దేశ వ్యాప్తంగా 7.7 మిలియన్ల మంది ‘గిగ్’ వర్కర్లు
యాప్ ఆధారిత కార్మికులకు కరువైన సామాజిక భద్రత
కొత్త చట్టం తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు
ఈలోగా ఈ–శ్రమ్ పోర్టల్‌లో నమోదుకు అవకాశం
తద్వారా ఆరోగ్య బీమా, భద్రత
సాక్షి, అమరావతి: ‘విజయవాడకు చెందిన సంతోశ్‌కు తాను చేస్తున్న ఉద్యోగంలో వచ్చే నెల జీతం కుటుంబ అవసరాలకు సరిపోవడం లేదు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ, రైడ్ యాప్‌ల గురించి తెలుసుకుని పార్ట్‌టైమ్‌గా పనిచేసేందుకు వాటిలో రిజిస్టర్ చేయించుకున్నాడు. సంతోశ్‌ను ఒక వ్యక్తి తనను ఎయిమ్స్ వరకు తీసుకెళ్లాలని యాప్ ద్వారా సంప్రదించాడు.
సరేనని తీసుకెళ్లాక.. నిర్మానుష్య ప్రదేశంలో సంతోశ్‌పై దాడిచేసి సెల్‌ఫోన్, నగదు, బంగారం దోచుకెళ్లాడు. ఆ షాక్ నుంచి బయటపడటానికి సంతోశ్‌కు చాలా కాలం పట్టింది’.. ఇది కేవలం ఒక్క సంతోశ్ అనుభవం మాత్రమే కాదు.. వేలాది మంది గిగ్ వర్కర్లు నిత్యం ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. వీరికి కూడా తగిన సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
బీమాతో పాటు ఎన్నో ప్రయోజనాలు
మన దేశంలో ప్రస్తుతం 7.7 మిలియన్ల మంది గిగ్ వర్కర్లు ఉన్నారు. 2029–30 నాటికి ఈ సంఖ్య 23.5 మిలియన్లకు పెరుగుతుందని నీతి ఆయోగ్ నివేదిక అంచనా. ఒక్కో కార్మికుడు వారానికి ఐదు రోజుల పాటు రోజుకు 8 గంటలు పని చేస్తే నెలకు దాదాపు రూ.18 వేల నుంచి రూ.22 వేల వరకు సంపాదించవచ్చు.
అయితే వీరికి సామాజిక భద్రత అనేది ప్రధాన సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో గిగ్ వర్కర్ల కోసం సామాజిక భద్రత చట్టాన్ని కేంద్రం తీసుకువస్తోంది. అందుకు సంబంధించిన ముసాయిదాను ప్రకటించింది. అందులో భాగంగా ముందుగా గిగ్ వర్కర్లు ఈ–శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి.
అనంతరం వారికి ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా ఆరోగ్య బీమా లభిస్తుంది. నిరుద్యోగ భృతి, ప్రసూతి ప్రయోజనాలు, ప్రమాద బీమా వంటి ఇతర సౌకర్యాలూ లభిస్తాయని కేంద్రం చెబుతోంది. కార్మికుల వివరాలు నమోదు చేయాల్సిందిగా ఓలా, ర్యాపిడో, జొమాటో, స్విగ్గీ తదితర యాప్ ఆధారిత ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ సంస్థలకు కేంద్రం సూచించింది.
నమోదు ఇలా..
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఆర్థిక సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ–శ్రమ్ కార్డ్–2024ను ప్రారంభించింది. దరఖాస్తుదారులందరికీ రూ.1,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ–శ్రమ్ కార్డు సహాయంతో 60 ఏళ్లు పైబడిన వారికి నెలకు రూ.3,000 పెన్షన్ కూడా లభిస్తుంది.
ఆన్‌లైన్‌లో eshram.gov.in ద్వారా ఈ పథకానికి నమోదు చేసుకోవచ్చు. పాస్‌పోర్ట్ సైజు ఫోటో, ఆధార్, పాన్, రేషన్ కార్డులు, జనన ధ్రువీకరణ పత్రం, తాజా విద్యుత్ బిల్లు, బ్యాంక్ పాస్‌బుక్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌తో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. దరఖాస్తుకు సంబంధించి ఏదైనా సహాయం కోసం ఫోన్ నంబర్ 011–23710704ను సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment