కాలిఫోర్నియా: కరోనా వైరస్ బారినపడిన ఓ వ్యక్తి కోలుకున్న తర్వాత అతడి శరీరంలో ఎలాంటి మార్పు వచ్చిందో చూసి నెటిజన్లు కంగుతింటున్నారు. కాలిఫోర్నియాకు చెందిన మైక్ షుల్ట్‌జ్ అనే వ్యక్తి గత మార్చిలో కరోనా వైరస్ బారిన పడ్డాడు. అయితే మహమ్మారి నుంచి కోలుకోవడానికి అతడికి 6 వారాలు పట్టింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి దాదాపు 23 కిలోగ్రాముల బరువు తగ్గాడు. బరువు తగ్గిన విషయాన్ని ఆయనే వెల్లడించాడు. కరోనా వైరస్ ఎవరికైనా సోకవచ్చనీ, దాని ప్రభావం ఎంతలా ఉంటుందో అవగాహన కల్పించేందుకు కరోనా సోకినప్పుడు ఆసుపత్రిలో తీసుకున్న ఫోటోతో పాటు కరోనాకు ముందు తీసుకున్న ఫొటోలను మైక్ శుక్రవారం సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘కరోనాకు ముందు నా బరువు 86 కిలోగ్రాములు. కరోనా తర్వాత ఇప్పుడు నా బరువు 63 కిలోగ్రాములకు పడిపోయింది. నిజానికి మైక్ శారీరకంగా బలమైన వాడే. అయితే కరోనా ఎలాంటి వారినైనా ప్రభావితం చేయగలదు. దానికి వయసుతో సంబంధం లేదు. మీరు ఆరోగ్య వంతులైనప్పటికీ కూడా ఈ మహమ్మారి మిమ్మల్ని ప్రభావితం చేయగలదు’ అంటూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా మైక్ హెచ్చరించాడు. (దేశంలో ఒక్కరోజే 6088 కరోనా కేసులు)
గత మార్చిలో కరోనా బారిన పడ్డ మైక్.. కరోనా చికిత్సలో భాగంగా వెంటిలేటర్‌పై 6 వారాల పాటు ఉన్నట్లు చెప్పాడు. అదే విధంగా ఈ కోవిడ్-19 న్యూమోనియాతో పాటు తన ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కూడా తగ్గించిందని పేర్కొన్నాడు. దీంతో తను 23 కిలో గ్రాముల బరువు తగ్గానని చెప్పుకొచ్చాడు. ‘‘నేను వారానికి ఆరు నుంచి ఏడు సార్లు జిమ్‌లో వర్కవుట్ చేసేవాడిని. నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. అయితే కరోనా ప్రభావం అధికంగా ఉన్న మయామి బీచ్‌లో మార్చిలో జరిగిన ఓ పార్టీకి హాజరయ్యాను. అందువల్లే నేను కరోనా వైరస్ బారిన పడ్డాను. ఈ మహమ్మారి సోకడంతో నేను న్యూమోనియతో బాధపడటం.. క్రమంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం మొదలయ్యింది. దీంతో వైద్యులు నన్ను వెంటిలేటర్‌పై ఉంచారు. నేను స్వయంగా శ్వాస తీసుకోవడానికి 4 వారాల సమయం పట్టింది. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అయితే కరోనా కారణంగా న్యూమోనియా సమస్యలు రావడంతో చాలా చిక్కిపోయాను. ప్రస్తుతం మళ్లీ నా మునుపటి శరీరం పొందే పనిలో పడ్డాను’’ అని మైక్ పేర్కొన్నాడు. (పారిస్‌లో వైద్య సిబ్బందికి జరిమానా)
Comments
Please login to add a commentAdd a comment