భయం గుప్పెట్లో జగ్గయ్యపేట | Diarrhea spreading to other villages | Sakshi
Sakshi News home page

భయం గుప్పెట్లో జగ్గయ్యపేట

Published Mon, Jun 24 2024 4:05 AM | Last Updated on Mon, Jun 24 2024 10:48 AM

Diarrhea spreading to other villages

ఇతర గ్రామాలకూ విస్తరిస్తున్న డయేరియా

ఇప్పటికే ఆరుగురు మృత్యువాత

తాజాగా మరో 11మంది ఆస్పత్రిపాలు

ప్రైవేటు ఆస్పత్రులకు తరలుతున్న బాధితులు

రాష్ట్రవ్యాప్తంగా 168 కేసులుంటే 

ఒక్క జగ్గయ్యపేటలోనే 58 నమోదు

కలుషిత నీరు, అస్తవ్యస్థ పారిశుధ్యం

అధికారుల అలసత్వమే కారణం: మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

40 బృందాలు, విజయవాడలో ప్రత్యేక వార్డు ఏర్పాటు

సాక్షి ప్రతినిధి, విజయవాడ/­లబ్బిపేట/జగ్గయ్యపేట : ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో డయేరియా (అతిసార) విస్తరిస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతానికి చెందిన ఆరుగురు ఈ కారణంతో మృత్యువాత పడడంతో జగ్గయ్యపేట పట్టణంతో పాటు, పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనతో వణికిపోతున్నారు.

 రాష్ట్రవ్యాప్తంగా 23 గ్రామాల్లో 168 డయేరియా కేసులు నమోదుకాగా, ఒక్క జగ్గయ్యపేట నియోజకవర్గంలోనే అధికారికంగా 58 కేసులు నమోదయ్యాయి. కొందరు బాధితులు ఖమ్మం, విజయవాడ, జగ్గయ్యపేట ప్రాంతాలకు వెళ్లి చికిత్స పొందుతుండడంతో ఇవి అధికార లెక్కల్లోకి రావటంలేదు. ఇక్కడ ఇప్పటికే ఆరుగురు మృతిచెందినప్పటికీ ఇద్దరు మాత్రమే మృతిచెందినట్లు అధికారులు నిర్ధారించారు. 

మరోవైపు.. ఆదివారం ఒక్కరోజే జగ్గయ్యపేట, వత్సవాయి మండలాలకు చెందిన11 మంది వాంతులు, విరేచనాలతో జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రిలో చేరారు. ఇప్పటికే 32 మంది చికిత్స పొందుతుండగా 12 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 

వైద్య, ఆరోగ్యశాఖ జాప్యం..
జగ్గయ్యపేట పట్టణంతో పాటు, షేర్‌ మహమ్మద్‌పేట, మక్కపేట, చిల్లకల్లు, బూదవాడ, అనుమంచిపల్లి, గండ్రాయిల్లో డయేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మృత్యువాత పడిన వారు కూడా ఈ ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. నిజానికి.. వైద్య, ఆరోగ్యశాఖ ఈ నెల 20నే డయేరియా కేసులను గుర్తించినా అదుపు చేయడంలో జాప్యం జరిగింది. ఆ తర్వాత అప్రమత్తమై ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేసింది. కానీ, అధికారుల హడావిడి తప్ప క్షేత్రస్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కరువయ్యాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. 



నీరు కలుషితం.. లోపించిన పారిశుధ్యం..
ఇదిలా ఉంటే.. డయేరియా సోకుతున్న గ్రామాల్లో నీరు కలుషితమైనట్లు వైద్యశాఖ అధికారులు గుర్తించారు. అలాగే, పారిశుధ్యం కూడా అస్తవ్యస్థంగా ఉందని.. నీటిని సరఫరా చేసే రక్షిత మంచినీటి ట్యాంకులు కూడా అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. ప్రధానంగా గ్రామాల్లో పారిశుధ్యం పూర్తిగా లోపించింది. 

ఉదా.. షేర్‌హమ్మద్‌పేట చెరువు ఒడ్డునే తాగునీటి బావి ఉంది. అక్కడ బావి పక్కనే చెత్త చెదారం పేరుకుపోయి ఉంది. పైగా ఆ బావిపైన  మెస్‌ కూడా లేకపోవడంతో నీరు పూర్తిగా కలుషితమవుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. అలాగే, అనుమంచిపల్లి, గండ్రాయి, బూదవాడ ప్రాంతాల్లోని పారిశుధ్యం పరిస్థితి కూడా ఇంతే. మక్కపేట ప్రాంతంలో తాగునీటిని ఫిల్టర్‌ చేయకుండానే సరఫరా చేస్తున్నట్లు సమాచారం.

ప్రత్యేక బృందాల ఏర్పాటు..
ఇక డయేరియా సోకుతున్న గ్రామాల్లో శానిటేషన్‌ మెరుగుదలకు వైద్య, ఆరోగ్యశాఖ 40 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో 45 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటుచేశారు. మరోవైపు.. జగ్గయ్యపేట ప్రాంతాన్ని ఆదివారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పర్యటించి బాధితులను పరామర్శించారు. 

ఆయా శాఖాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు అప్రమత్తంగా ఉండడంలేదని, అలసత్వం వహిస్తున్నారని.. అలాంటి వారిని ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. గ్రామాల్లో ఇంటింటి సర్వేచేయాలని, వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు, కమిషనర్‌ వెంకటేశ్వర్, జేసీ సంపత్‌కుమార్, ఆర్డీఓలు రవీందర్, మాధవి, డీఎంహెచ్‌ఓ సుహాసిని, వైద్యారోగ్య శాఖ అడిషనల్‌ ఏడీ సుబ్రహ్మణ్యశ్రీ, మున్సిపల్‌ చైర్మన్‌ రంగాపురం రాఘవేంద్ర తదితర అధికారులు పాల్గొన్నారు.

217 చోట్ల నీరు కలుషితం 
రాష్ట్రవ్యాప్తంగా 168 డయేరియా కేసులు నమోద­య్యాయని.. ఇందులో ఒక్క జగ్గయ్యపేటలోనే 58 కేసులున్నాయని మంత్రి చెప్పారు. ముఖ్యంగా డిస్ట్రి­బ్యూటరీ చానళ్లను శుభ్రం చేయక­పోవడం, పైపులైన్ల లీకేజీల వల్ల తాగునీటిలో డ్రెయి­నేజీ మురుగు కల­వడం ఇందుకు కారణమ­న్నారు. 

ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రతి బుధవారం గ్రామీణ ప్రాంతాల్లో నీటి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్‌ ప్రకటించారు. ఇప్పటికే 30 వేలకు పైగా నీటి వనరులు నమూనాలు పరీక్షించగా 217 ప్రాంతాల్లో నీరు కలుషి­త­మైనట్లు అధికారులు గుర్తించారన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement