మూడు నెలల్లో 20లక్షల మందికి పంపిణీ లక్ష్యం
తొలి రెండు వారాల్లోనే 16.98 శాతం వ్యాక్సినేషన్ పూర్తి
ఆరు వర్గాలకు చెందిన హై రిస్క్ వ్యక్తులకు టీకా వేస్తున్న వైద్యశాఖ
టీబీ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్షయ(టీబీ) వ్యాధి నియంత్రణ చర్యల్లో భాగంగా వైద్యశాఖ బాసిల్లస్ కాల్మెట్–గ్వెరిన్ (బీసీజీ) వ్యాక్సిన్‌ను వేగంగా పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలోని 12జిల్లాల్లో టీకా పంపిణీని ఈ నెల 12న ప్రారంభించింది. తొలి రెండు వారాల్లోనే 16.98శాతం టీకా పంపిణీ పూర్తిచేసింది. కరోనా వ్యాప్తి సమయంలో అవలంబించిన టీటీటీ (ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్) విధానాన్ని టీబీ నియంత్రణలోను వైద్యశాఖ పాటిస్తోంది.
ఈ క్రమంలో కరోనా నిర్ధారణ పరీక్షల తరహాలో వీలైనంత ఎక్కువ మందికి టీబీ పరీక్షలు చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచితంగా వైద్యం, మందులు, పౌష్టికాహారం అందిస్తున్నారు. 2025 నాటికి టీబీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పెద్దలకు ఉచితంగా టీకా పంపిణీ చేస్తున్నారు.
హైరిస్క్ వర్గాలకు...
క్షయ వ్యాధి బారినపడే అవకాశం ఉన్న హైరిస్క్ వ్యక్తులను గుర్తించి వారికి టీకా పంపిణీ వేస్తున్నారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, టీబీతో బాధపడుతున్న వ్యక్తుల కుటుంబ సభ్యులు, టీబీ చరిత్ర కలిగిన వారితోపాటు ధూమపానం చేసేవారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, చ.మీ.కు 18కిలోల కంటే తక్కువ బాడీ మాస్ ఇండెక్స్ కలిగిన వ్యక్తులు.. ఇలా ఆరు వర్గాలకు చెందిన వారికి తొలి దశలో టీకా పంపిణీ చేస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, నంద్యాల, పల్నాడు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీ సత్యసాయి, విశాఖపట్నం, విజయనగరం, వైఎస్సార్ జిల్లాల్లో ఆరు వర్గాలకు చెందినవారు 50లక్షల మంది వరకు ఉన్నట్టు వైద్యశాఖ ప్రాథమికంగా నిర్ధారించింది.
తొలి మూడు నెలల్లో 20లక్షల మందికి టీకా వేయాలని లక్ష్యం కాగా, రెండు వారాల్లోనే 16.98 శాతం 3,39,640 మందికి పూర్తిచేశారు. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 45,891మందికి, నెల్లూరులో 38,602మందికి, వైఎస్సార్ జిల్లాలో 37,995మందికి టీకాలు వేశారు. ప్రస్తుతం ఎంపికచేసిన 12 జిల్లాల్లో ప్రతి గురువారం బీసీజీ వ్యాక్సిన్ వేస్తున్నారు.
ఇప్పటికే పిల్లలకు టీకా
ఇప్పటికే వైద్యశాఖ పిల్లలకు సాధారణ టీకాలతోపాటు టీబీకి సంబంధించిన టీకాను వేస్తోంది. వైద్యశాఖ 2022లో ఉచితంగా వ్యాక్సినేషన్ ప్రారంభించింది. తొమ్మిది నెలల్లోపు పిల్లలకు మూడు డోసులుగా ఈ టీకాను వేస్తున్నారు. పుట్టిన ఆరు వారాలలోపు ఒక డోసు, 14 వారాల్లోపు రెండో డోసు, చివరిగా 9 నెలల వయసులోపు మూడో డోసు వేస్తున్నారు. మూడు డోసుల టీకా వేసుకున్న పిల్లలకు న్యుమోనియా నుంచి రక్షణ లభిస్తుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment