పట్టాలపై లైఫ్‌లైన్‌ | Russia-Ukraine war: lifesaving hospital train bringing Ukraine wounded soldiers to safety | Sakshi
Sakshi News home page

పట్టాలపై లైఫ్‌లైన్‌

Published Fri, Sep 13 2024 5:47 AM | Last Updated on Fri, Sep 13 2024 5:47 AM

Russia-Ukraine war: lifesaving hospital train bringing Ukraine wounded soldiers to safety

బోగీలను ఐసీయూలుగా మార్చిన ఉక్రెయిన్‌ ప్రభుత్వం 

యుద్ధక్షేత్రంలో గాయపడిన సైనికులను ఆస్పత్రులకు తరలింపు 

సైనికుల ప్రాణాలు కాపాడటంలో ఇప్పుడిదే లైఫ్‌ లైన్‌

నర్సు ఓల్గా.. 
ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ అంతటా విరామం లేకుండా తిరుగుతూనే ఉన్నారు. రోగుల ఆక్సిజన్‌ స్థాయిలను తనిఖీ చేసి నోట్‌ చేసుకుంటున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న రోగులను ఓ కంట కనిపెడుతున్నారు. ఓ ఆస్పత్రిలో ఇదో సాధారణ దృశ్యం. కానీ ఆమె పనిచేస్తున్నది నడుస్తున్న రైలులో. వైద్యం అందిస్తున్నది యుద్ధంలో గాయాలపాలైన సైనికులకు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడానికి ఉక్రెయిన్‌ ఈ రైలాస్పత్రిని నడుపుతోంది. ఆ దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఇప్పుడిది కీలక భాగంగా మారింది.                                               

యుద్ధంలో గాయపడిన సైనికుల కోసం తూర్పు ఉక్రెయిన్‌లోని చాలా నగరాల్లోని ఆసుపత్రుల్లో పడకలు లేవు. అవి ఖాళీ చేయడానికి కొందరిని సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి వస్తుంది. అంబులెన్సుల్లో సుదూర ప్రయాణంతో సైనికుల ప్రాణాలకే ముప్పుకావచ్చు. రష్యా దాడుల నేపథ్యంలో హెలికాప్టర్‌ అంబులెన్స్‌లు కూడా ఉపయోగించలేరు. ఈ క్లిష్ట స్థితిలో రైళ్లు సైనికుల ప్రాణాలను కాపాడుతున్నాయి. 

గాయపడిన సైనికులను ఆస్పత్రికి తీసుకెళ్లేలోగానే ఇందులోని బోగీలు పూర్తి స్థాయి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లుగా పనిచేస్తున్నాయి. ఆర్మీ డాక్టర్లు, ఇతర సిబ్బంది సైనికులకు రైలులోనే సేవ లు అందిస్తున్నారు. కదులుతున్న రైలులో ఐసీయూ యూనిట్‌ నడపడం చాలా కష్టమైన పని. అయినా సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. ‘ఇక్కడ మా సామర్థ్యం చాలా పరిమితం. ఏదైనా జరిగితే బయటి కన్సల్టెంట్‌ను పిలవలేం. రక్తస్రావాన్ని ఆపడానికి చిన్న చిన్న ఆపరేషన్లు వంటివి చేస్తాం. పెద్ద పెద్ద శస్త్రచికిత్సలు చేయలేం’అని డాక్టర్స్‌ చీఫ్‌ ఒకరు తెలిపారు.  

పర్యాటక రైలు కాస్తా ఆస్పత్రిగా..  
యుద్ధం ప్రారంభంలో ప్రపంచాన్ని ఆకట్టుకున్న ఉక్రెయిన్‌ సమయస్ఫూర్తికి రైలాస్పిత్రి ఒక ఉదాహరణ. 2022 ఫిబ్రవరిలో దేశంపై రష్యా దాడులు ప్రారంభించినప్పుడు ఉక్రెయిన్‌ వద్ద ఎటువంటి మెడికల్‌ రైలు బోగీలు లేవు. గాయపడిన సైనికులను సాధారణ రైళ్లలోకి కిటికీల గుండా బలవంతంగా ఎక్కించేవారు. దీనికి పరిష్కారం ఆలోచించిన ఉక్రెయిన్‌ రైల్వే.. సాధారణ రోజుల్లో పర్యాటకులను కార్పాతియన్‌ పర్వతాలకు తీసుకెళ్లడానికి ఉపయోగించే రైళ్లను పునరుద్ధరించింది. అలా ఆస్పత్రి రైలుకు రూపకల్పన జరిగిందని ఉక్రెయిన్‌ రైల్వే ప్యాసింజర్‌ ఆపరేషన్స్‌ సీఈఓ ఒలెక్సాండర్‌ పెర్తోవ్‌స్కీ చెప్పారు. 

