
బ్రహ్మానందం
‘అహ నా పెళ్ళంట!’ (1985) సినిమాతో వస్తూనే తెలుగు తెరౖపై నవ్వులు పూయించారు హాస్యనటులు బ్రహ్మానందం. అప్పటినుంచి ఇప్పటివరకూ ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నారు. దాదాపు వెయ్యిచిత్రాలు చేసిన బ్రహ్మానందం ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా నటుడిగా ఫామ్‌లో ఉన్నారు. ఇటీవలే ‘గ్రేట్ తెలుగు లాఫ్టర్ చాలెంజ్’ షోతో బుల్లితెర ప్రేక్షకులను కూడా పలకరించారు. ప్రస్తుతం బ్రహ్మానందం ఆస్పత్రిలో ఉన్నారనే విషయం తెలిసి ఆయన అభిమానులు, సన్నిహితులు కలవరపడ్డారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. గుండెలో నొప్పి అనిపించడంతో హైదరాబాద్‌లోని ప్రముఖ డాక్టర్‌ని సంప్రదించారట బ్రహ్మానందం.
శస్త్రచికిత్స ఇక్కడ చేయించుకుంటే అభిమానుల రాకపోకలు, వారి ఆందోళనతో ఇబ్బందిగా ఉంటుందని భావించిన ఆయన ముంబైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. గుండె ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. నేడు ఐసీయు నుంచి సాధారణ గదికి మారనున్నారు. ‘‘ఆదివారం ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో బ్రహ్మానందంగారిని ఆస్పత్రిలో జాయిన్ చేశాం. ఆయనకు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగింది’’ అని బ్రహ్మానందం కుటుంబ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బ్రహ్మానందం కుమారులు రాజా గౌతమ్, సిద్దార్థ్‌లు తండ్రితో పాటు ముంబైలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment