జిల్లాలో ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున మూగ జీవాలు, పాడి పశువులు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని పశు సంవర్ధక శాఖ లైవ్‌స్టాక్ అధికారి సలావుద్దీన్ తెలిపారు. వారం రోజులుగా వాతావరణం చల్లగా ఉండటంతో పాటు వర్షాలు పడుతుండటంతో చెరువులు, కుంటల్లోకి వచ్చిన నీటిని తాగి పశువులు రోగాలపాలవుతాయని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో గొర్రెలు, మేకలు న్యుమోనియా, ఆవులు, గేదెలు గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వివరించారు. వీటిని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్సలు చేయించకపోతే తీవ్ర నష్టాలు తప్పవని హెచ్చరించారు. - మెదక్ రూరల్
గొర్రెలు, మేకల్లో వచ్చే వ్యాధులు...
వర్షాకాలం సీజన్‌లో గొర్లు, మేకలు న్యుమోనియా, ఫుట్‌రాట్ వ్యాధుల బారిన పడతాయి.
న్యుమోనియా సోకిన జీవాలు దగ్గుతో బాధపడుతుంటాయి.
ముక్కు నుంచి చీము కారడం, శ్వాస సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొంటాయి.
వర్షాల వల్ల ఏర్పడే బురద వల్ల జీవాలకు ఫుట్‌రాట్ వ్యాధి సోకుతుంది.
దీనివల్ల మేకలు, గొర్రెల గెటికెల్లో పుండ్లు ఏర్పడి కుంటుతాయి.
వ్యాధి ప్రభావం వల్ల జ్వరం బారిన పడుతాయి.
దీంతో రోజురోజుకు మేత మేయడం బాగా తగ్గిస్తాయి.
ఈ వ్యాధుల నివారణకు దగ్గర్లోని పశువైద్య అధికారుల సూచనల మేరకు మందులు వాడాలి.
యాంటీబయోటిక్, యాంటీసెప్టిక్ మందులు వాడాలి.
పశువుల్లో గొంతు జబ్బవాపు...
వర్షాలు కురిసినప్పుడు చెరువు, కుంటల్లోకి వచ్చే కలుషిత నీటిని తాగిన పశువులకు గొంతు, జబ్బువాపు వ్యాధులు వస్తాయి.
దీన్ని నిర్లక్ష్యం చేస్తే పశువులు మరణించే ప్రమాదం ఉంది.
వ్యాధి లక్షణాలను గమనించిన వెంటనే పశువైద్యులను సంప్రదించి చికిత్సలు చేయించాలి.
వ్యాధి లక్షణాలు...
గొంతువాపు సోకిన పశువులకు తీవ్ర జ్వరం వస్తుంది.
కంటి నుంచి నీరు, గొంతు నుండి చొంగ కారుతుంది.
గొంతు, మెడ వాపు వస్తుంది.
కష్టంగా శ్వాస తీస్తాయి. గురక వంటి శబ్దం వస్తుంది.
ఈ వ్యాధిని వీలైనంత త్వరగా గుర్తించి చికిత్సలు చేయించాలి.
ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా 24 గంటల్లోనే పశువు మరణించే ప్రమాదం ఉంది.
సల్ఫాడిమిడిన్, ఇంటాసెఫ్, టాజు తదితర మందులు వాడాలి.
జబ్బవాపు వ్యాధి లక్షణాలు...
ఆరు మాసాల వయస్సులోని యుక్త వయస్సు గల పెయ్యలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది.
కలుషిత నీరు, ఆహారం, గాలి వల్ల వ్యాపిస్తుంది.
దీంతో జ్వరం వచ్చి ఆకలి మందగిస్తుంది.
నెమరు వేయకపోవటం, గుండె వేగంగా కొట్టుకోవటం, శ్వాస కష్టంగా తీసుకోవటం తదితర లక్షణాలు అధికంగా ఉంటాయి.
తొడ ప్రాంతంలో కండరాలను సూక్ష్మక్రిములు ఆశించి మాంసం కుళ్లిపోయేలా చేస్తాయి.
దీంతో పవుశుల ఆరోగ్యం బాగా కుంటుపడుతుంది.
ఈ సమయంలో జబ్బు పడ్డ కాలిని పైకి ఎత్తి కుంటుతాయి.
వాపు వచ్చిన ప్రాంతంలో చర్మం ఎర్రగా మారి నొప్పి ఉంటుంది.
దీంతో పశువులు 1నుంచి రెండు రోజుల్లో మరణిస్తాయి.
చికిత్స విధానం...
జబ్బవాపు వ్యాధికి గురైన గురైన పశువులను గుర్తించి ప్రారంభంలో పెన్సిలిన్ తదితర యాంటీబయోటిక్ మందులు వాడాలి.
యాంటీపెరైటిక్, యాంటీహిస్టమిన్ వాడాలి. కార్టిజోన్సు, డెక్రోజ్, వాడితే జబ్బవాపును నిరోధించవచ్చు.
వ్యాధుల కాలం.. జీవాలు జర భద్రం
Published Tue, Sep 9 2014 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 1:07 PM
Advertisement
Advertisement