సౌదీ అరేబియా రాజు కన్నుమూత
రియాద్: సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా(90) కన్నుమూశారు. అబ్దుల్లా శుక్రవారం ఒంటి గంటకు (స్థానిక కాలమాన ప్రకారం) మరణించారని సౌదీ అరేబియా రక్షణ మంత్రి సల్మాన్ తెలిపారు. ఈ నేపథ్యంలో తదుపరి రాజుగా దివంగత అబ్దుల్లా తమ్ముడు మోక్రేన్ కు బాధ్యతలు అప్పచెబుతున్నట్లు ఆయన తెలిపారు. తొలుత అబ్దుల్లా సంస్మరణార్ధం రాయల్ ప్యాలెస్ లో నిర్వహించే ప్రార్థనలకు దేశ ప్రజలందరినీ ఆహ్వానించారు. అనంతరం అబ్దుల్లా అంత్యక్రియలు జరగనున్నాయి.
గత డిసెంబర్ లో అబ్దుల్లా న్యుమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయనకు గొట్టాల ద్వారా కృత్రిమ శ్వాసను అందిస్తున్నారు. ఆయన 2005లో సౌదీ అరేబియా రాజుగా దేశ పగ్గాలు చేపట్టారు. ఆయన ఈ మధ్యే సిరియాలో ఇస్లామిక్ స్టేట్ జరిపిన మారణకాండకు వ్యతిరేకంగా అమెరికా నేతృత్వంలోని సంకీర్ణంలో చేరారు. ఆయన మరణానికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతాపం ప్రకటించారు.