విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్: శీతాకాలం ప్రారంభమవడంతో కొద్దిరోజులుగా చలి తీవ్రత ఎక్కువైంది. దీంతో న్యుమోనియా వ్యాధి విజృంభిస్తోంది. రోజురోజుకు ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. రోజుకు సగటున జిల్లాలో 200 నుంచి 400 మంది వరకు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలతో బాధపపడుతూ ఒక్క కేంద్రాస్పత్రికే రోజుకు 20 నుంచి 30 మంది వరకు చికిత్స కోసం వస్తున్నారు. ముఖ్యంగా అప్పుడే పుట్టిన పసికందు నుంచి ఐదేళ్ల లోపు పిల్లలపై ఈ వ్యాధి ప్రభావం అధికంగా ఉంటుంది. 70 శాతం రైలో వైరస్ వల్ల, 30 శాతం బ్యాక్టీరియాల ప్రభావంతో న్యుమోనియా వ్యాపించే అవకాశం ఉంది.
న్యుమోనియా(ఊపిరిత్తులకు సోకే ఇన్‌ఫెక్షన్)
ఈ వ్యాధి వైరస్ వల్ల, బాక్టీరియా వల్ల, క్షయవ్యాధి వల్ల వ్యాప్తి చెందుతుంది. పొగతాగడం, చలిగాలిలో తిరగడం, కుటుంబ పరంగా అస్తమా, అనారోగ్య పరిస్థితుల వల్ల ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. శరీరంలో ఉన్న కురుపులు వల్ల రక్తం ఊపిరి తిత్తుల్లోకి వెళ్లి న్యుమోనియాగా మారుతుంది. ఈ వ్యాధిని ఎక్స్‌రే, సి.టి.స్కాన్, రక్త పరీక్షల ద్వారా గుర్తించవచ్చు.
వ్యాధి లక్షణాలు
తరచూ దగ్గు వస్తుంది. దగ్గేటప్పుడు ఛాతీలో నొప్పితో పాటు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. శారీరకంగా బలహీనడతారు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ వ్యాధి సోకేముందు ఎలాం టి ఆహారమూ తీసుకోరు. పాలు తాగేందుకు నిరాకరిస్తారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
వైద్యుని సలహా మేరకు మందులు వాడాలి. క్షయ వ్యాధి కోసం కఫం పరీక్ష చేసుకోవాలి. న్యుమోనియా పిల్లలకు సోకితే ప్రమాదకరం. పిల్లలను చలికాలంలో బయట తిప్పకూడదు. జలుబు, దగ్గు ఉన్న వారు పిల్లలను ఎత్తుకోరాదు. జనసంచారం ఎక్కువగా ఉన్న చోటకి, గ్రూపులుగా ఉన్న చోట పిల్లలను తిప్పకూడదు. గోరు వెచ్చని నీళ్లు స్నానం చేయించాలి. పెద్దలయితే ఆకుకూరలు, కూరగాయలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఈ వ్యాధికి ముందు జలుబు, కొద్దిగా దగ్గు వస్తాయి. ఆ సమయంలో వెచ్చని దుస్తులు ధరించడం, ఆవిరి పట్టడం చేస్తే వ్యాధిని కొంతవరకూ నిరోధించవచ్చు.
రికార్డు కాని కేసులు
ప్రాణంతకమైన ఈ వ్యాధి పట్ల వైద్య ఆరోగ్యశాఖాధికారులు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు. ఏటా ఎంత మందికి వ్యాధి సోకుతోంది. అందులో పిల్లలు ఎంతమంది తదితర వివరాలు వైద్య ఆరోగ్యశాఖాధికారులు నమోదుచేయవలసి ఉన్నా అలా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఏటా ఎంత మంది మృత్యువాత పడుతున్నారో , ఎంత మంది వ్యాధి బారిన పడుతున్నారో తెలియన పరిస్థితి నెలకింది.
అప్రమత్తత అవసరం...
శీతకాలంలో ఈ వ్యాధి అధికంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. చల్లగాలిలో తిరగడం సాధ్యమైనంతవరకు మానుకోవాలి. అత్యవసరమనుకుంటే ముఖాన్ని పూర్తిగా కప్పే విధంగా ఉండే టోపీలు, స్వెట్టర్లు వంటి వాటిని ధరించి వెళ్లాలి. పిల్లలను బయటకు తీసుకుని వెళ్లినప్పుడు తప్పని సరిగా ఉన్ని దుస్తులు ధరించాలి. చర్మం పొడిబారకుండా క్రీములు రాయాలి. పొగతాగడం పూర్తిగా మానుకోవాలి. మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.
- బి.వెంకటేష్, ఫిజిషియన్, పిల్లల వైద్యులు, కేంద్రాస్పత్రి.
గత ఏడాది కంటే అధికంగా కేసులు
గత ఏడాది రోజుకు 10 నుంచి 20 కేసులు వస్తే, ఈఏడాది 20 నుంచి 30 వరకు వస్తున్నాయి. ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా చలి ఎక్కువైంది. పిల్లలు , వృద్ధులు ఎక్కువగా ఈ వ్యాధిబారిన పడుతున్నారు.
- బి.గౌరీశంకర్, పిల్లల వైద్యుడు
అమ్మో... న్యుమోనియా
Published Wed, Nov 20 2013 4:10 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM
Advertisement
Advertisement