సాక్షి ముంబై: తూర్పు అంధేరిలోని ఈఎస్‌ఐసీ ఆస్పత్రిలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించగా 141 మందికి గాయాలయ్యాయి. ఎంఐడీసీ సమీపంలో ఉన్న ఈఎస్‌ఐసీ ఆస్పత్రి భవనం చివరి నాలుగో అంతస్తులో సోమవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు యత్నించారు. మంటల కారణంగా దట్టమైన పొగ అలుముకోవడంతో రోగులు శ్వాసించేందుకు ఇబ్బంది పడ్డారు.
అప్పటికే కొందరు సమయస్ఫూర్తితో వ్యవహరించి పలువురిని సురక్షితంగా బయటికి తీయగలిగారు. అగ్నిమాపక సిబ్బంది నిచ్చెనల సాయంతో రోగులను, వారి సంబంధీకులను, సిబ్బందిని సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. రాత్రి ఎనిమిది గంటల వరకు అందిన సమాచారం మేరకు ఆరుగురు మరణించారు. వీరిలో ఒక రోగి ప్రాణభయంతో పైనుంచి దూకి ప్రాణాలు కోల్పోగా మరొకరు ఊపిరాడక మృతి చెందినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన నలుగురు ఆస్పత్రిలో చనిపోయారు. క్షతగాత్రులైన 141 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. రాత్రి వరకు మంటలు అదుపులోకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment