నిలోఫర్ నాట్కో భవనంలో చిన్నారులతో కుటుంబసభ్యులు
సాక్షి, హైదరాబాద్: నవజాత శిశు సంరక్షణ కేంద్రం నిలోఫర్ ఆస్పత్రిలో నిమోనియా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వాతావరణంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో నిమోనియా జడలు విప్పుతోంది. నిలోఫర్‌లో ఈ కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. ఏ వార్డులో చూసినా జ్వరం, దగ్గుతో బాధపడే రోగులే దర్శనమిస్తున్నారు. గడిచిన రెండ్రోజుల్లో వ్యాధి సోకిన అయిదేళ్ల లోపు చిన్నారులు ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరంతా ఎన్‌ఐసీయూలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ అందక చనిపోయినట్లు విశ్వసనీయ సమాచారం.
వ్యాధి లక్షణాలు ఇవీ..
ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధిని నిమోనియాగా పిలుస్తారు. చిన్న పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. తల్లి పాలు లేకుండా పెరిగే పిల్లల్లో, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే శిశువులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నారులు, పౌష్టికాహారం లోపంతో పెరిగే పిల్లల్లో ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. నిమోనియా సోకిన వ్యక్తి దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా కూడా చిన్నారులకు సంక్రమిస్తుంటుంది. శీతాకాలంలో వీచే చలి ప్రభావం శిశువుల ఊపిరితిత్తులను చిత్తు చేస్తోంది.
కఫంతో కూడిన దగ్గు చలి జ్వరం, ఛాతి నొప్పితో శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. శిశువు బలహీనంగా, నీరసంగా శక్తి తక్కువగా బరువు ఉన్నట్లు అనిపిస్తుంది. వికారం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ముక్కు నుంచి నీరు కారుతూ.. తేలికపాటి జ్వరం, ఒళ్లు నొప్పులు కనిపిస్తే నిమోనియాగా గుర్తించాలని వైద్యులు పేర్కొంటున్నారు.
చదవండి: ‘ఎమ్మెల్యేల కొనుగోలు’ కేసులో కీలక పరిణామం..
పిడియాట్రిక్ కేసులే అధికం. .
నిలోఫర్ ఓపీలో జ్వర పీడితుల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. ఒక్క పిడియాట్రిక్ విభాగంలోనే ఓపీ రోగుల నమోదు సంఖ్య 1,300కు చేరుకుంది. ప్రతి రోజూ గైనిక్ విభాగంలో 200. సర్జరీ విభాగంలో 100 కేసులు నమోదవుతున్నాయి. దీనికి తోడు నిలోఫర్‌ను సిబ్బంది లేమి సమస్య వెంటాడుతోంది.
పరికరాల కొరత, సకాలంలో అందని రక్తం, అంబులెన్స్‌లు ఉన్నా అందుబాటులో లేని డ్రైవర్లు, అరకొర స్ట్రెచర్లు, సరిపోని వీల్‌చైర్లు.. ఒక్కో పడకపై ముగ్గురేసి చొప్పున రోగులు, వాయిదాల పద్ధతిలో ఎక్స్‌రే, స్కానింగ్ పరీక్షలు, వేళకు అందని రక్త నమూనా ఫలితాల నివేదికల వంటి సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ఫలితంగా వైద్య సేవలు సరిగా అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment