icu unit
-
పట్టాలపై లైఫ్‌లైన్
నర్సు ఓల్గా.. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంతటా విరామం లేకుండా తిరుగుతూనే ఉన్నారు. రోగుల ఆక్సిజన్ స్థాయిలను తనిఖీ చేసి నోట్ చేసుకుంటున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న రోగులను ఓ కంట కనిపెడుతున్నారు. ఓ ఆస్పత్రిలో ఇదో సాధారణ దృశ్యం. కానీ ఆమె పనిచేస్తున్నది నడుస్తున్న రైలులో. వైద్యం అందిస్తున్నది యుద్ధంలో గాయాలపాలైన సైనికులకు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడానికి ఉక్రెయిన్ ఈ రైలాస్పత్రిని నడుపుతోంది. ఆ దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఇప్పుడిది కీలక భాగంగా మారింది. యుద్ధంలో గాయపడిన సైనికుల కోసం తూర్పు ఉక్రెయిన్‌లోని చాలా నగరాల్లోని ఆసుపత్రుల్లో పడకలు లేవు. అవి ఖాళీ చేయడానికి కొందరిని సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి వస్తుంది. అంబులెన్సుల్లో సుదూర ప్రయాణంతో సైనికుల ప్రాణాలకే ముప్పుకావచ్చు. రష్యా దాడుల నేపథ్యంలో హెలికాప్టర్ అంబులెన్స్‌లు కూడా ఉపయోగించలేరు. ఈ క్లిష్ట స్థితిలో రైళ్లు సైనికుల ప్రాణాలను కాపాడుతున్నాయి. గాయపడిన సైనికులను ఆస్పత్రికి తీసుకెళ్లేలోగానే ఇందులోని బోగీలు పూర్తి స్థాయి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లుగా పనిచేస్తున్నాయి. ఆర్మీ డాక్టర్లు, ఇతర సిబ్బంది సైనికులకు రైలులోనే సేవ లు అందిస్తున్నారు. కదులుతున్న రైలులో ఐసీయూ యూనిట్ నడపడం చాలా కష్టమైన పని. అయినా సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. ‘ఇక్కడ మా సామర్థ్యం చాలా పరిమితం. ఏదైనా జరిగితే బయటి కన్సల్టెంట్‌ను పిలవలేం. రక్తస్రావాన్ని ఆపడానికి చిన్న చిన్న ఆపరేషన్లు వంటివి చేస్తాం. పెద్ద పెద్ద శస్త్రచికిత్సలు చేయలేం’అని డాక్టర్స్ చీఫ్ ఒకరు తెలిపారు. పర్యాటక రైలు కాస్తా ఆస్పత్రిగా.. యుద్ధం ప్రారంభంలో ప్రపంచాన్ని ఆకట్టుకున్న ఉక్రెయిన్ సమయస్ఫూర్తికి రైలాస్పిత్రి ఒక ఉదాహరణ. 2022 ఫిబ్రవరిలో దేశంపై రష్యా దాడులు ప్రారంభించినప్పుడు ఉక్రెయిన్ వద్ద ఎటువంటి మెడికల్ రైలు బోగీలు లేవు. గాయపడిన సైనికులను సాధారణ రైళ్లలోకి కిటికీల గుండా బలవంతంగా ఎక్కించేవారు. దీనికి పరిష్కారం ఆలోచించిన ఉక్రెయిన్ రైల్వే.. సాధారణ రోజుల్లో పర్యాటకులను కార్పాతియన్ పర్వతాలకు తీసుకెళ్లడానికి ఉపయోగించే రైళ్లను పునరుద్ధరించింది. అలా ఆస్పత్రి రైలుకు రూపకల్పన జరిగిందని ఉక్రెయిన్ రైల్వే ప్యాసింజర్ ఆపరేషన్స్ సీఈఓ ఒలెక్సాండర్ పెర్తోవ్స్కీ చెప్పారు. గంటకు 50 మైళ్ల వేగంతో.. ఈ రైలు గంటకు 80 కిలోమీటర్లు (50 మైళ్లు) వేగంతో ప్రయాణిస్తుంది. సాధారణ రైలు వేగంలో సగమే అయినప్పటికీ ఐసీయూ మాత్రం అటూఇటూ కదిలిపోతూంటుంది. దీంతో పనిచేసేటప్పుడు సిబ్బంది చాలా అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంబులెన్స్ రైళ్లను మొదట 1850లలో క్రిమియన్ యుద్ధం సమయంలో ఉపయోగించారు. కానీ ఈ ఆధునిక వెర్షన్లలో వెంటిలేటర్లు, లైఫ్ సపోర్ట్ యంత్రాలు, అ్రల్టాసౌండ్ స్కానర్లు, పోర్టబుల్ ఎయిర్ కండిషనర్లు ఉన్నాయి. ప్రతి క్యారేజీలో నిరంతర విద్యుత్ కోసం జనరేటర్లుంటాయి. బోగీల్లో పిల్లల చిత్రాలు, ఉక్రెయిన్ జాతీయ జెండాలు ఉంటాయి. గాయపడిన సైనికులకు ఇవి కొంత ఓదార్పును అందిస్తాయి. రెండు భిన్న దృశ్యాలు.. తొమ్మిది గంటల ప్రయాణం తరువాత రైలాస్పత్రి ఒక నగరంలోని రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించగానే.. అంబులెన్సులు సైనికుల కోసం ఎదురు చూస్తుంటాయి. ఐసీయూ లోని నర్సులు సైనికులను ప్లాట్‌ఫామ్‌పై ఎదురుచూస్తున్న వైద్యులకు అప్పగిస్తారు. స్టేషన్ నుంచి అంబులెన్సులు బయల్దేరి వెళ్లాక ఊపిరి పీల్చుకుంటారు. వారికి ఎదురుగా కొత్తగా రిక్రూట్ అయిన సైనికులతో ఓ రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉంటుంది. తల్లిదండ్రులకు వీడ్కోలు పలుకుతూ పిల్లలు కనపడతారు. సాయంత్రానికి ఆ యువసైనికులు అపస్మారక స్థితిలోనో, తీవ్ర గాయాలతోనే అదే రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. ఈ రెండు దృశ్యాలకు ప్రత్యక్ష సాకు‡్ష్యలు రైలాస్పత్రి సిబ్బందే. యుద్ధం మిగుల్చుతున్న అంతులేని విషాదమిది. ‘యుద్ధ క్షేత్రం నుంచి తీవ్రంగా గాయపడి వచ్చే సైనికులను చూడటం బాధాకరమైన విషయమే. కానీ, వారికి సేవ చేస్తున్నామన్న తృప్తి మాత్రం మాకు మిగులుతుంది’అని చెబుతున్నారు ఐసీయూ నర్సు ఓల్గా. 2015లో సైన్యంలో నర్సుగా చేరిన ఆమె.. 2022 నుంచి యుద్ధంలో గాయపడిన సైనికులకు చికిత్స అందిస్తున్నారు. అలసిపోయాం.. యుద్ధం చెల్లించుకుంటున్న మూల్యానికి ఈ రైలాస్పత్రి ఓ చిన్న ఉదాహరణ. ‘రష్యన్ విసిరిన గ్రెనేడ్‌తో నా చేతులు, భుజాలు, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు శబ్దాలు నా వినికిడి శక్తినే దెబ్బతీశాయి. నేనే కాదు.. చాలా మందికి మనోధైర్యం ఉంది. కానీ చాలా అలసిపోయారు. ఇలాంటప్పుడు ఏదేమైనా కానీ భారమంతా దేవుడిదే అనుకుంటాం’అని చెబుతున్నారు రష్యా డ్రోన్ దాడిలో గాయపడి రైలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 35 ఏళ్ల సైనికుడు. అలసట యుద్ధక్షేత్రంలోని సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తోందనడానికి ఇదో ఉదాహరణ. ఇద్దరు పిల్లల తండ్రి అయిన ఈయన 18 నెలల నుంచి డోనెట్స్క్ ప్రాంతంలోని పదాతిదళంలో యాంటీ ట్యాంక్ గన్నర్‌గా పనిచేస్తున్నారు. ఇన్ని రోజుల్లో కేవలం 45 రోజులు మాత్రమే ఫ్రంట్‌లైన్‌కు దూరంగా ఉన్నారు. గాయాల నుంచి ప్రేరణ.. ఈయనకు కొన్ని పడకల దూరంలో కూర్చున్న స్టానిస్లావ్ మూడు నెలల క్రితం స్వచ్ఛందంగా సైన్యంలో చేరారు. అతడున్న కందకంపైన డ్రోన్ దాడి జరగడంతో ఊపిరితిత్తులకు గాయమైంది. పక్కటెముకలు విరిగాయి. అయినా స్టానిస్లావ్ పూర్తి భిన్నమైన మానసిక స్థితిలో కనిపించారు. ‘‘గాయపడ్డాక నాలో ఆత్మస్థైర్యం తగ్గలేదు. నేను మరింత ప్రేరణ పొందాను’’అని చిరునవ్వుతో చెబుతున్నారు. యుద్ధంలో ఉక్రెయిన్ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వీడియో: నన్నెవరూ ఆపలేరు.. ఐసీయూలో చక్కర్లు కొట్టిన ఆవు
ఆసుపత్రిలో ఐసీయూ అనగానే అందరికీ.. విషమంగా ఉన్న పేషంట్స్‌కు మాత్రమే చికిత్స అందించే ప్లేస్ అని తెలుసు కదా. అయితే, ఒక్కోసారి ఐసీయూలోకి పేషంట్‌ను చూసేందుకే ఇతరులను ఆసుపత్రి సిబ్బంది లోపలికి అనుమతించరు. ఇలాంటి క్రమంలో ఐసీయూలోకి ఏకంగా ఓ ఆవు ప్రవేశించి చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ జిల్లాలో ఉన్న ఓ ఆసుపత్రిలోని ఐసీయూలోకి ఆవు ప్రవేశించింది. అనంతరం.. ఆవు కొద్దిసేపు ఐసీయూ, ఆసుపత్రిలో చక్కర్లు కొట్టింది. అక్కడే తిరుగుతూ ఆసుపత్రి ఆవరణలోని చెత్త డబ్బాలో అన్న మెడికల్ వ్యర్థాలను తిన్నది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, ఆసుపత్రి యాజమాన్యంపై పేషంట్స్, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించారు. ఐసీయూలోకి ఆవు ప్రవేశించిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అయితే, పాత కోవిడ్ వార్డులోకి ఆవు వెళ్లినట్టు తెలిపారు. కాగా, ఈ ఘటనలో అజాగ్రత్తగా వ్యవహరించిన ఆసుపత్రి ఇన్చార్జ్, గార్డును సస్పెండ్ చేసినట్టు వివరణ ఇచ్చారు. సెక్యూరిటీ ఏజెన్సీకి నోటీసు జారీ చేసినట్టు తెలిపారు. WATCH: #BNNIndia Reports On Friday, a cow was seen roaming freely and eating medical waste from the hospital's garbage cans in the intensive care unit (ICU) of a hospital in Madhya Pradesh's Rajgarh district. pic.twitter.com/15ktUQprhj — Gurbaksh Singh Chahal (@gchahal) November 19, 2022 -
బోగీలే ఐసోలేషన్ వార్డులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతూ ఉండడంతో ఆస్పత్రి సదుపాయాలు లేకపోవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ఒక వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో ప్రయాణికుల రైళ్లు రద్దు కావడంతో ఆ రైలు బోగీలను కరోనా బాధితులకు చికిత్సనందించే వార్డులుగా రూపొందించాలని ముందుకొచ్చింది. ఇందుకోసం ఒక నమూనా బోగీని కూడా తయారు చేసింది. దీనికి కేంద్రం ఆమోదం తెలిపితే మరికొద్ది రోజుల్లోనే వారానికి 10 బోగీలు తయారు చేయనున్నట్టు ఉత్తర రైల్వే అధికార ప్రతినిధి దీపక్ కుమార్ వెల్లడించారు. బోగీలను ఐసీయూ కేంద్రాలుగా ఎలా మార్చారంటే ► ఒక కూపేలో ఒకవైపు లోయర్ బెర్త్‌నే మంచం మాదిరి గా రూపొందించి అన్ని బెర్త్‌లను తొలగించారు. ► ఆ బెర్త్ ఎదురుగా రోగుల సామాన్లు, వైద్య పరికరాలు ఉంచడానికి ఏర్పాట్లు చేశారు. ► ప్రతీ కోచ్‌లో ఉండే 4 టాయిలెట్ల స్థానంలో రెండు వాష్‌రూమ్‌లుగా మార్చి ఫ్లోరింగ్ మార్చారు. ప్రతీ బాత్రూమ్లో హ్యాండ్ షవర్, బక్కెట్, మగ్ ఉంచారు. ► ప్రతీ కోచ్‌లోనూ 220 ఓల్టుల ఎలక్ట్రికల్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ► బోగీ వెలుపల 415 ఓల్టుల విద్యుత్ సరఫరా. ► బోగీకి 10చొప్పున ఇలా వార్డులు తయారు చేశారు. ► ఇక రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఐసీయూలు, మెడికల్ స్టోర్లు, పాంట్రీలు, అధికారుల కోసం గదులు వంటివి కూడా ఏర్పాటు చేశారు. ► ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ప్రతీ వెయ్యి మంది జనాభాకి కనీసం మూడు పడకలైనా ఉండాలి. కానీ, 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ప్రతీ వెయ్యి మందికి 0.7 పడకలు ఉన్నట్టుగా అంచనా. -
‘ఐసీయూలో ఎకానమీ’
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూపై ఉందని, దీన్ని పునరుద్ధరించేందుకు దీటైన వైద్యులు అవసరమని కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం అన్నారు.కేంద్ర బడ్జెట్‌పై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేసిన అరవింద్ సుబ్రమణియన్ ఎకానమీ విషమ పరిస్థితుల్లో ఉందన్నారని, నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ సైతం ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేయగా కేంద్ర మంత్రులు ఆయనపై విరుచుకుపడ్డారని అన్నారు. ఆర్థిక వ్యవస్థ ఐసీయూ అంచుకు చేరిందని, సరైన డాక్టర్ల కోసం వేచిచూస్తోందని చిదంబరం చెప్పుకొచ్చారు. ఆర్థిక మందగమనాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదని, తన పొరపాట్లను అంగీకరించేందుకు సిద్ధంగా లేదని వ్యాఖ్యానించారు. ప్రతి పరిశ్రమ ప్రతికూల ఫలితాలనే ఇస్తోందని దీనికోసం ఎంఆర్ఐ యంత్రంపై పరీక్ష అవసరం లేదని అన్నారు. గత ఆరేళ్లుగా ఆర్థిక వ్యవస్థ మందగమనంపై గత ప్రభుత్వాన్ని నిందించడంతోనే నెట్టుకొస్తున్నారని ఇంకా ఎన్నాళ్లు ఇలా కాలక్షేపం చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం నిధుల కొరతతో సతమతమవుతూ నమ్మలేని గణాంకాలతో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. తొందరపాటు ధోరణితో లోపభూయిష్టమైన జీఎస్టీ అమలుకు పూనుకోవడం కూడా ఆర్థిక వ్యవస్థ కష్టాలకు ఓ కారణమని చెప్పుకొచ్చారు. చదవండి : రజనీ వస్తే అద్భుతమే : చిదంబరం -
ఐసీయూ వెలుపల సెక్యూరిటీ గార్డు హత్య
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానికి సమీపంలోని గురుగావ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన గార్డు కత్తితో దాడి చేసిన ఘటనలో మరో సెక్యూరిటీ గార్డు మరణించారు. శీతల్ ఆస్పత్రిలోని ఐసీయూ వెలుపల జరిగిన ఈ దాడిలో బాధితుడని జుగల్ కిషోర్‌గా గుర్తించారు. సెక్యూరిటీ గార్డు కిషోర్‌ను కత్తితో పొడిచిన నిందితుడు నౌఫిల్ అన్వర్ హత్యానంతరం పరారయ్యాడని పోలీసులు చెప్పారు. దాడి జరిగే సమయంలో ఆస్పత్రి ఎంట్రన్స్ గేట్ వద్ద అన్వర్ ఉండగా, మూడో ఫ్లోర్‌లోని ఐసీయూ వెలుపల కిషోర్ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అన్వర్ కిషోర్‌పై దాడిచేసి అతని ఛాతీ, ముఖం, పొట్టపై కత్తితో పొడవడంతో బాధితుడు అక్కడికక్కడే మరణించాడని డీసీపీ వెస్ట్‌జోన్ సుమీర్ సింగ్ చెప్పారు. హత్యకు దారితీసిన పరిస్థితులు ఇంకా తెలియరాలేదని, బాధితుల కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ను రికార్డు చేసి, ఇతర గార్డులను ప్రశ్నించిన అనంతరం వివరాలు వెల్లడిస్తామని డీసీపీ చెప్పారు. -
నిలకడగా బ్రహ్మానందం ఆరోగ్యం
‘అహ నా పెళ్ళంట!’ (1985) సినిమాతో వస్తూనే తెలుగు తెరౖపై నవ్వులు పూయించారు హాస్యనటులు బ్రహ్మానందం. అప్పటినుంచి ఇప్పటివరకూ ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నారు. దాదాపు వెయ్యిచిత్రాలు చేసిన బ్రహ్మానందం ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా నటుడిగా ఫామ్‌లో ఉన్నారు. ఇటీవలే ‘గ్రేట్ తెలుగు లాఫ్టర్ చాలెంజ్’ షోతో బుల్లితెర ప్రేక్షకులను కూడా పలకరించారు. ప్రస్తుతం బ్రహ్మానందం ఆస్పత్రిలో ఉన్నారనే విషయం తెలిసి ఆయన అభిమానులు, సన్నిహితులు కలవరపడ్డారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. గుండెలో నొప్పి అనిపించడంతో హైదరాబాద్‌లోని ప్రముఖ డాక్టర్ని సంప్రదించారట బ్రహ్మానందం. శస్త్రచికిత్స ఇక్కడ చేయించుకుంటే అభిమానుల రాకపోకలు, వారి ఆందోళనతో ఇబ్బందిగా ఉంటుందని భావించిన ఆయన ముంబైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. గుండె ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. నేడు ఐసీయు నుంచి సాధారణ గదికి మారనున్నారు. ‘‘ఆదివారం ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో బ్రహ్మానందంగారిని ఆస్పత్రిలో జాయిన్ చేశాం. ఆయనకు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగింది’’ అని బ్రహ్మానందం కుటుంబ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బ్రహ్మానందం కుమారులు రాజా గౌతమ్, సిద్దార్థ్‌లు తండ్రితో పాటు ముంబైలో ఉన్నారు. -
ఎయిమ్స్‌లో అటల్జీ
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని, 93ఏళ్ల అటల్ బిహారీ వాజ్‌పేయి సోమవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. దీంతో చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయిని వైద్యుల సలహాతో వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్(ఆలిండియా ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లోని అత్యవసర చికిత్సావిభాగం(ఐసీయూ)లో చేర్పించారు. సాధారణ చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నా.. ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్, మూత్రనాళ ఇన్ఫెక్షన్, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో తీసుకురాగానే డయాలసిస్ చేసిన వైద్యులు తర్వాత ఇన్ఫెక్షన్కు చికిత్సనందిస్తున్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా నేతృత్వంలోని వైద్యుల బృందం వాజ్‌పేయి ఆరోగ్య బాధ్యతలను చూస్తోంది. ‘ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఆయన శరీరం వైద్యానికి స్పందిస్తోంది’ అని సోమవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వైద్యులు తెలిపారు. పరామర్శించిన ప్రముఖులు 1984 నుంచి వాజ్‌పేయి ఒకే కిడ్నీతో పనిచేస్తుండగా ఇప్పుడు ఆ కిడ్నీకి కూడా ఇన్ఫెక్షన్ సోకడంతోనే డయాలిసిస్ చేస్తున్నారు. గులేరియా మూడుదశాబ్దాల పాటు వాజ్‌పేయికి వ్యక్తిగత వైద్యుడిగా సేవలందించారు. ఇప్పుడూ ఆయన నేతృత్వంలోనే వైద్యులు చికిత్సచేస్తున్నారు. ఆసుపత్రిలో వాజ్‌పేయిని ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలు అడ్వాణీ, ఎంఎం జోషి, పార్టీ చీఫ్ అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, హర్షవర్ధన్, పలువురు బీజేపీ ప్రముఖులు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తదితరులు పరామర్శించారు. ‘మా అందరికీ స్ఫూర్తిప్రదాత అయిన వాజ్‌పేయీజీ త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాం’ అని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్ చేశారు. దాదాపు 50 నిమిషాల సేపు ఆసుపత్రిలో ఉన్న ప్రధాని మోదీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెల్సుకున్నారు. కుటుంబ సభ్యులతోనూ మోదీ మాట్లాడారు. అడ్వాణీ రాత్రి 9 గంటలకు తన దీర్ఘకాల సహచరుడిని చూసేందుకు ఎయిమ్స్ వచ్చారు. ఈ సందర్భంగా అడ్వాణీ కాస్త ఉద్విగ్నతకు లోనైనట్లు సమాచారం. నేడో రేపో డిశ్చార్జ్? ‘వాజ్‌పేయి ఆరోగ్యం స్థిరంగానే ఉంది. ఆయన ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. ఉన్నతస్థాయి వైద్యబృందం ఆయనకు చికిత్సనందిస్తోంది. డాక్టర్ల సూచన మేరకు ఆయనను పర్యవేక్షణలో ఉంచారు. మంగళవారం ఉదయం వాజ్‌పేయిని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది’ అని కేంద్ర మంత్రి విజయ్ గోయల్ వెల్లడించారు. పరామర్శించేందుకు ప్రముఖులు వస్తుండటంతో ఎయిమ్స్‌తోపాటు చుట్టుపక్క ప్రాంతాల్లో భద్రత పెంచారు. వాజ్‌పేయి ఆరోగ్యం బాగానే ఉందని బీజేపీ ఓ ప్రకటనలో పేర్కొంది. 1998–2004 వరకు ప్రధానిగా ఉన్న వాజ్‌పేయి.. 2009 తర్వాత ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో ప్రజాజీవితానికి దూరంగా ఉన్నారు. అప్పటినుంచీ ఆయన ఢిల్లీలోని తన నివాసంలో చికిత్స పొందుతున్నారు. ఐదేళ్ల పాటు ప్రధానిగా ఉన్న తొలి కాంగ్రెసేతర నేతగా వాజ్‌పేయి రికార్డు సృష్టించారు. ఎయిమ్స్‌లో మోదీకి వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తున్న వాజ్‌పేయి బంధువు -
ఏసీ ఫెయిల్..ఐదుగురి మృతి
కాన్పూర్: ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో ఎయిర్ కండీషనింగ్ పనిచేయకపోవడం వల్ల 24 గంటల వ్యవధిలో ఐదుగురు వృద్ధులు మృతిచెందారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ నగరంలోని లాలా లజపతి రాయ్ ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. ఈ కారణంగా ఇంద్రపాల్(75), గంగా ప్రసాద్ యాదవ్(75), రసూల్ భక్ష్, మురారీ లాల్(65) అనే వృద్ధులతో పాటు మరో వృద్ధుడు కూడా మృతిచెందారు. వీరిలో ఇద్దరు గుండె ఆగిపోవడం వల్ల మరణించగా..మరో ముగ్గురు దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతూ చనిపోయారు. ఈ ఘటనపై ఆసుపత్రి వర్గాలను వివరణ కోరగా.. ఎయిర్ కండీషనింగ్(ఏసీ)లో సమస్యలు ఉన్నట్లు తమకు తెలుసునని, రెండు రోజుల క్రితమే మెడిసిన్ డిపార్ట్మెంట్ ఐసీయూలో ఏసీ ప్లాంట్‌ను మూసివేశామని ఐసీయూ ఇంచార్జ్ సౌరవ్ అగర్వాల్ తెలిపారు.నిన్న ఏసీ ప్లాంట్‌లో సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని, కానీ ఉన్న సమస్యను పరిష్కరించామని, కానీ మళ్లీ సమస్య ఉత్పన్నమైందని ఆసుపత్రి పిన్సిపల్ నవనీత్ కుమార్ తెలిపారు. పరిస్థితి విషమించిన రోగులు మాత్రమే ఐసీయూలో ఉన్నారని, కేవలం ఏసీ ఫెయిల్ కావడం వల్లే రోగులు చనిపోలేదని ఆయన అన్నారు. ఈ సంఘటన గోరఖ్ పూర్ బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీ ఘటనను తలపిస్తోంది. గత సంవత్సరం ఆక్సిజన్ కొరత వల్ల సుమారు 60 మంది శిశువులు వారం వ్యవధిలో చనిపోయారు. దీంతో ప్రజాగ్రహం పెల్లుబికింది. వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టంతో ఈ గొడవ సద్దుమణిగింది.ఏసీ ఫెయిల్ సంఘటనపై నలుగు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశిస్తున్న కాన్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ సురేంద్ర సింగ్ తెలిపారు. -
జయ వార్డులో సీసీ కెమెరాలు ఆపేశాం
టీ.నగర్ (చెన్నై): దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో చికిత్స పొందిన సమయంలో.. ఒక ఐసీయూ యూని ట్ మొత్తాన్ని ఆమెకే కేటాయించామని, ముందు జాగ్రత్తగా ఆమె వార్డులోని సీసీ కెమెరాలను ఆపేశామని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి వెల్లడించారు. సంబంధం లేని వ్యక్తులు చూడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కొలొరెక్టల్ సర్జరీ, యూఎస్ఏ క్లీవ్‌ల్యాండ్ క్లినిక్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 24, 25న నిర్వహించనున్న సదస్సు గురించి మీడియాతో మాట్లాడుతూ.. జయకు అందించిన చికిత్స వివరాల్ని వెల్లడించారు. ‘24 గదుల ఐసీయూ యూనిట్ మొత్తాన్ని జయకే కేటాయించినా.. ఒక గదిని మాత్రమే ఉపయోగించాం. చికిత్స పొందిన 75 రోజులు అన్ని సీసీటీవీల్ని ఆపుచేశాం. మిగతా రోగుల్ని వేరే ఐసీయూలోకి మార్చాం’ అని చెప్పారు. కొద్దికాలం సన్నిహిత బంధువులు తప్ప ఎవరినీ ఐసీయూలోకి అనుమతించలేదని, ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పుడు డ్యూటీలో ఉన్న వైద్యుడి సమ్మతి మేరకే అనుమతించేవారిమని తెలిపారు. జయలలితకు ఆస్పత్రిలో అత్యుత్తమ వైద్య చికిత్స అందించామని, విదేశీ వైద్యులు కూడా సాయపడ్డారని, ఆమె పూర్తిగా కోలుకున్నారని భావించిన తరుణంలో తీవ్ర గుండెపోటు రావడంతో ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయామన్నారు. -
ఏపీ మాజీ గవర్నర్ పరిస్థితి విషమం
