‘బీసీల ఆరోగ్య ప్రమాణాలపై నివేదికివ్వండి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని బీసీల ఆరోగ్య ప్రమాణాలు, మహిళలు, శిశువుల ఆరోగ్య పరిస్థితిపై విశ్లేషణాత్మక నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు వైద్యారోగ్య శాఖను కోరారు. బీసీల రిజర్వేషన్ల పెంపు అధ్యయనంలో భాగంగా శాఖల వారీగా సమీక్ష నిర్వహిస్తున్న బీసీ కమిషన్.. శనివారం వైద్యారోగ్య శాఖతో సమావేశమైంది. ఈ సందర్భంగా బీఎస్ రాములు మాట్లాడుతూ.. బీసీల స్థితిగతులతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓసీ జాబితాలోని సామాజిక వర్గాల ఆరోగ్య ప్రమాణాల్లోని వ్యత్యాసాలను కూడా పేర్కొనాలన్నారు.
ప్రస్తుత అభివృద్ధి, నూతన నైపుణ్యాలను బీసీలలోని కొన్ని కులాలు అందుకోలేక పోతున్నాయని, ఆ వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఎంబీసీలు, సంచార జాతులపైనా అధ్యయనం చేస్తున్నామని పేర్కొన్నారు.