ESIC Hospitals
-
రామచంద్రాపురం, నాచారం ఈఎస్‌ఐసీలు త్వరలో ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐసీ ఆస్పత్రుల ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, తదనుగుణంగా నగరంలోని ఈఎస్ఐసీ కోసం కొత్త క్యాథ్‌ల్యాబ్, న్యూక్లియర్ మెడిసిన్ ల్యాబ్‌ను అందించామని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమమ్ ఆడిటోరియంలో శనివారం జరిగిన సనత్‌నగర్ ఈఎస్ఐసీ వైద్య కళాశాల స్నాతకోత్సవానికి భూపేందర్‌తో పాటు కేంద్రమంత్రులు జి.కిషన్‌రెడ్డి, రామేశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ వైద్యకళాశాల నుంచి వచ్చిన ఎంబీబీఎస్ తొలిబ్యాచ్ (2016–2017) వైద్యులకు డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ..ఈఎస్ఐసీల అభివృద్ధి కోసం 9 ప్రణాళికలను రూపొందిం చామని అందులో భాగంగా రామచంద్రాపురం, నాచారంలో ఏర్పాటు చేసిన కొత్త ఈఎస్‌ఐసీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని వాటిని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. రామగుండం, శంషాబాద్, సంగారెడ్డిలో 100 పడకల ఆస్పత్రులు నిర్మించేందుకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. యోగా దినోత్సవం సందర్భంగా 160 ఈఎస్ఐసీ కేంద్రాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈఎస్ఐసీ ఆస్పత్రి సిబ్బంది అంకితభావం, నాణ్యమైన వైద్య సేవల పట్ల కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కోవిడ్–19 సమయంలో ఈఎస్ఐసీ లబ్ధిదారులకే కాకుండా సాధారణ ప్రజలకు కూడా నిస్వార్థ సేవలు అందించిందని కొనియాడారు. స్వస్త్ భారత్ దిశగా పని చేయాలని వైద్యులకు రామేశ్వర్ సూచించారు. స్నాతకోత్సవంలో వైద్యులు ఎన్.కృష్ణశ్రీ ఎనిమిది, ఎం.లక్ష్మీ లాస్య, కె.అన్నపూర్ణ, పీవీఎస్ లలిత సాయిశ్రీలు ఐదేసి చొప్పున స్వర్ణ పతకాలను అందుకున్నారు. కార్యక్రమంలో కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సునీల్ బరత్వాల్, ఈఎస్ఐసీ సంచాలకుడు జనరల్ ముఖ్మీత్ ఎస్.భాటియా, మెడికల్ కమిషనర్ డాక్టర్ అన్షు చబ్రా తదితరులు పాల్గొన్నారు. -
ఈఎస్ఐలో ధన్వంతరి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కార్మిక రాజ్యబీమా (ఈఎస్ఐ) ఆస్పత్రుల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. గత ప్రభుత్వ హయాంలో రూ.వందలాది కోట్ల నిధులు దుర్వినియోగమైన విషయం తెలిసిందే. ఇకపై ఇలాంటి కొనుగోళ్లలో అవినీతికి తావు లేకుండా ఇ–ఔషధి తరహాలోనే ‘ధన్వంతరి’ విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. గతంలోనే ధన్వంతరి సాఫ్ట్వేర్ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర కార్మిక శాఖ ఆంధ్రప్రదేశ్‌కు పదేపదే సూచించింది. ఈ విధానం అమల్లోకి తెస్తే.. అవినీతికి ఆస్కారం ఉండదని, నిధులు కాజేసేందుకు అవకాశం ఉండదన్న ఉద్దేశంతో చంద్రబాబు సర్కారు దీనిని పక్కన పడేసింది. అన్ని విభాగాల్లో అవినీతికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించిన ప్రస్తుత ప్రభుత్వం ఈ నెలాఖరు నాటికి ఈ విధానం అమల్లోకి తీసుకు రావాలని నిర్ణయించింది. దీనివల్ల 14 లక్షల మంది కార్మికులతో పాటు మరో 30 లక్షల మందికి పైగా కార్మికుల కుటుంబ సభ్యులకూ మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో 78 డిస్పెన్సరీలు, 4 ప్రాంతీయ ఆస్పత్రులు, 4 డయాగ్నస్టిక్ సెంటర్లకు వెళ్లే కార్మికులకు కొత్త విధానం వల్ల ఊరట కలగనుంది. ప్రస్తుతం ఢిల్లీలో మాత్రమే ధన్వంతరి విధానం అమల్లో ఉంది. ఆన్‌లైన్‌లోకి రిఫరల్ ఆస్పత్రులు ఈఎస్ఐ ఆస్పత్రుల్లో తగిన వైద్యం అందుబాటులో లేకపోతే రిఫరల్ ఆస్పత్రులుగా గుర్తించిన ప్రైవేట్ ఆస్పత్రులకు కార్మికులు వెళ్లేవారు. అక్కడ పూర్తిగా మాన్యువల్ బిల్లులే ఉండేవి. దీంతో కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు కార్మికుల పేరిట నకిలీ బిల్లులు సృష్టించి రూ.కోట్లు కొల్లగొట్టేవారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈఎస్ఐ పరిధిలో ఉండే 120 రిఫరల్ ఆస్పత్రులు ధన్వంతరి సాఫ్ట్వేర్ పరిధిలోకి రానున్నాయి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు ఏ విధంగా బిల్లులు చెల్లిస్తున్నారో.. వీటికి కూడా అదే తరహాలోనే చెల్లింపులు చేస్తారు. 10 కిలోమీటర్ల దూరంలో ఈఎస్ఐ ఆస్పత్రి లేకపోతే అక్కడి కార్మికుడు నేరుగా ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లచ్చు. ఆస్పత్రి నుంచి పేషెంట్ వివరాలు ఈఎస్ఐకి అందించాలి. ఆ వెంటనే ఇక్కడ నుంచి అనుమతులు ఇస్తారు. రోగుల చేరిక, ఓపీ, ఐపీ, బిల్లులు పెట్టడం ఇకపై అన్నీ ఆన్లైన్లో చేయాల్సిందే. మందుల కొనుగోళ్లకూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ఆన్లైన్లో మందులు కొంటున్నది ఏపీఎంఎస్ఐడీసీ పరిధిలోనే. ఇప్పుడు అదే విధానాన్ని ఈఎస్ఐలోనూ అనుసరించబోతున్నారు. ఇప్పటివరకు మందుల కొనుగోలు పేరిట రూ.వందల కోట్లు దుర్వినియోగమయ్యాయి. గతంలో పితాని సత్యనారాయణ, అచ్చెన్నాయుడు మంత్రులుగా ఉన్న సమయంలో ఇదే తంతు జరిగింది. ఇకపై అలా కాకుండా ఏ ఆస్పత్రికి ఎన్ని మందులు అవసరమో డాక్టర్లు ఇండెంట్ ఇస్తే.. ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ ద్వారా కొనుగోలు చేసేలా ఈఎస్ఐ అధికారులు ఏపీఎంఎస్‌ఐడీసీతో మాట్లాడుతున్నారు. పక్కాగా పేషెంట్ల రిజిస్ట్రీ రాష్ట్రంలో ఈఎస్ఐ సౌకర్యం గల కార్మికులు, వారి కుటుంబ సభ్యులు కలిపి 44 లక్షల మంది పైనే ఉన్నారు. వీరిలో ఎవరైనా ఈఎస్ఐ ఆస్పత్రులకు వెళితే వారి పేరు, వివరాలు, ఐడీ నంబర్ పక్కాగా ఆన్లైన్లో నమోదు చేస్తారు. వారికి ఏయే మందులు, ఎన్నెన్ని ఇచ్చారు, ఏ డాక్టర్ చికిత్స చేశారు, రక్త పరీక్షలేమైనా చేశారా వంటి వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేయాల్సిందే. ఏ ఒక్క రోగికి సంబంధించిన పేరు నమోదు చేయకపోయినా ఆ డిస్పెన్సరీ ఉద్యోగులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇక అన్నీ ఆన్లైన్లోనే.. ‘ధన్వంతరి’ సాఫ్ట్‌వేర్‌ను అమల్లోకి తెస్తున్నాం. రిఫరల్ ఆస్పత్రుల నమోదు పూర్తయింది. పేషెంట్ రిజిస్ట్రీ ఆన్లైన్ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఇకపై మాన్యువల్‌గా చేసేవేవీ ఉండవు. అన్నీ ఆన్లైన్లో వస్తే అనుమతులు ఇస్తాం. వేలాదిమంది రోగులకు చెల్లించాల్సిన బకాయిలన్నీ చెల్లిస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా వారికి బిల్లులు చెల్లించలేదు. –డాక్టర్ కుమార్ లక్కింశెట్టి, డైరెక్టర్, ఈఎస్ఐ -
ఏపీలో మరో 7 ఈఎస్ఐ ఆస్పత్రులు
సాక్షి, న్యూఢిల్లీ: గుంటూరు, విజయనగరం, కాకినాడ, పెనుగొండ, విశాఖ, శ్రీసిటీ నెల్లూరు, అచ్యుతాపురంలలో ఈఎస్ఐ నూతన ఆస్పత్రులకు సూత్రప్రాయ అనుమతిచ్చినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ రాజ్యసభలో తెలిపారు. మార్చి 2023లోగా రూ.73.68 కోట్లతో విజయనగరంలో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. బుధవారం వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కె.రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. గృహ రుణాల వడ్డీపై రాయితీ చెల్లింపు పథకం (సీఎల్ఎస్ఎస్)ను ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించినట్లు కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ హర్దీప్సింగ్ పురి తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(అర్బన్) కింద అర్హులైన మధ్యతరగతి ప్రజల గృహ రుణాలపై వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో చెల్లిస్తుందని విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. కర్నూలు–విజయవాడ, విజయవాడ–కర్నూలు విమాన సరీ్వసులు ఇంకా ప్రారంభం కాలేదని వైఎస్సార్సీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రకాశం బ్యారేజీ–హైదరాబాద్, విజయవాడ–నాగార్జున సాగర్ మధ్య సీ–ప్లేన్ సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదన్నారు. గత 19 నెలల్లో ఏపీలోని హిందూ దేవాలయాలపై 140కి పైగా దాడులు, దేవతా విగ్రహాలను కూల్చివేసి, అపవిత్రం చేయడం వంటి ఘటనలు జరిగాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ జీరో అవర్‌లో ప్రస్తావించారు. చేనేత రంగాన్ని ఆదుకోవాలి ఏపీ సహా దేశవ్యాప్తంగా చేనేత రంగాన్ని ఆదుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మౌలిక సదుపాయాల రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వైఎస్సార్సీపీ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. చెన్నై–బెంగళూరు–మైసూరు హైస్పీడ్ రైలుపై వైఎస్సార్సీపీ ఎంపీ రెడ్డప్ప అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ బదులిచ్చారు. అనంతపురం నుంచి ఢిల్లీలోని ఆదర్శనగర్ వరకూ కిసాన్ రైలు సేవలు అందిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. వైఎస్సార్సీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, ఎన్.రెడ్డెప్ప, బి.సత్యవతి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సంబంధిత కేంద్రమంత్రులు సమాధానమిచ్చారు. పుణేలోని సీ–డాక్లో జాతీయ కృత్రిమ మేథస్సు సూపర్ కంప్యూటర్ ‘పరం సిద్ధి’ ఏర్పాటుకు రూ.72.25 కోట్లు ఖర్చు చేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ తలారి రంగయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకరప్రసాద్ బదులిచ్చారు. -
ఈఎస్ఐసీలో ప్లాస్మా ట్రయల్స్‌కు అనుమతి
సాక్షి, హైదరాబాద్: కరోనా రోగులపై ప్లాస్మా ట్రయల్స్ చేసేందుకు గాంధీ ఆసుపత్రితోపాటు హైదరాబాద్‌లోని ఈఎస్ఐసీ హాస్పిటల్‌కు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) శుక్రవారం అనుమతి ఇచ్చింది. దేశవ్యాప్తంగా మొత్తం 113 ఆసుపత్రులు దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకు 28 ఆసుపత్రులకు అనుమతి ఇచ్చారు. అందులో భాగంగా మన రాష్ట్రంలో రెండింటికి అనుమతి వచ్చింది. ప్రస్తుతం ఈఎస్ఐసీలో కరోనా చికిత్సలు చేయడం లేదు. ప్లాస్మా ట్రయల్స్‌కు అనుమతి వచ్చిన నేపథ్యంలో అక్కడ కూడా కరోనా చికిత్స ప్రారంభించే అవకాశముంది. అలాగే గుజరాత్లో 5, రాజస్తాన్‌లో 4, పంజాబ్‌లో ఒకటి, మహారాష్ట్రలో 5, తమిళనాడులో 4, మధ్యప్రదేశ్‌లో 3, ఉత్తరప్రదేశ్‌లో 2, కర్ణాటక, చండీగఢ్‌లో ఒక్కో ఆసుపత్రికి అనుమతి ఇచ్చారు. మరో 83 ఆసుపత్రుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నామని ఐసీఎంఆర్ వెల్లడించింది. దరఖాస్తుల పరిశీలనలో హైదరాబాద్‌లోని అపోలో, ఏఐజీ ఆసుపత్రులు కూడా ఉన్నాయని ఐసీఎంఆర్ తెలిపింది. (చదవండి: తెలంగాణలో మరో 10 పాజిటివ్ ) -
ఈఎస్ఐలో ఇక్కట్లు
అమీర్‌పేట్: సనత్‌నగర్ ఈఎస్ఐ వైద్య కళాశాల బోధన ఆస్పత్రిలో రోగులకు సకాలంలో వైద్యం అందడం లేదు. కార్డు లబ్ధిదారుల పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఓపీ (ఔట్ పేషెంట్ బ్లాక్) విభాగంలో పరిస్థితి మరింత దారుణంగా మారిందని రోగుల సహాయకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రతి రోజూ వేల సంఖ్యలో రోగులు ఓపీ బ్లాక్‌కు వస్తుంటారు. రోగులకు రద్దీకి అనుగుణంగా వైద్యులు ఉండటం లేదు. ముందుగా ఇన్పేషెంట్లను చూసి ఓపీకి ఆలస్యంగా వస్తుండటంతో రోగులు గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం 8 గంటలకే ఓపీకి వచ్చి క్యూలైన్లో ఉన్నప్పటికి 10 గంటల తర్వాతే వైద్యులు వస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. టెస్టుల చేస్తారేమోనని తినకుండా ఆస్పత్రి వచ్చేవారు స్పృహ తప్పి పడిపోతున్నారని చెబుతున్నారు. ప్రతిరోజూ నిర్ణీత సమయం వరకే ఓపీ ఉంటున్నందున ముందుగా ఓపీకి వచ్చే రోగులకు పరీక్షించి అనంతరం వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరీక్షించాలని కోరుతున్నారు. లేని పక్షంలో వైద్య సిబ్బందిని పెంచి సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
పది మంది ప్రాణాలు కాపాడిన ఫుడ్ డెలివరీ బాయ్
ముంబై: ముంబైలోని తూర్పు అంధేరిలోని ఈఎస్ఐసీ ఆస్పత్రిలో ఇటీవల సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన ఓ వ్యక్తి పది మంది ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం సాయంత్రం ఫుడ్ డెలివరీ బాయ్ సిద్ధు(20) అటుగా వెళ్తూ.. అగ్ని ప్రమాద దృశ్యాలను చూశారు. వెంటనే అక్కడ మంటలు ఆర్పుతున్న అగ్ని మాపక సిబ్బంది వద్దకు వెళ్లి తాను కూడా సహాయక చర్యల్లో పాల్గొంటానని తెలిపారు. వారి అంగీకారంతో సహాయక చర్యల్లో పాల్గొన్న సిద్ధు రెండు గంటల పాటు తీవ్రంగా శ్రమించి పది మంది ప్రాణాలు కాపాడారు. నాలుగో అంతస్తులోని పెషెంట్లను అగ్ని మాపక దళానికి చెందిన నిచ్చెన ద్వారా కిందకి దించడంలో కీలక భూమిక పోషించారు. ఆ సమయంలో దట్టమైన పొగ వల్ల అనారోగ్యానికి గురైన సిద్ధు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సిద్ధు మీడియాతో మాట్లాడుతూ.. ‘తమను కాపాడామంటూ ఆస్పత్రిలో నుంచి పెషేంట్లు కేకలు వినబడటంతో నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. అగ్ని మాపక సిబ్బందితో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నాను. గొడ్డలితో బిల్డింగ్ అద్దాలను పగులగొట్టి ఆస్పత్రిలోనికి ప్రవేశించాను. అక్కడి నుంచి నిచ్చెన ద్వారా పెషెంట్లను కిందకు దించాను. ఆ సమయంలో ఓ మహిళ నా చేతుల నుంచి జారి కింద పడిపోయారు. కానీ ఆమె ప్రమాదం నుంచి బయటపడ్డారు. బాధితులను పరామర్శించడానికి వచ్చిన కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ నా యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నార’ని తెలిపారు. -
ముంబై ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం
సాక్షి ముంబై: తూర్పు అంధేరిలోని ఈఎస్ఐసీ ఆస్పత్రిలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించగా 141 మందికి గాయాలయ్యాయి. ఎంఐడీసీ సమీపంలో ఉన్న ఈఎస్ఐసీ ఆస్పత్రి భవనం చివరి నాలుగో అంతస్తులో సోమవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు యత్నించారు. మంటల కారణంగా దట్టమైన పొగ అలుముకోవడంతో రోగులు శ్వాసించేందుకు ఇబ్బంది పడ్డారు. అప్పటికే కొందరు సమయస్ఫూర్తితో వ్యవహరించి పలువురిని సురక్షితంగా బయటికి తీయగలిగారు. అగ్నిమాపక సిబ్బంది నిచ్చెనల సాయంతో రోగులను, వారి సంబంధీకులను, సిబ్బందిని సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. రాత్రి ఎనిమిది గంటల వరకు అందిన సమాచారం మేరకు ఆరుగురు మరణించారు. వీరిలో ఒక రోగి ప్రాణభయంతో పైనుంచి దూకి ప్రాణాలు కోల్పోగా మరొకరు ఊపిరాడక మృతి చెందినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన నలుగురు ఆస్పత్రిలో చనిపోయారు. క్షతగాత్రులైన 141 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. రాత్రి వరకు మంటలు అదుపులోకి వచ్చాయి. -
ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం : 5గురి మృతి
సాక్షి,ముంబై: ముంబైలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అంధేనిలోని ఈఎస్ఐసీ కామ్‌గార్ ఆసుపత్రిలో హఠాత్తుగా మంటలంటు కున్నాయి. దీంతో రోగులు పరుగులు తీయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. పొగదట్టంగా వ్యాపించడంతో ఊపిరాడక రోగులు, వారి బంధువులు సతమతమయ్యారు. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 147మందికి తీవ్ర గాయాలయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. మరోవైపు సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయ కార్యక్రమాను పర్యవేక్షిస్తున్నారు. 10 అగ్నిమాపక శకటాలు, సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. మంటల్లో చిక్కుక్కున్నవారిని రక్షించేందుకు శ్రమిస్తున్నాయి. 16 అంబులెన్స్‌లను ప్రమాద స్థలానికి తరలించి సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
జిల్లాకో ఈఎస్ఐసీ డిస్పెన్సరీ, బ్రాంచి ఆఫీస్
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) డిస్పెన్సరీ కమ్ బ్రాంచి కార్యాలయాలను జిల్లాకొకటి చొప్పున దేశవ్యాప్తంగా ప్రారంభించాలని కార్మికశాఖ నిర్ణయించింది. ఆ శాఖ మంత్రి గంగ్వార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్తగా ప్రారంభించే ఈఎస్ఐసీ డిస్పెన్సరీ కమ్ బ్రాంచి ఆఫీసు(డీసీబీవో)లు ప్రాథమిక వైద్యంతోపాటు రెఫరెల్ సేవలు, బిల్లుల పరిశీలన, మందుల పంపిణీ వంటి సేవలను అందిస్తాయి. డీసీబీవోల నిర్వహణ బాధ్యతను ఈఎస్ఐసీ చూస్తుంది. ఈఎస్ఐసీ ఆస్పత్రుల్లో నర్సింగ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంను ప్రారంభించాలని కూడా కార్మికశాఖ నిర్ణయించింది. ఇంటర్న్‌షిప్ కాలంలో నర్సులకు రూ.22వేల స్టైపెండ్‌ను కూడా అందించనుంది. కొన్ని ఈఎస్ఐసీ ఆస్పత్రుల సామర్థ్యాన్ని పెంచటంతోపాటు కొత్త ఆస్పత్రుల నిర్మాణానికి కూడా ఈ సమావేశం ఆమోదం తెలిపింది. -
కార్మికుల పిల్లలకు ప్రత్యేక రిజర్వేషన్లు: దత్తాత్రేయ
హైదరాబాద్: చట్టంలో పలు మార్పులు చేసి కార్మికులకు ఉద్యోగ, వేతన భద్రతను పెంచామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో గురువారం ఏర్పాటుచేసిన మోదీ మూడేళ్ల సుపరిపాలన సదస్సులో కేంద్రమంత్రులు దత్తాత్రేయ, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ సనత్‌నగర్ ఈఎస్ఐ వైద్య కళాశాలలో కార్మికుల పిల్లలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. రామగుండంలో 100 పడకల ఆస్పత్రి, వరంగల్‌లో 50 పడకల ఆస్పత్రి నిర్మిస్తామని వెల్లడించారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రభుత్వం కఠినమైన చట్టం చేసిందన్నారు. విద్యాహక్కు చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు.