రిఫరల్ అంటే పంపేయడమా!?
రిమ్స్ క్యాంపస్: జిల్లా కేంద్రంలో రిఫరల్ ఆస్పత్రి ఉందంటే దానర్థం.. జిల్లాలోని ఇతర ఆస్పత్రుల నుంచి సీరియస్ కేసులను ఇక్కడికి రిఫర్ చేయడం.. కానీ ఈ ఆర్థాన్ని రిమ్స్ అధికారులు మార్చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే కేసులను వైజాగ్‌కు పంపేస్తూ రిఫరల్ అన్న పదానికి కొత్త నిర్వచనం ఇస్తున్నారు..!
ఈ మాటలన్నదెవరో కాదు.. రాష్ట్ర కార్మిక, క్రీడల శాఖ మంత్రి అచ్చెన్నాయుడే. ఇలా అయి తే ప్రజలకు ఏం నమ్మకం ఉంటుందని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం రిమ్స్‌లో జరిగిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇక్కడ రోగులకు వైద్యసేవలు సంతృప్తికరంగా అందడంలేదన్నారు. రిమ్స్‌కు రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితికి తీసుకువచ్చారని అధికారులను తప్పు పట్టారు. కనీసం మంచాలపై బెడ్‌షీట్లు కూడా ఉండటం లేదు.
అంత బద్దకంగా విధులు నిర్వహిస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రికి వచ్చే అత్యవసర కేసుల్లో చాలా వరకు విశాఖపట్నానికి రిఫర్ అవుతున్నాయి. ఈ మాత్రం దానికి రిమ్స్ ఎందుకని ప్రశ్నించారు. గతంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధే ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నా జిల్లా కేంద్ర ఆస్పత్రి పరిస్థితి ఇంత దారుణంగా ఉండటమేమిటని ప్రశ్నించారు. ఆయన పని చేయలేదా? లేక ఆయన మీతో పని చేయించుకోలేకపోయారా?? అని నిలదీశారు. ఇక్కడి వైద్యులు బయట ప్రైవేటు ప్రాక్టీస్ చేసుకున్నా అడగనని.. అయితే రిమ్స్‌లో ఓపీ సమయ పాలన, డాక్టర్ల హాజరు మాత్రం తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఆస్పత్రి మొత్తానికి ఒకే ఒక్క ఆర్థోపెడిక్ వైద్యుడు ఉండటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.
ఆరు నెలల్లో మార్చేస్తా
రిమ్స్ సమస్యల పరిష్కారానికి శాయుశక్తులా కృషి చేస్తానని, ఆరు నెలల్లో మార్పు తీసుకువస్తామని మంత్రి చెప్పారు. ైవె ద్యుల్లో మార్పు రావాలని హెచ్చరించారు. అంబులెన్సులను అందుబాటులో రోగులకు ఉంచాలని ఆదేశించారు. అంబులెన్సు సదుపాయం ఉన్నప్పటికీ పేద రోగులను సైతం ప్రైవేటు అంబులెన్సులకు సిఫారసు చేయడం సరికాదన్నారు. దీనికి అధికారులు స్పందిస్తూ అంబులెన్సులు మరమ్మతుల్లో ఉన్నాయని చెప్పా రు. కాగా ఆస్పత్రి భవనాల నిర్మాణం అస్తవ్యస్తంగా ఉందని, సమగ్ర డ్రైనేజ్ వ్యవస్థ లేదంటూ ఇంజినీరింగ్ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రిమ్స్‌లో ఉన్న బాత్‌రూమ్‌లన్నింటిని వాడుకలోకి తీసుకురావాలని ఆదేశించారు.
వైద్యులు, ప్రొఫెసర్ల కొరతకు సంబంధించి వివరాలు ఇస్తే భర్తీ చేయించేందుకు కృషి చేస్తానన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీలను వారం రోజుల్లో ఇక్కడకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాననన్నారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ప్రస్తావన వచ్చినప్పుడు పదేళ్లుగా అక్షయ అనే ఒకే సంస్థను కొనసాగించడమేమిటని మంత్రి అధికారులను నిలదీశారు. వెంటనే ఆ కాంట్రాక్టును రద్దు చేసి కొత్త ఏజెన్సీలను ఆహ్వానించాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా నిబంధనల ప్రకారం నియమించాలని కలెక్టర్‌కు సూచించారు. ప్రభుత్వ విప్ కూన రవికుమార్ మాట్లాడుతూ ఇంత పెద్ద ఆస్పత్రిలో ఎం.ఆర్.ఐ స్కాన్ ఎందుకు పెట్టలేకపోయారన్నారు.
పలు విభాగాల్లో అందుతున్న సేవల వివరాలు అడిగారు. నర్సింగ్ కళాశాలను ఆమదాలవలసలో ఏర్పాటు చేయాలని కలెక్టరును కోరారు. జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ ప్రతి కేసును విశాఖపట్నానికి ఎందుకు సిఫారసు చేస్తున్నారో తెలుసుకుంటామన్నారు. ఆస్పత్రి అభివృద్ధిపై ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. రిమ్స్ డెరైక్టర్ టి.జయరాజ్ ఇక్కడ అందిస్తున్న సేవలను వివరించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు చౌదరి ధనలక్ష్మి, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, జే సీ జి.వీరపాండ్యన్, ఆర్డీవో జి.గణేష్‌కుమార్, రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, డీఆర్‌డీఏ పీడీ ఎస్.తనూజారాణి, సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు బరాటం కామేశ్వరరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.