‘ఐసీయూ’లో ఆస్పత్రులు
తక్షణ వైద్య సదుపాయం లేక అల్లాడుతున్న రోగులు
వెంటిలేటర్లు అందించాలని ప్రభుత్వానికి వైద్యవిద్యా శాఖ లేఖ
సాక్షి, హైదరాబాద్: తీవ్ర అనారోగ్యానికి గురై విషమ స్థితిలో ఉన్న రోగులను ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో చేరుస్తారు. రాష్ట్రంలో మాత్రం జబ్బుపడ్డ వారు కాకుండా ఆస్పత్రులే వసతులు లేక ఐసీయూకి తరలించే స్థితికి చేరుకున్నాయి. ఏ ఆస్పత్రిలో చూసినా వెంటిలేటర్ల కొరతతో రోగులు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. లేదంటే ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిందే. ప్రధాన ఆస్పత్రుల్లో ఐసీయూల కోసం కేంద్రం నిధులు తీసుకొచ్చైనా ఏర్పాట్లు చేయాలని వైద్యవిద్యాశాఖ సంచాలకులు ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాశారు. 2014-15కి కేంద్రం ఇప్పటికే రూ.46 కోట్లు కేటాయించిందని, అదనపు నిధుల కింద కనీసం మరో రూ.20 కోట్లు ఇవ్వాలని కోరారు. అక్యూట్ మెడికల్ కేర్(ఏఎంసీ), ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)ల పరిస్థితి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో దారుణంగా ఉందని నివేదించారు.
చావుబతుకుల్లో 20 శాతం రోగులు
చావుబతుకుల మధ్య ప్రభుత్వాసుపత్రులకు వస్తున్న సుమారు 20 శాతం మంది పేద రోగులకు తక్షణం వైద్యం చేయాలంటే ఐసీయూలు పనిచేయాల్సిన అవసరముందని వైద్యవిద్యాశాఖ లేఖలో పేర్కొంది. గుండె జబ్బులు, కిడ్నీ బాధితులు, తీవ్ర జ్వరాలు, ప్రమాద బాధితులు వీరిలో ఉన్నట్లు వివరించారు. రాష్ట్రంలో 11 బోధనాసుపత్రులు, రెండు జిల్లా ఆస్పత్రులతో కలిపి 13 ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ కేర్‌కు సంబంధించిన వైద్య పరికరాలు అందచేయాలని కోరింది. దీనికి కనీసం రూ.20 కోట్లు పైనే అవుతుందని అంచనా వేశారు. ఒక్కో ఆస్పత్రికి మల్టీచానల్ మానిటర్లు 3, ఐసీయూ పడకలు 30, ఇన్‌ఫ్యూజన్ పంపులు 60, వెంటిలేటర్లు 5 చొప్పున ఏర్పాటు చేయాలని సూచించింది. ఈఆర్థిక సంవత్సరం మరో మూడు నెలల్లో ముగుస్తున్నా ఇప్పటి వరకూ బోధనాసుపత్రులకు బడ్జెట్‌లో 45 శాతం నిధులు కూడా ప్రభుత్వం ఇవ్వలేదని వైద్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి.