ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : ‘ఆరోగ్య రక్ష.. అందని ద్రాక్ష’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై సర్వశిక్షాభియూన్ ప్రాజెక్ట్ అధికారి కె.విశ్వనాథ్, డీఎంహెచ్‌వో కె.శంకరరావు స్పందించారు. జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకం కింద విద్యార్థులందరికీ ఆరోగ్య రక్ష కార్డులు ఇచ్చామని, త్వరలోనే వైద్య పరీక్షలు జరిపించి మందులు ఇచ్చేందుకు, అవసరమైతే మెరుగైన వైద్యం చేరుుంచేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని శుక్రవారం విడుదల చేసిన ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులు 3.96 లక్షల మంది ఉన్నారని, సర్వశిక్షాభియాన్, విద్యా హక్కు చట్టం-2009 ప్రకారం వారందరి కోసం ఆరోగ్య రక్ష కార్డులను పాఠశాలలకు పంపించామని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన ఉద్యమాలు, బంద్‌ల కారణంగా గత ఏడాది ఈ పథకం అమలుపై పర్యవేక్షణ చేయలేకపోరుునట్టు వివరణ ఇచ్చారు. ఈ విద్యా సంవత్సరంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, సర్వశిక్షాభియాన్ సమన్వయంతో సమగ్ర ప్రణాళికను రూపొందించామని తెలిపారు. దీనికోసం నియమించిన కమిటీ సమావేశాలను జూన్ 30న, జూలై 7న రెండు శాఖల సమన్వయంతో నిర్వహించామని పేర్కొన్నారు.
పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే సూచనలు ఇచ్చామన్నారు. జూన్ 12న పాఠశాలల్ని తెరిచినప్పటికీ వేసవి తీవ్రత కారణంగా ఆరోగ్య రక్ష కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించలేకపోయామన్నారు. ఇకపై పూర్తిస్ధాయిలో ఈ కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.