6 శాతం వృద్ధి సాధ్యమే: చిదంబరం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది పుంజుకుని 6 శాతం వృద్ధి సాధించే అవకాశముందని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం చెప్పారు. పటిష్టమైన ఆర్థిక విధానాలు, పెరిగే పెట్టుబడులతో ఆరు శాతం వృద్ధిరేటు సాధ్యమేనని ఆయన గురువారం న్యూఢిల్లీలో మీడియాతో అన్నారు. కేంద్రంలో కొత్తగా అధికారంలోకి రానున్న ప్రభుత్వం పకడ్బందీ విధానాలను పాటించి, తాత్కాలిక బడ్జెట్లో పేర్కొన్న పది అంశాల ఎజెండాను అమలు చేస్తే ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంటుందని తెలిపారు.
2009-10లో దాదాపు 9 శాతానికి చేరిన ఆర్థిక వృద్ధి రేటు 2011-12లో 6.7 శాతానికి క్షీణించింది. 2012-13లో దశాబ్దపు కనిష్ట రేటు 4.5%కి పడిపోయింది. 2013-14లో 4.9% వృద్ధి రేటు నమోదవుతుందని అంచనా. పదేళ్ల యూపీఏ పాలనలో సాధిం చిన విజయాలను చిదంబరం ఈ సందర్భంగా ఏకరువు పెట్టారు. యూపీఏ ప్రభుత్వం మంచి ఫలితాలు సాధించి ఉంటే ప్రజలు సర్కారుపై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించగా, కొన్ని వర్గాల ప్రజలు మార్పును కోరుకుంటూ ఉండవచ్చని అన్నారు. కొనుగోలు శక్తి(పీపీపీ) ప్రాతిపదికన ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించిందని గుర్తుచేశారు. దేశాన్ని అధిక వృద్ధి రేటు బాటలో పెట్టడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని తెలిపారు. ఐదు శాతం కంటే తక్కువ వృద్ధి రేటును ప్రజలు ఆమోదించడం లేదని చెప్పారు.