చిన్న పిల్లల్లో నిమోనియా చాలా సాధారణంగా కనిపించే ఊపిరితిత్తుల వ్యాధి. మరీ ముఖ్యంగా ఐదేళ్ల కంటే వయసు తక్కువ చిన్నారుల్లో ఇది ఎక్కువగానే కనిపిస్తుంది. పెద్దల్లో వ్యాధి నిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తుంటుంది కాబట్టి కాస్త తట్టుకుంటారు. కానీ పిల్లల్లో ఇమ్యూనిటీ అంతే పటిష్టంగా ఉండకపోవడం వల్ల ఒక్కోసారి ఇది ్రపాణాంతకమూ అయ్యే అవకాశముంది. ఇప్పుడున్న వైద్యపరిజ్ఞానంతో దీన్ని తేలిగ్గా తగ్గించవచ్చు కాబట్టి దీని పట్ల అవగాహన ముఖ్యం. బ్యాక్టీరియా, వైరస్, ఫంగై... ఇవన్నీ నిమోనియాకు కారణమవుతాయి.
లక్షణాలు : నిమోనియా వల్ల పిల్లలందరిలోనూ ఒకేలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. ఏ కారణంగా నిమోనియా వచ్చిందనే అంశాన్ని బట్టి లక్షణాలు మారుతుంటాయి. సాధారణంగా కనిపించే లక్షణాలివి...
♦ దగ్గు వస్తుంటుంది. ఇది తెమడ/గళ్లను ఉత్పత్తి చేస్తుండటం వల్ల తడిదగ్గు ఎక్కువ.
♦ తీవ్రమైన జ్వరం.
♦ ఆకలి తగ్గిపోతుంటుంది.
♦ తీవ్రమైన అలసట, నీరసం,
♦ కొందరు పిల్లల్లో వాంతులు, విరేచనాలూ కావచ్చు.
వైరల్ నిమోనియాలో ఊపిరి తీసుకోవడం కష్టం కావడం, ఆయాసం, ఊపిరి తీసుకుంటున్నప్పుడు శబ్దం రావడం (వీజింగ్) క్రమంగా కనిపిస్తాయి. బ్యాక్టీరియా కారణంగా వచ్చే నిమోనియా కంటే వైరల్ నిమోనియా ప్రమాదకరం. పిల్లల్లో వణుకు, ఆయాసం, తలనొప్పి, అయోమయం కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
నిర్ధారణ :
♦ ఛాతీ ఎక్స్‌రే,
♦ కొన్ని రక్తపరీక్షలు
♦ కళ్లె పరీక్ష
♦ సీటీ స్కాన్ (ఛాతీది)
♦ అవసరాన్ని బట్టి అరుదుగా బ్రాంకోస్కోపీ, ఊపిరితిత్తుల్లో నీరు చేరితే దాన్నీ పరీక్ష చేస్తారు.
సెకండరీ నిమోనియా : పిల్లల్లో ఇంకేదైనా వ్యాధి (ముఖ్యంగా వైరల్ జ్వరాలు) వచ్చాక, అది నిమోనియాకు దారితీస్తే దాన్ని సెకండరీ నిమోనియా అంటారు. ఇది కాస్తంత ప్రమాదకరం. అందుకే హాస్పిటల్‌లో ఉంచి చికిత్స అందించాలి. ఇందులో తీవ్రతను బట్టి రక్తనాళం ద్వారా లేదా నోటి ద్వారా యాంటీబయాటిక్స్ ఇవ్వడం, సెలైన్ ఎక్కించడం, ఆక్సిజన్ ఇవ్వడం, పిల్లలు తమంతట తాము కళ్లె / గళ్ల తీయలేరు కాబట్టి వారు దాన్ని ఊసేసేలా వివరించి చెప్పడం, బాగా ఊపిరితీసుకోగలుగుతున్నారా అని చూడటం జరగాలి. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో చిన్నారులను తప్పనిసరిగా హాస్పిటల్‌లో ఉంచి చికిత్స అందించడం మేలు.
నివారణ : ఇప్పుడు 13 రకాల నిమోనియాలకు తగిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.
♦ అందరు పిల్లలకు ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాక్సిన్ వేయించాలి. వర్షాకాలానికి ముందు (ప్రీ–మాన్‌సూన్ పీరియడ్‌లో) ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి.
♦ వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా పిల్లలకు శిక్షణ ఇవ్వడం, బాగా దగ్గుతున్న పెద్దలు, రోగగ్రస్తుల వద్దకు పిల్లలను కాస్త దూరంగా ఉంచడం, చాలాకాలం పాటు ధాన్యం నిల్వ ఉంచే గరిసెలకు, కోళ్ల వంటి పెంపుడు పక్షులకు పిల్లలను దూరంగా వంటి జాగ్రత్తలతో నిమోనియాను కొంతవరకు నివారించవచ్చు. అయితే పిల్లల్లో ఆగకుండా దగ్గు వస్తూ, ఆయాసం వస్తున్నప్పుడు ఒకసారి హాస్పిటల్‌లో చూపించి, తగిన చికిత్స తీసుకోవడమే మేలు.
చికిత్స: బ్యాక్టీరియా వల్ల వచ్చే నిమోనియా మంచి యాంటీబయాటిక్స్‌తో తేలిగ్గా తగ్గిపోతుంది. అయితే వైరల్ ఇన్ఫెక్షన్‌తో నిమోనియా వస్తే దానికి నిర్దుష్టంగా మందులు లేకపోయినా కొన్నిసార్లు యాంటీవైరల్ మందులు ఇస్తారు. ఇలాంటి పిల్లలకు పుష్కలంగా నీళ్లు తాగించడం, గది కాస్తంత సౌకర్యంగా ఉండటంతో పాటు అందులో తగినంత తేమ ఉండేలా చూడటం, జ్వరం, దగ్గు వంటివి తగ్గడానికి లక్షణాలను బట్టి (సింప్టమాటిక్) చికిత్స ఇవ్వడం వంటివి చేస్తారు.
- డా. శాశ్వత్ మొహంతీ
పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్,
విశాఖపట్నం. ఫోన్ : 8882 730 730
www.rainbowhospitals.in
Comments
Please login to add a commentAdd a comment