న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ (91) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయనకు ఢిల్లీలోని సిటీస్ మాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గత నెల 26న తీవ్రజ్వరం, న్యూమోనియా రావడంతో కుటుంబసభ్యులు తివారీని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తివారీ ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లకు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. తివారీ ఆరోగ్యస్థితిపై ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్, మాజీ ఉత్తరాఖండ్ సీఎం విజయ్ బహుగుణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
సర్కార్ వైద్యానికి కార్పొరేట్ సొబగులు
సిద్దిపేటలో రూ. 1.25 కోట్లతో ఐసీయూ యూనిట్ నేడు మంత్రులు లక్ష్మారెడ్డి, హరీశ్‌రావు చేతుల మీదుగా ప్రారంభం సిద్దిపేట జోన్ : సిద్దిపేటలోని ప్రభుత్వ ఆస్పత్రులు కార్పొరేట్ స్థాయి సొబగులను సంతరించుకోనున్నాయి. ఇప్పటికే కంగారు మెథడ్ యూనిట్ ద్వారా గుర్తింపు పొందిన సిద్దిపేట పట్టణం వైద్యసేవల్లో మరో అడుగు వేస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు ప్రభుత్వ ఆస్పత్రులకు నోచుకొని అత్యాధునికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను సిద్దిపేటలో ఏర్పాటు చేశారు. రూ. 1.25 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌ను రాష్ట్రవైద్య, ఆరోగ్య శాఖమంత్రి లకా్ష్మరెడ్డి, నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావుతో కలిసి గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసీయూ యూనిట్ ద్వారా సిద్దిపేట ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. 24 గంటల పాటు అత్యవసర వైద్యసేవలను అందించడానికి రాష్ర్ట ప్రభుత్వం 10 మందితో కూడిన వైద్య బృందం ఏర్పాటు చేసింది. వీటికి అనుసంధానంగా త్వరలో కిడ్నీ రోగుల కోసం డయాలసిస్ యూనిట్, ఎయిడ్స్ బాధితుల కోసం ఏఆర్టీ సెంటర్, డెంగీ ప్రాంణాంతక వ్యాధుల కోసం ప్లేట్లెట్స్ సెఫారేటర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్య సేవల కోసం వచ్చే రోగుల బంధువులకు ఆశ్రయం, ఉచిత భోజన వసతి కోసం రూ. 1.31 కోట్లతో నైట్ షెల్టర్‌కు మంత్రులు గురువారం శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు వివిధ వైద్య సేవల కోసం వచ్చే రోగుల బంధువులు అశ్రయం పొందేందుకు స్థానిక ఏరియా ఆస్పత్రిలో నేషనల్ అర్బన్ లవ్లీ ఉడ్ మెప్మా మిషన్ ద్వారా రూ. 1.31 కోట్లతో నైట్ షెల్టర్‌ను ఏర్పాటు చేయనున్నారు. మూడంతస్తుల భవనంలో రోగుల బంధువులకు బసచేసే విధంగా మౌలిక వసతులు కల్పించనున్నారు. ఇప్పటికే హరే రామ్ సంస్థ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు, రోగుల బంధువులకు మంత్రి చొరవతో ఉచితంగా భోజనం అందుతోంది. నైట్ షెల్టర్ ఏర్పాటుతో బాధితులు ఆసుపత్రుల్లో మంచాల వద్ద, ఆరుబయట పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండదు.