సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కార్మిక రాజ్యబీమా (ఈఎస్‌ఐ) ఆస్పత్రుల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. గత ప్రభుత్వ హయాంలో రూ.వందలాది కోట్ల నిధులు దుర్వినియోగమైన విషయం తెలిసిందే. ఇకపై ఇలాంటి కొనుగోళ్లలో అవినీతికి తావు లేకుండా ఇ–ఔషధి తరహాలోనే ‘ధన్వంతరి’ విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. గతంలోనే ధన్వంతరి సాఫ్ట్‌వేర్ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర కార్మిక శాఖ ఆంధ్రప్రదేశ్‌కు పదేపదే సూచించింది. ఈ విధానం అమల్లోకి తెస్తే.. అవినీతికి ఆస్కారం ఉండదని, నిధులు కాజేసేందుకు అవకాశం ఉండదన్న ఉద్దేశంతో చంద్రబాబు సర్కారు దీనిని పక్కన పడేసింది. అన్ని విభాగాల్లో అవినీతికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించిన ప్రస్తుత ప్రభుత్వం ఈ నెలాఖరు నాటికి ఈ విధానం అమల్లోకి తీసుకు రావాలని నిర్ణయించింది. దీనివల్ల 14 లక్షల మంది కార్మికులతో పాటు మరో 30 లక్షల మందికి పైగా కార్మికుల కుటుంబ సభ్యులకూ మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో 78 డిస్పెన్సరీలు, 4 ప్రాంతీయ ఆస్పత్రులు, 4 డయాగ్నస్టిక్ సెంటర్లకు వెళ్లే కార్మికులకు కొత్త విధానం వల్ల ఊరట కలగనుంది. ప్రస్తుతం ఢిల్లీలో మాత్రమే ధన్వంతరి విధానం అమల్లో ఉంది.
ఆన్‌లైన్‌లోకి రిఫరల్ ఆస్పత్రులు
ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో తగిన వైద్యం అందుబాటులో లేకపోతే రిఫరల్ ఆస్పత్రులుగా గుర్తించిన ప్రైవేట్ ఆస్పత్రులకు కార్మికులు వెళ్లేవారు. అక్కడ పూర్తిగా మాన్యువల్ బిల్లులే ఉండేవి. దీంతో కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు కార్మికుల పేరిట నకిలీ బిల్లులు సృష్టించి రూ.కోట్లు కొల్లగొట్టేవారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈఎస్‌ఐ పరిధిలో ఉండే 120 రిఫరల్ ఆస్పత్రులు ధన్వంతరి సాఫ్ట్‌వేర్ పరిధిలోకి రానున్నాయి. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు ఏ విధంగా బిల్లులు చెల్లిస్తున్నారో.. వీటికి కూడా అదే తరహాలోనే చెల్లింపులు చేస్తారు. 10 కిలోమీటర్ల దూరంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి లేకపోతే అక్కడి కార్మికుడు నేరుగా ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లచ్చు. ఆస్పత్రి నుంచి పేషెంట్ వివరాలు ఈఎస్‌ఐకి అందించాలి. ఆ వెంటనే ఇక్కడ నుంచి అనుమతులు ఇస్తారు. రోగుల చేరిక, ఓపీ, ఐపీ, బిల్లులు పెట్టడం ఇకపై అన్నీ ఆన్‌లైన్‌లో చేయాల్సిందే.
మందుల కొనుగోళ్లకూ..
ప్రస్తుతం రాష్ట్రంలో ఆన్‌లైన్‌లో మందులు కొంటున్నది ఏపీఎంఎస్‌ఐడీసీ పరిధిలోనే. ఇప్పుడు అదే విధానాన్ని ఈఎస్‌ఐలోనూ అనుసరించబోతున్నారు. ఇప్పటివరకు మందుల కొనుగోలు పేరిట రూ.వందల కోట్లు దుర్వినియోగమయ్యాయి. గతంలో పితాని సత్యనారాయణ, అచ్చెన్నాయుడు మంత్రులుగా ఉన్న సమయంలో ఇదే తంతు జరిగింది. ఇకపై అలా కాకుండా ఏ ఆస్పత్రికి ఎన్ని మందులు అవసరమో డాక్టర్లు ఇండెంట్ ఇస్తే.. ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ ద్వారా కొనుగోలు చేసేలా ఈఎస్‌ఐ అధికారులు ఏపీఎంఎస్‌ఐడీసీతో మాట్లాడుతున్నారు.
పక్కాగా పేషెంట్ల రిజిస్ట్రీ
రాష్ట్రంలో ఈఎస్‌ఐ సౌకర్యం గల కార్మికులు, వారి కుటుంబ సభ్యులు కలిపి 44 లక్షల మంది పైనే ఉన్నారు. వీరిలో ఎవరైనా ఈఎస్‌ఐ ఆస్పత్రులకు వెళితే వారి పేరు, వివరాలు, ఐడీ నంబర్ పక్కాగా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. వారికి ఏయే మందులు, ఎన్నెన్ని ఇచ్చారు, ఏ డాక్టర్ చికిత్స చేశారు, రక్త పరీక్షలేమైనా చేశారా వంటి వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సిందే. ఏ ఒక్క రోగికి సంబంధించిన పేరు నమోదు చేయకపోయినా ఆ డిస్పెన్సరీ ఉద్యోగులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఇక అన్నీ ఆన్‌లైన్‌లోనే..
‘ధన్వంతరి’ సాఫ్ట్‌వేర్‌ను అమల్లోకి తెస్తున్నాం. రిఫరల్ ఆస్పత్రుల నమోదు పూర్తయింది. పేషెంట్ రిజిస్ట్రీ ఆన్‌లైన్ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఇకపై మాన్యువల్‌గా చేసేవేవీ ఉండవు. అన్నీ ఆన్‌లైన్‌లో వస్తే అనుమతులు ఇస్తాం. వేలాదిమంది రోగులకు చెల్లించాల్సిన బకాయిలన్నీ చెల్లిస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా వారికి బిల్లులు చెల్లించలేదు.
–డాక్టర్ కుమార్ లక్కింశెట్టి, డైరెక్టర్, ఈఎస్‌ఐ
ఈఎస్‌ఐలో ధన్వంతరి
Published Sun, Feb 21 2021 6:19 AM | Last Updated on Sun, Feb 21 2021 6:20 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment