ప్రతీకాత్మక చిత్రం
కాన్పూర్: ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో ఎయిర్ కండీషనింగ్ పనిచేయకపోవడం వల్ల 24 గంటల వ్యవధిలో ఐదుగురు వృద్ధులు మృతిచెందారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ నగరంలోని లాలా లజపతి రాయ్ ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. ఈ కారణంగా ఇంద్రపాల్(75), గంగా ప్రసాద్ యాదవ్(75), రసూల్ భక్ష్, మురారీ లాల్(65) అనే వృద్ధులతో పాటు మరో వృద్ధుడు కూడా మృతిచెందారు. వీరిలో ఇద్దరు గుండె ఆగిపోవడం వల్ల మరణించగా..మరో ముగ్గురు దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతూ చనిపోయారు.
ఈ ఘటనపై ఆసుపత్రి వర్గాలను వివరణ కోరగా.. ఎయిర్ కండీషనింగ్(ఏసీ)లో సమస్యలు ఉన్నట్లు తమకు తెలుసునని, రెండు రోజుల క్రితమే మెడిసిన్ డిపార్ట్‌మెంట్ ఐసీయూలో ఏసీ ప్లాంట్‌ను మూసివేశామని ఐసీయూ ఇంచార్జ్ సౌరవ్ అగర్వాల్ తెలిపారు.నిన్న ఏసీ ప్లాంట్‌లో సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని, కానీ ఉన్న సమస్యను పరిష్కరించామని, కానీ మళ్లీ సమస్య ఉత్పన్నమైందని ఆసుపత్రి పిన్సిపల్ నవనీత్ కుమార్ తెలిపారు. పరిస్థితి విషమించిన రోగులు మాత్రమే ఐసీయూలో ఉన్నారని, కేవలం ఏసీ ఫెయిల్ కావడం వల్లే రోగులు చనిపోలేదని ఆయన అన్నారు.
ఈ సంఘటన గోరఖ్ పూర్ బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీ ఘటనను తలపిస్తోంది. గత సంవత్సరం ఆక్సిజన్ కొరత వల్ల సుమారు 60 మంది శిశువులు వారం వ్యవధిలో చనిపోయారు. దీంతో ప్రజాగ్రహం పెల్లుబికింది. వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టంతో ఈ గొడవ సద్దుమణిగింది.ఏసీ ఫెయిల్ సంఘటనపై నలుగు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశిస్తున్న కాన్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ సురేంద్ర సింగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment