భద్రాద్రి మూలమూర్తులకు త్వరలో పసిడి తొడుగు
అజ్ఞాత భక్తుడిచ్చిన 12కేజీలతో పనులు
భద్రాచలం: భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామివారు త్వరలో పసిడిపూతతో ధగధగ మెరిసిపోనున్నారు. గర్భగుడిలోని మూల మూర్తులకు 12 కేజీల బంగారంతో తొడుగు పనుల ప్రక్రియ శ్రీకారం కాబోతోంది. మరోపక్క ఆలయానికి బంగారం నిల్వలు క్రమే ణా పెరుగుతుండడంతో..భద్రాద్రి రామాలయం అభివృద్ధి వేగమందుకోనుంది. భద్రాచల దేవస్థానం వందేళ్ల ఉత్సవం సందర్భంగా భక్త రామదాసు చేయించిన ఉత్సవమూర్తులకు బంగారు తొడుగు వేయించారు. ఇప్పుడు గర్భగుడిలోని మూలమూర్తులకు సుమారుగా 12 కేజీల బంగారంతో తొడుగు చేయించేందుకు బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు ముందుకొచ్చారు. ఈ ప్రక్రియ జరుగుతున్నట్లు దేవస్థానం అధికారులు కూడా ఇప్పటికే ప్రకటించారు. అంతా విజయవంతంగా పూర్తయితే భద్రాద్రి రామయ్య..ఇక బంగారు రాముడిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు.
దాతలు సిద్ధం.. ఆదరణ శూన్యం..
దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధి గాంచిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి కానుకలు ఇచ్చేందుకు అనేక మంది దాతలు ముందుకొస్తున్నారు. కానీ వారిని ఆదరించి..కానుకలను పొందడంలో ప్రస్తుత దేవస్థానం అధికారులు తగిన శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. గతంలో పాలకమండలి ఉన్న సమయంలో ఇండియా సిమెంట్ అధినేత శ్రీనివాసన్ ద్వారా గర్భగుడిలోని ప్రధాన ద్వారాన్ని బంగారు వాకిలిగా తయారు చేసేందుకని రూ.50 లక్షలు ఇచ్చా రు. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో దాతల నుంచి సహకారం అందలేదు. ఆలయాభివృద్ధి కోసం దాతలను ప్రోత్సహించాలని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
‘బంగారు’ రాముడు
Published Sat, May 7 2016 2:46 AM | Last Updated on Thu, Apr 4 2019 5:22 PM
Advertisement
Advertisement