ఈ ప్రశ్నకు బదులేది?
పురాతనం
తవ్వకాల్లో సమాధులు బయటపడడం కొత్తేమీ కాదు. అయితే ఇటీవల చైనాలో బయటపడిన ఒక సమాధి మాత్రం చిన్నపాటి సంచలనం సృష్టించింది. రెండు వేల సంవత్సరాల క్రితం నాటి లియు ఫెయి అనే రాజు సమాధి అది. లియు రాజు చైనాలోని జియాంగ్డ్ ప్రాంతాన్ని ఇరవై ఆరు సంవత్సరాల పాటు పరిపాలించాడు. నాలుగు వందల తొంభై మీటర్ల పరిధిలో ఉన్న ఈ సమాధిలో రకరకాల సంగీత పరికరాలు, పెద్ద రథం, రకరకాల ఆయుధాలు, మధువు సేవించే పాత్రలు...మొదలైన విలువైన వస్తువులను కనుగొన్నారు. బంగారం, వెండితో తయారుచేసిన వస్తువులతో పాటు లక్ష నాణేలు కూడా ఉన్నాయి. వంట గదిలాంటి నిర్మాణం కూడా ఉంది.
చైనాలోని నాన్‌జింగ్ మ్యూజియానికి చెందిన పరిశోధక బృందం ఈ తవ్వకాలు చేపట్టింది. ఒకరికి ఇష్టమైన వస్తువులను వారితో పాటి సమాధి చేయడం అనేది చాలా దేశాల్లో ఉంది. ఇలా చేయడం వల్ల మరుజన్మలో కూడా ఈ వస్తువులను వారికి చెందుతాయనేది ఒక నమ్మకం. లియు సమాధిలో విలువైన సంపద ఉండడం కూడా దీనిలో భాగమే.
‘‘లియు రాజు జీవనశైలి చాలా ఆడంబరంగా ఉండేది. ధైర్యవంతులనూ, దృఢకాయులై వ్యక్తులనూ బాగా ఇష్టపడేవాడు. రాజ్యంలోని యోధులను పిలిచి తరచుగా మాట్లాడేవాడు. రాజప్రాసాదాలు, ఎత్తై పరిశీలన కేంద్రాలు నిర్మించడం అంటే ఆయనకు ఇష్టం. ఎప్పుడు చూసినా ఆవేశం మూర్తీభవించినట్లు కనిపించేవాడు’’ అని ప్రాచీన చరిత్రకారులు లియు గురించి రాశారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎన్నో విలువైన వస్తువులు ఉన్న సమాధిలో లియు రాజు శరీరం కనిపించలేదు. శవపేటిక దెబ్బతిని ఉంది. లియు సమాధిలో కనిపించిన భిన్న రకాల వస్తువులు...ఆనాటి కాలాన్ని దృశ్య రూపంలో చెబుతున్నట్లుగ ఉన్నాయి. ఇది సరేగానీ, ఇంతకీ లియు శరీరం ఎలా మాయమైనట్లు? ఒకవేళ దొంగలే ఈ పని చేశారు అనుకుంటే, మరి విలువైన సంపదను ఎందుకు విడిచి పెట్టారు?!