
∙రాజా గౌతమ్, బ్రహ్మానందం, ఆర్‌వీఎస్ నిఖిల్, రాహుల్ యాదవ్
‘‘బ్రహ్మా ఆనందం’ (Brahma Anandam) సినిమా చూసిన వారు ‘మీ కన్నా.. మీ అబ్బాయి బాగా చేశాడు’ అని రాజా గౌతమ్‌ని మెచ్చుకుంటుంటే ఓ తండ్రిగా చాలా సంతోషంగా అనిపించింది. ప్రేక్షకులకు కొత్తగా కనిపించాలనే ఆలోచనతోనే నేను సినిమాలు చేస్తుంటాను. చాలా కాలం తర్వాత ‘బ్రహ్మా ఆనందం’ వంటి ఓ మంచి సినిమా, మంచి పాత్ర చేశాననే సంతృప్తి కలిగింది’’ అని నటుడు బ్రహ్మానందం చెప్పారు. ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో బ్రహ్మానందం(Brahma Anandam), ఆయన తనయుడు రాజా గౌతమ్(Raja Gautam) తాతా మనవళ్లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’.
ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటించారు. సావిత్రి, ఉమేష్ కుమార్ సమర్పణలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. శనివారం నిర్వహించిన సక్సెస్ మీట్(Success Meet)లో రాజా గౌతమ్ మాట్లాడుతూ–‘‘బ్రహ్మా ఆనందం’ చూసిన వారు నా నటన గురించి మాట్లాడుతుండటం హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు.
‘‘నా గత చిత్రాల్లా ‘బ్రహ్మా ఆనందం’కి కూడా మంచి మౌత్ టాక్ వచ్చింది. అన్ని చోట్లా షోలు ఫుల్ అవుతున్నాయి’’ అని రాహుల్ యాదవ్ చెప్పారు. ‘‘ప్రేక్షకులతో కలిసి సినిమా చూశాం... మేం ఊహించని సన్నివేశాల్లోనూ నవ్వుతున్నారు’’ అని ఆర్‌వీఎస్ నిఖిల్ తెలిపారు.