గంటకు 50 మైళ్ల వేగంతో..  
ఈ రైలు గంటకు 80 కిలోమీటర్లు (50 మైళ్లు) వేగంతో ప్రయాణిస్తుంది. సాధారణ రైలు వేగంలో సగమే అయినప్పటికీ ఐసీయూ మాత్రం అటూఇటూ కదిలిపోతూంటుంది. దీంతో పనిచేసేటప్పుడు సిబ్బంది చాలా అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంబులెన్స్‌ రైళ్లను మొదట 1850లలో క్రిమియన్‌ యుద్ధం సమయంలో ఉపయోగించారు. కానీ ఈ ఆధునిక వెర్షన్లలో వెంటిలేటర్లు, లైఫ్‌ సపోర్ట్‌ యంత్రాలు, అ్రల్టాసౌండ్‌ స్కానర్లు, పోర్టబుల్‌ ఎయిర్‌ కండిషనర్లు ఉన్నాయి. ప్రతి క్యారేజీలో నిరంతర విద్యుత్‌ కోసం జనరేటర్లుంటాయి. బోగీల్లో పిల్లల చిత్రాలు, ఉక్రెయిన్‌ జాతీయ జెండాలు ఉంటాయి. గాయపడిన సైనికులకు ఇవి కొంత ఓదార్పును అందిస్తాయి.  

రెండు భిన్న దృశ్యాలు..  
తొమ్మిది గంటల ప్రయాణం తరువాత రైలాస్పత్రి ఒక నగరంలోని రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించగానే.. అంబులెన్సులు సైనికుల కోసం ఎదురు చూస్తుంటాయి. ఐసీయూ లోని నర్సులు సైనికులను ప్లాట్‌ఫామ్‌పై ఎదురుచూస్తున్న వైద్యులకు అప్పగిస్తారు. స్టేషన్‌ నుంచి అంబులెన్సులు బయల్దేరి వెళ్లాక ఊపిరి పీల్చుకుంటారు. వారికి ఎదురుగా కొత్తగా రిక్రూట్‌ అయిన సైనికులతో ఓ రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉంటుంది.

 తల్లిదండ్రులకు వీడ్కోలు పలుకుతూ పిల్లలు కనపడతారు. సాయంత్రానికి ఆ యువసైనికులు అపస్మారక స్థితిలోనో, తీవ్ర గాయాలతోనే అదే రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. ఈ రెండు దృశ్యాలకు ప్రత్యక్ష సాకు‡్ష్యలు రైలాస్పత్రి సిబ్బందే. యుద్ధం మిగుల్చుతున్న అంతులేని విషాదమిది. ‘యుద్ధ క్షేత్రం నుంచి తీవ్రంగా గాయపడి వచ్చే సైనికులను చూడటం బాధాకరమైన విషయమే. కానీ, వారికి సేవ చేస్తున్నామన్న తృప్తి మాత్రం మాకు మిగులుతుంది’అని చెబుతున్నారు ఐసీయూ నర్సు ఓల్గా. 2015లో సైన్యంలో నర్సుగా చేరిన ఆమె.. 2022 నుంచి యుద్ధంలో గాయపడిన సైనికులకు చికిత్స అందిస్తున్నారు.  

అలసిపోయాం..  
యుద్ధం చెల్లించుకుంటున్న మూల్యానికి ఈ రైలాస్పత్రి ఓ చిన్న ఉదాహరణ. ‘రష్యన్‌ విసిరిన గ్రెనేడ్‌తో నా చేతులు, భుజాలు, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు శబ్దాలు నా వినికిడి శక్తినే దెబ్బతీశాయి. నేనే కాదు.. చాలా మందికి మనోధైర్యం ఉంది. కానీ చాలా అలసిపోయారు. ఇలాంటప్పుడు ఏదేమైనా కానీ భారమంతా దేవుడిదే అనుకుంటాం’అని చెబుతున్నారు రష్యా డ్రోన్‌ దాడిలో గాయపడి రైలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 35 ఏళ్ల సైనికుడు. అలసట యుద్ధక్షేత్రంలోని సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తోందనడానికి ఇదో ఉదాహరణ. ఇద్దరు పిల్లల తండ్రి అయిన ఈయన 18 నెలల నుంచి డోనెట్‌స్క్‌ ప్రాంతంలోని పదాతిదళంలో యాంటీ ట్యాంక్‌ గన్నర్‌గా పనిచేస్తున్నారు. ఇన్ని రోజుల్లో కేవలం 45 రోజులు మాత్రమే ఫ్రంట్‌లైన్‌కు దూరంగా ఉన్నారు.  

గాయాల నుంచి ప్రేరణ..  
ఈయనకు కొన్ని పడకల దూరంలో కూర్చున్న స్టానిస్లావ్‌ మూడు నెలల క్రితం స్వచ్ఛందంగా సైన్యంలో చేరారు. అతడున్న కందకంపైన డ్రోన్‌ దాడి జరగడంతో ఊపిరితిత్తులకు గాయమైంది. పక్కటెముకలు విరిగాయి. అయినా స్టానిస్లావ్‌ పూర్తి భిన్నమైన మానసిక స్థితిలో కనిపించారు. ‘‘గాయపడ్డాక నాలో ఆత్మస్థైర్యం తగ్గలేదు. నేను మరింత ప్రేరణ పొందాను’’అని చిరునవ్వుతో చెబుతున్నారు. యుద్ధంలో ఉక్రెయిన్‌ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement