
దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం అన్నారు.
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూపై ఉందని, దీన్ని పునరుద్ధరించేందుకు దీటైన వైద్యులు అవసరమని కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం అన్నారు.కేంద్ర బడ్జెట్‌పై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేసిన అరవింద్ సుబ్రమణియన్ ఎకానమీ విషమ పరిస్థితుల్లో ఉందన్నారని, నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ సైతం ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేయగా కేంద్ర మంత్రులు ఆయనపై విరుచుకుపడ్డారని అన్నారు. ఆర్థిక వ్యవస్థ ఐసీయూ అంచుకు చేరిందని, సరైన డాక్టర్ల కోసం వేచిచూస్తోందని చిదంబరం చెప్పుకొచ్చారు.
ఆర్థిక మందగమనాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదని, తన పొరపాట్లను అంగీకరించేందుకు సిద్ధంగా లేదని వ్యాఖ్యానించారు. ప్రతి పరిశ్రమ ప్రతికూల ఫలితాలనే ఇస్తోందని దీనికోసం ఎంఆర్‌ఐ యంత్రంపై పరీక్ష అవసరం లేదని అన్నారు. గత ఆరేళ్లుగా ఆర్థిక వ్యవస్థ మందగమనంపై గత ప్రభుత్వాన్ని నిందించడంతోనే నెట్టుకొస్తున్నారని ఇంకా ఎన్నాళ్లు ఇలా కాలక్షేపం చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం నిధుల కొరతతో సతమతమవుతూ నమ్మలేని గణాంకాలతో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. తొందరపాటు ధోరణితో లోపభూయిష్టమైన జీఎస్టీ అమలుకు పూనుకోవడం కూడా ఆర్థిక వ్యవస్థ కష్టాలకు ఓ కారణమని చెప్పుకొచ్చారు.