పాప మృతదేహంతో తల్లి అనూష ,ఆస్పత్రి ఎదుట పాప మృతదేహంతో ఆందోళన దృశ్యం
కొత్తగూడెంఅర్బన్: ఈ పాల బుగ్గల పసికందును చూస్తుంటే ఎవరి హృదయమైనా ఇలాగే రోదిస్తుంది. కొత్తగూడెంలోని ప్రైవేటు ఆస్పత్రిలో బుధవారం ఓ మూడు నెలల పసికందు మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతదేహంతో ఆస్పత్రి ఎదుట కుటుంబీకులు, బంధువులు ఆందోళనకు దిగారు. చుంచుపల్లి ఎస్సై నరేష్, చిన్నారి తల్లిదండ్రులు తెలిపిన వివరాలు.. టేకులపల్లి మండలం ముత్యాలంపాడుకు చెందిన ఎం.అనూష, నాగరాజు దంపతులకు రెండవ సంతనంగా మూడు నెలల క్రితం పాప పుట్టింది. శుక్రవారం ఉదయం పాప బాగా ఏడుస్తోంది. పాలు కూడా తాగడం లేదు. తల్లిదండ్రులు భయాందోళనతో కొత్తగూడెం పట్టణంలోని ముర్రేడు వంతెన సమీపంలోగల ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అప్పుడు అక్కడ సిబ్బంది తప్ప వైద్యులు లేరు. వచ్చిన తరువాత పాపను పరీక్షించారు. ఆక్సిజన్‌తోపాటుసెలైన్ ఇచ్చారు. ఆ తరువాత ఎక్స్‌రేకు పంపించారు. క్స్‌రే రిపోర్ట్ చూసి, వెంటనే ఖమ్మం తీసుకెళ్లాలని సూచించారు. ఖమ్మం తరలిస్తుండగా మార్గ మధ్యలోనే పాప ప్రాణాలు విడిచింది. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే పాప చనిపోయిందని ఆరోపిస్తూ కుటుంబీకులు, బంధువులు కలిసి ఆస్పత్రి ఎదుట రెండు గంటలపాటు ఆందోళనకు దిగారు. త్రీ టౌన్, వన్ టౌన్, చుంచుపల్లి పోలీస్ స్టేషన్ల సిబ్బంది సర్దిచెప్పి వచ్చి ఆందోళనను విరమింపజేశారు. వైద్యులు, తల్లిదండ్రుల నుంచి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించారు. ఆస్పత్రి డాక్టర్ మొరిశెట్టి హరిపై చుంచుపల్లి ఎస్సై నరేష్ కేసు నమోదు చేశారు.దీనిపై డాక్టర్ మొరిశెట్టి హరిని వివరణ కోరగా.. ‘‘పాపకు శ్వాస సంబంధ వ్యాధి ఉంది. నిమోనియా ఉండడంతో వలన శ్వాస తీసుకోలేకపోయింది’’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment