అధికారులకు మంత్రి దామోదర ఆదేశం
ఫుడ్‌సేఫ్టీపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖతో పాటు అనుబంధ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు వేగవంతం చేయాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పలు రకాల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించిందని, ఇంకా అవసరమైన మేరకు అనుమతులు జారీ చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు.
శనివారం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో తెలంగాణ మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎంఐడీసీ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం), బ్లడ్‌బ్యాంక్‌లు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ యాక్ట్ అమలు తదితరాలపై సంబంధిత అధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫుడ్ సేఫ్టీపై నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు నిర్వహించడం వల్ల నాణ్యమైన ఆహారం అందించడంలో దేశంలోనే తెలంగాణకు ఉత్తమ రాష్ట్రంగా గుర్తింపు లభిస్తుందన్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లోని వసతి గృహాలు, క్యాంటీన్లతో పాటు అన్ని ఆసుపత్రులలో ఉన్న క్యాంటీన్లలో ఫుడ్ సేఫ్టీపై నిరంతర పర్యవేక్షణ, నిఘా పెట్టాలని పేర్కొన్నారు. విద్యాసంస్థలతో పాటు ఆసుపత్రుల్లో ఉన్న క్యాంటీన్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌లు తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌ల ద్వారా విస్తృత తనిఖీలు నిర్వహించాలని, ఫుడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేశారు.
నాచారంలో ఉన్న ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌ను బలోపేతం చేయడంతో పాటు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శివలీల తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment