగింది. ఇకపై అలా కాకుండా ఏ ఆస్పత్రికి ఎన్ని మందులు అవసరమో డాక్టర్లు ఇండెంట్ ఇస్తే.. ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ ద్వారా కొనుగోలు చేసేలా ఈఎస్ఐ అధికారులు ఏపీఎంఎస్‌ఐడీసీతో మాట్లాడుతున్నారు. పక్కాగా పేషెంట్ల రిజిస్ట్రీ రాష్ట్రంలో ఈఎస్ఐ సౌకర్యం గల కార్మికులు, వారి కుటుంబ సభ్యులు కలిపి 44 లక్షల మంది పైనే ఉన్నారు. వీరిలో ఎవరైనా ఈఎస్ఐ ఆస్పత్రులకు వెళితే వారి పేరు, వివరాలు, ఐడీ నంబర్ పక్కాగా ఆన్లైన్లో నమోదు చేస్తారు. వారికి ఏయే మందులు, ఎన్నెన్ని ఇచ్చారు, ఏ డాక్టర్ చికిత్స చేశారు, రక్త పరీక్షలేమైనా చేశారా వంటి వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేయాల్సిందే. ఏ ఒక్క రోగికి సంబంధించిన పేరు నమోదు చేయకపోయినా ఆ డిస్పెన్సరీ ఉద్యోగులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇక అన్నీ ఆన్లైన్లోనే.. ‘ధన్వంతరి’ సాఫ్ట్‌వేర్‌ను అమల్లోకి తెస్తున్నాం. రిఫరల్ ఆస్పత్రుల నమోదు పూర్తయింది. పేషెంట్ రిజిస్ట్రీ ఆన్లైన్ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఇకపై మాన్యువల్‌గా చేసేవేవీ ఉండవు. అన్నీ ఆన్లైన్లో వస్తే అనుమతులు ఇస్తాం. వేలాదిమంది రోగులకు చెల్లించాల్సిన బకాయిలన్నీ చెల్లిస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా వారికి బిల్లులు చెల్లించలేదు. –డాక్టర్ కుమార్ లక్కింశెట్టి, డైరెక్టర్, ఈఎస్ఐ -
రైల్వే ఉద్యోగుల రెఫరల్ ఆస్పత్రిగా ‘గౌరీగోపాల్’
గుంతకల్లు : గుంతకల్లు రైల్వే డివిజన్లోని ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అత్యవసర సేవలు కర్నూలులోని గౌరీ గోపాల్ ఆస్పత్రిలో పొందొచ్చు. అత్యవసర, మెరుగైన వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ‘గౌరీ గోపాల్’ ఆస్పత్రిని రెఫరల్ హాస్పిటల్‌గా ఎంపిక చేస్తూ రైల్వే జనరల్ మేనేజర్ అనుమతి ఇచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ గుంతకల్లు డివిజన్ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. నంద్యాల, డోన్ తదితర ప్రాంతాల్లో పని చేస్తున్న రైల్వే ఉద్యోగుల దృష్ట్యా కర్నూలు నగరంలోని గౌరి గోపాల్ హాస్పిటల్లో వైద్యపరీక్షలు చేయించుకోవడానికి అనుమతి ఇవ్వాలని రైల్వే జనరల్ మేనేజర్‌ను బుధవారం జరిగిన సంఘ్ సమావేశంలో కోరినట్లు ఆయన తెలిపారు. -
ఆరోగ్య రక్ష.. అందని ద్రాక్ష
* అటకెక్కిన ‘జవహర్ బాల ఆరోగ్య రక్ష’ పథకం * ఆరోగ్య కార్డులిచ్చి సరిపెట్టిన అధికారులు * వైద్య పరీక్షల ఊసెత్తని వైద్యులు * పాఠశాల మెట్లెక్కని ఎంపీహెచ్ఏలు * పట్టించుకోని మండల కమిటీలు * జిల్లాలో 3.96 లక్షల విద్యార్థుల ఆరోగ్యం గాలిలోనే.. చాగల్లు : నేటి బాలలే రేపటి పౌరులు. వారే భారత భాగ్యవిధాతలు. అందుకే బాలలకు సకాలంలో సరైన పోషకాహారం అందాలి. వారు సంపూర్ణ ఆరోగ్యంతో పెరిగేలా చూడాలి. ఈ బాధ్యత కేవలం తల్లిదండ్రులది మాత్రమే కాదు.. ప్రభుత్వాలది కూడా. ఈ విషయూన్ని గుర్తెరిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 2010 నవంబర్ 14న ‘జవహర్ బాల ఆరోగ్య రక్ష’ పేరిట ఓ పథకాన్ని ప్రారంభించారుు. ప్రభుత్వ పాఠశాలల్లో 1నుంచి 10వ తరగతి చదువుతున్న బాలలకు వైద్య పరీక్షలు చేయించడం, వారిలో ఏవైనా రుగ్మతలుంటే మందులు పంపిణీ చేయడం. అవసరమైతే శస్త్ర చికిత్సలు చేయించడం వంటి సేవలను జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకం కింద ఉచితంగా అందించాల్సి ఉంది. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల నిర్లిప్తత కారణంగా ఈ పథకం పూర్తిగా అటకెక్కింది. బాలలకు మంచి చేస్తుందని అందరూ భావిం చినా ఆచరణలో విఫలమైంది. విద్యార్థులకు హడావుడిగా ఆరోగ్య కార్డులు జారీ చేసినా.. ఆ తరువాత పిల్లల స్థితిగతులపై సమీక్షలు, నిర్దేశించిన సమయూల్లో వైద్య పరీక్షలు చేయకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. ఏం చేయూలంటే... 1 నుంచి 10వ తరగతి విద్యార్థుల్లో కొందరు అనారోగ్య కారణాల వల్ల తరగతులకు హాజరు కాలేకపోతున్నారు. దీనిని నివారించడంతోపాటు దేశానికి సంపూర్ణ ఆరోగ్యవంతమైన యువతను అందించాలనే లక్ష్యంతో జవహర్ బాల ఆరోగ్య పథకానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు శ్రీకారం చుట్టారుు. ఈ పథకం అమలు బాధ్యతను జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, రాజీవ్ విద్యామిషన్, పాఠశాల విద్యాశాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చేపట్టారుు. ఈ శాఖలు సమన్వ యంతో వ్యవహరిస్తూ విద్యార్థులకు నిర్దేశించిన సమయాల్లో వైద్య పరీక్షలు నిర్వహించాలి. అవసరమైన ఉచితంగా చికిత్సలు చేయడంతోపాటు మందులు అందించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలి. అవసరమైతే రిఫరల్ ఆసుపత్రికి తరలిం చి మెరుగైన వైద్యం అందించాలి. ఇందుకోసం విద్యార్థులకు గతంలోనే ఆరోగ్య రక్ష కార్డులను పంపిణీ చేశారు. ఆ కార్డులో విద్యార్థి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయాలి. పీహెచ్సీ వైద్యులు తమ పరిధిలోని పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి విధిగా ఏడాదిలో రెండుసార్లు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. ప్రతి గురువారం స్కూల్ హెల్త్ డేగా పాటించాలి. విద్యార్థి ఆరోగ్య సమాచారాన్ని ఆరోగ్య రికార్డులో నమోదు చేయడం, ప్రతి మంగళవారం పాఠశాల ఆరోగ్య రిఫరల్ డేగా పాటించి ఆ రోజు ఎంపీహెచ్ఏలు విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను సమీక్షిం చాలి. అనారోగ్యం వల్ల పాఠశాలలకు ఎక్కువ రోజులు హాజరుకాని విద్యార్థులను గుర్తించి మెరుగైన వైద్యం అందించాలి. కానీ.. జిల్లాలో ఎక్కడా ఇవేమీ అమలు కావడం లేదు. కమిటీలూ పడుకున్నాయ్ ప్రతి విద్యార్థికి వైద్య సేవలు అందించేవిధంగా ప్రభుత్వ వైద్యులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ పథకం అమలులో ఉపాధ్యాయులకూ బాధ్యత ఉంది. ప్రతి విద్యార్థికి ఆరోగ్య కార్డు అందేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా చూడాలి. విద్యార్థి ఆరోగ్య సమాచారాన్ని కార్డులలో నింపి ఎంపీహెచ్‌ఏలకు సహకారం అందించాలి. విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలకు ఆహ్వానించి వారి పిల్లల ఆరోగ్య విషయాలను వారికి చెప్పడంతోపాటు రికార్డుల్లో నమోదు చేసి తల్లిదండ్రుల సంతకాలు సేకరించాలి. విద్యార్థులు పాఠశాలను విడిచి వేరే పాఠశాలకు వెళ్లే సమయంలో వారి ఆరోగ్య రికార్డును తల్లిదండ్రులకు అందజేయూలి. ఆరోగ్య విద్యపై పిల్లలకు అవగాహన కల్పించాలి. మొత్తంగా ఈ పథకం అమలును పర్యవేక్షించేందుకు, సమీక్షించేందుకు మండల స్థాయిలోనూ కమిటీలు ఉన్నారు. ఎంపీడీవో చైర్మన్‌గా, పీహెచ్సీ వైద్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కమిటీల్లో సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, రాజీవ్ విద్యామిషన్ ఈ పథకం అమలుకు కృషి చేయడంతోపాటు ఎప్పటికప్పుడు సమీక్షించాలి. అయితే, ఏ స్థాయిలోనూ.. ఏ ఒక్క అధికారి, కిందిస్థాయి ఉద్యోగులు ఈ పథకాన్ని పట్టించుకోవడం లేదు. ఫలితంగా విద్యార్థులకు వరంలా మారాల్సిన ఆరోగ్య రక్ష పథకం అక్కరకు రావడం లేదు. వైద్యసేవలకు 3.96 లక్షల మంది దూరం ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ, ఎరుుడెడ్, మునిసిపల్, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లో సుమారు 3.96 లక్షల మంది చదువుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్కరికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించలేదు. కనీసం ఒక్క మందు బిళ్ల కూడా పంపిణీ చేయలేదు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, రాజీవ్ విద్యామిషన్ అధికారుల మధ్య సమన్వయం లోపించడంతో బాల ఆరోగ్యరక్ష పథకం ఒకటి ఉందనే విషయూన్నే అంద రూ మర్చిపోయూరు. ఏడాదిలో రెండుసార్లు ప్రతి విద్యార్థికి పరీక్షలు నిర్వహించాల్సిన పీహెచ్సీ వైద్యాధికారులను ఇదేమని అడిగితే పీహెచ్సీ నిర్వహణలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని, వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా పాఠశాలలకు వెళ్లలేకపోతున్నామని చెబుతున్నారు. వారానికి ఒకసారి పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితుల్ని గమనించాల్సిన ఎంపీహెచ్ఏలు సైతం మొహం చాటేస్తున్నారు. ప్రతివారం విద్యార్థులకు ఐరన్/ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇవ్వాలి. చాలాచోట్ల వీటిని కూడా ఇవ్వడం లేదు. పరీక్షలు చేరుస్తాం జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకం అమలుకు నోచుకోకపోవడంపై రాజీవ్ విద్యామిషన్ కో-ఆర్డినేటర్ (ఐఈడీ) జి.నాగేశ్వరరావును వివరణ కోరగా... గత విద్యా సంవత్సరం ఈ పథకం కింద జిల్లాలోని 63 శాతం పాఠశాలల్లో వైద్య పరీక్షలు చేరుుంచామని, అప్పట్లో 56 శాతం మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు జరిగాయని చెప్పారు. వైద్యుల కొరత, పాఠశాలలు సక్రమంగా తెరవకపోవడంతో పరీక్షలు సక్రమంగా చేయలేకపోయారని చెప్పారు. ఈ ఏడాది 3.96 లక్షల మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించినట్టు పేర్కొన్నారు. -
రిఫరల్ అంటే పంపేయడమా!?
రిమ్స్ క్యాంపస్: జిల్లా కేంద్రంలో రిఫరల్ ఆస్పత్రి ఉందంటే దానర్థం.. జిల్లాలోని ఇతర ఆస్పత్రుల నుంచి సీరియస్ కేసులను ఇక్కడికి రిఫర్ చేయడం.. కానీ ఈ ఆర్థాన్ని రిమ్స్ అధికారులు మార్చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే కేసులను వైజాగ్‌కు పంపేస్తూ రిఫరల్ అన్న పదానికి కొత్త నిర్వచనం ఇస్తున్నారు..! ఈ మాటలన్నదెవరో కాదు.. రాష్ట్ర కార్మిక, క్రీడల శాఖ మంత్రి అచ్చెన్నాయుడే. ఇలా అయి తే ప్రజలకు ఏం నమ్మకం ఉంటుందని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం రిమ్స్‌లో జరిగిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇక్కడ రోగులకు వైద్యసేవలు సంతృప్తికరంగా అందడంలేదన్నారు. రిమ్స్‌కు రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితికి తీసుకువచ్చారని అధికారులను తప్పు పట్టారు. కనీసం మంచాలపై బెడ్షీట్లు కూడా ఉండటం లేదు. అంత బద్దకంగా విధులు నిర్వహిస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రికి వచ్చే అత్యవసర కేసుల్లో చాలా వరకు విశాఖపట్నానికి రిఫర్ అవుతున్నాయి. ఈ మాత్రం దానికి రిమ్స్ ఎందుకని ప్రశ్నించారు. గతంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధే ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నా జిల్లా కేంద్ర ఆస్పత్రి పరిస్థితి ఇంత దారుణంగా ఉండటమేమిటని ప్రశ్నించారు. ఆయన పని చేయలేదా? లేక ఆయన మీతో పని చేయించుకోలేకపోయారా?? అని నిలదీశారు. ఇక్కడి వైద్యులు బయట ప్రైవేటు ప్రాక్టీస్ చేసుకున్నా అడగనని.. అయితే రిమ్స్‌లో ఓపీ సమయ పాలన, డాక్టర్ల హాజరు మాత్రం తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఆస్పత్రి మొత్తానికి ఒకే ఒక్క ఆర్థోపెడిక్ వైద్యుడు ఉండటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ఆరు నెలల్లో మార్చేస్తా రిమ్స్ సమస్యల పరిష్కారానికి శాయుశక్తులా కృషి చేస్తానని, ఆరు నెలల్లో మార్పు తీసుకువస్తామని మంత్రి చెప్పారు. ైవె ద్యుల్లో మార్పు రావాలని హెచ్చరించారు. అంబులెన్సులను అందుబాటులో రోగులకు ఉంచాలని ఆదేశించారు. అంబులెన్సు సదుపాయం ఉన్నప్పటికీ పేద రోగులను సైతం ప్రైవేటు అంబులెన్సులకు సిఫారసు చేయడం సరికాదన్నారు. దీనికి అధికారులు స్పందిస్తూ అంబులెన్సులు మరమ్మతుల్లో ఉన్నాయని చెప్పా రు. కాగా ఆస్పత్రి భవనాల నిర్మాణం అస్తవ్యస్తంగా ఉందని, సమగ్ర డ్రైనేజ్ వ్యవస్థ లేదంటూ ఇంజినీరింగ్ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రిమ్స్‌లో ఉన్న బాత్రూమ్లన్నింటిని వాడుకలోకి తీసుకురావాలని ఆదేశించారు. వైద్యులు, ప్రొఫెసర్ల కొరతకు సంబంధించి వివరాలు ఇస్తే భర్తీ చేయించేందుకు కృషి చేస్తానన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీలను వారం రోజుల్లో ఇక్కడకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాననన్నారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ప్రస్తావన వచ్చినప్పుడు పదేళ్లుగా అక్షయ అనే ఒకే సంస్థను కొనసాగించడమేమిటని మంత్రి అధికారులను నిలదీశారు. వెంటనే ఆ కాంట్రాక్టును రద్దు చేసి కొత్త ఏజెన్సీలను ఆహ్వానించాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా నిబంధనల ప్రకారం నియమించాలని కలెక్టర్‌కు సూచించారు. ప్రభుత్వ విప్ కూన రవికుమార్ మాట్లాడుతూ ఇంత పెద్ద ఆస్పత్రిలో ఎం.ఆర్.ఐ స్కాన్ ఎందుకు పెట్టలేకపోయారన్నారు. పలు విభాగాల్లో అందుతున్న సేవల వివరాలు అడిగారు. నర్సింగ్ కళాశాలను ఆమదాలవలసలో ఏర్పాటు చేయాలని కలెక్టరును కోరారు. జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ ప్రతి కేసును విశాఖపట్నానికి ఎందుకు సిఫారసు చేస్తున్నారో తెలుసుకుంటామన్నారు. ఆస్పత్రి అభివృద్ధిపై ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. రిమ్స్ డెరైక్టర్ టి.జయరాజ్ ఇక్కడ అందిస్తున్న సేవలను వివరించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు చౌదరి ధనలక్ష్మి, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, జే సీ జి.వీరపాండ్యన్, ఆర్డీవో జి.గణేష్‌కుమార్, రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, డీఆర్డీఏ పీడీ ఎస్.తనూజారాణి, సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు బరాటం కామేశ్వరరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.