సాక్షి, కొరుక్కుపేట(తమిళనాడు): తెలుగు సినిమా ఆత్మగౌరవాన్ని జాతీయస్థాయిలో రెపరెపలాడించిన దర్శక దిగ్గజం కళాతపస్వి కె.విశ్వనాథ్ అని సీనియర్ నటుడు శరత్‌కుమార్ కొనియాడారు. తెలుగు కళావేదిక సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో రచయిత్రి డాక్టర్ కోడూరు సుమనశ్రీ రచించిన సామవేదంలో సామాజిక సృహ (కళా తపస్వి జీవన చిత్ర ప్రస్థానం) పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. మైలాపూరులోని ఆంధ్ర మహిళా సభలో ప్రముఖ సాహితీవేత్త ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్ సభాధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటుడు శరత్‌బాబు పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కె.విశ్వనాథ్ జీవిత విశేషాలతో పొందుపరిచిన ఈ పుస్తకం చదవటం మరపురాని అనుభూతిని కలిగించిందన్నారు. సంగీత సాహిత్యాలకు.. వెండితెర ద్వారా కె.విశ్వనాథ్ చేసిన కృషి అపారమన్నారు. శంకరాభరణం, సాగరసంగమం, స్వర్ణకమలం వంటి చిత్రాలన్నీ యుగాంతం వరకు నిలిచి ఉంటాయని కొనియాడారు. అనంతరం విశిష్ట అతిథి ప్రముఖ నాట్యాచార్యులు డాక్టర్ వేదాంతం రాధేశ్యాం మాట్లాడుతూ కూచిపూడి నాలుగు వేదాల సారాంశం అని, కళా తపస్వి తన చిత్రాల ద్వారా నిరూపించగలిగారని కొనియాడారు. ఆత్మీయ అతిథులుగా ప్రముఖ గాయని ఎస్పీ వసంత, సంగీత చక్రకర్త ఎల్.రమేష్ పాల్గొన్నారు. రచయిత్రి కోడూరు సుమనశ్రీ మాట్లాడుతూ ఇప్పటి వరకు నాలుగు పుస్తకాలు రచించానన్నారు. తెలుగు భాషపై, కళలను జీవింపచేసిన విశ్వనాథ్ అంటే నాకు ఎంతో ఇష్టమని అన్నారు. సభా పరిచయాన్ని ఎల్.శ్రీదేవి చేయగా, అను సిస్టర్స్, చక్రవర్తి, రాముల గానార్చన, దుర్గ మంత్రవాది నాట్యార్చనతో అలరించారు. వందన సమర్పణను పి.చంద్రకళ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment