గాంధీ ఆస్పత్రి: తెలంగాణ వైద్య ప్రదాయిని గాంధీ ఆస్పత్రిలో కీలక వైద్య విభాగం త్వరలో అందుబాటులోకి రానుంది. రసాయన, జీవ, అణుధార్మిక ఏజెంట్ల వాడకం... ప్రత్యేకించి అణువిద్యుత్ కేంద్రాల్లో ప్రమాదాల బారినపడే క్షతగాత్రులకు ప్రత్యేక వైద్యం అందించేందుకు వీలుగా కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్ అండ్ న్యూక్లియర్ (సీబీఆర్‌ఎన్) మెడికల్ మేనేజ్‌మెంట్ సెంటర్‌ను గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసే ప్రక్రియలో ముందడుగు పడింది. గాంధీలో ఈ సెంటర్ ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి గాంధీ ఆస్పత్రి పాలనా యంత్రాంగానికి తాజాగా లిఖితపూర్వక ఆదేశాలు అందాయి.
దీంతో రాష్ట్ర వైద్య ఉన్నతాధికారులు, గాంధీ పాలనా యంత్రాంగం రెండు రోజులు సమాలోచనలు చేసి ఆస్పత్రి ప్రాంగణంలోని మెడికల్ షాపుల వెనుకగల వైద్యుల వాహన పార్కింగ్ స్థలంలో సీబీఆర్‌ఎన్ భవనం నిర్మించేందుకు ప్రతిపాదించారు. సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్‌లను పార్కింగ్‌కు కేటాయించి పిల్లర్ల సాయంతో పైఅంతస్తుల్లో భవన నిర్మాణం చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులు బ్లూప్రింట్‌ను సిద్ధం చేశారు.
ఈ సందర్భంగా గాంధీ సూపరింటెండెంట్ రాజారావు మీడియాతో 2 వేల చదరపు మీటర్ల వైశ్యాలంగల స్థలాన్ని గుర్తించి కేంద్రానికి తెలియజేశామని, త్వరలోనే కేంద్ర నిపుణుల బృందం గాంధీని సందర్శించే అవకాశం ఉందన్నారు. వాస్తవానికి 2018లోనే గాంధీలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం భావించినప్పటికీ పలు కారణాలతో అది వాయిదాపడింది.
Comments
Please login to add a commentAdd a comment