న్యూఢిల్లీ: చైనాలో కొత్తగా నిమోనియా కేసులు వెలుగుచూస్తుండటంపై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ పరిధిలో సమగ్రస్థాయిలో ఆరోగ్య సంసిద్ధతపై సమీక్ష నిర్వహించుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటన జారీచేసింది. ‘ఉత్తర చైనాలో చిన్నారుల్లో శ్వాససంబంధ కేసుల ఉధృతి కనిపిస్తోంది. ఈ పరిస్థితిని భారత సర్కార్ నిశితంగా పరిశీలిస్తోంది. ఇప్పుటికిప్పుడు భయపడాల్సిన పని లేదు.
కానీ ముందు జాగ్రత్త చర్యగా మీమీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆరోగ్య సన్నద్ధతపై సమీక్ష నిర్వహించుకోండి’’ అని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పాలనా యంత్రాంగాలకు లేఖ రాశారు. ‘‘ ఇంఫ్లూయెంజా తరహా కేసు(ఐఎల్‌ఐ), అత్యంత తీవ్రమైన శ్వాస(ఎస్‌ఏఆర్‌ఐ) కేసుల విషయంలో కోవిడ్‌కాలంలో అనుసరించిన విధానాలనే ఇప్పుడు పాటించండి.
ఈ తరహా కేసులు, ముఖ్యంగా చిన్నారుల్లో కనిపిస్తే జిల్లా, రాష్ట్ర స్థాయిలో సమగ్ర వ్యాధి నిఘా వ్యవస్థల నేతృత్వంలో క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోండి. ఈ కేసుల వివరాలను ఎప్పటికప్పుడు సంబంధిత పోర్టల్‌లో అప్‌లోడ్ చేయండి. అనుమానిత కేసుల శాంపిళ్లను వైరస్ రీసెర్చ్, డయాగ్నస్టిక్ ల్యాబొరేటరీలకు పంపించండి. ఇలాంటి ముందస్తు, అప్రమత్త చర్యల ద్వారానే ఆరోగ్య అత్యయక స్థితి దాపురించకుండా పౌరులను కాపాడగలం’’ అని లేఖలో కార్యదర్శి పేర్కొన్నారు.
ఉత్తర చైనాలో శ్వాస సంబంధ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదికలో వెల్లడైంది. ఇన్‌ఫ్లూయెంజా, మైకోప్లాస్మా నిమోనియా, సార్స్–కోవ్–2 కేసుల ఉధృతి ఎక్కువగా ఉంది. చలికాలం కావడంతో చైనాలో సాధారణంగానే మైకోప్లాస్మా నిమోనియా కేసులు ఎక్కువగా వెలుగుచూస్తుంటాయి. ‘‘కేసులపై అదనపు సమాచారం ఇవ్వాలని చైనా యంత్రాంగాన్ని డబ్ల్యూహెచ్‌ఓ కోరింది. అంతమాత్రాన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కాదు’’ అని కార్యదర్శి స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment