
దేశ వాస్తవిక ఆర్థిక సమర్థతపై మదింపు వేసేందుకు కేంద్రం తొలిసారిగా భారీ సర్వే నిర్వహించనుంది. ఈ ఆర్థిక సర్వేలో చిన్న దుకాణదారులు, వీధి వ్యాపారులు సహా అసంఘటిత రంగ కార్మికుల్ని జోడించనుంది. వివిధ అధ్యయనాలు పరిగణనలోకి తీసుకోని ఉద్యోగాలను ఇందులో కలపనుంది. భారీ ఎత్తున ప్రామాణిక ఆర్థిక సర్వే జరపడం వల్ల వ్యవస్థ పరిణామాలను మెరుగ్గా సమీక్షించేందుకు, వివిధ కార్యక్రమాలు, పథకాలు, విధాన సంబంధిత ప్రణాళికలపై సరైన అంచనా వేసే వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ మాసాంతంలో ఆరంభం
పాతిక కోట్లకు పైగా కుటుంబాలు, ఏడు కోట్ల వ్యాపార సంస్థలు ఈ సర్వే పరిధిలోకి రాగలవని అంచనా వేస్తున్నారు. జూన్ మాసాంతానికి ఈ ప్రక్రియ ప్రారంభం కావచ్చునని, ఆరు మాసాల్లో సర్వే నివేదికలు అందవచ్చునని భావిస్తున్నారు. ఉపాధి కల్పనలో, ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో మోదీ సర్కారు విఫలమైందంటూ ప్రతిపక్షం ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంలో పదే పదే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వీధి వ్యాపారులను స్వయం ఉపాధి పొందుతున్న ఉద్యోగులుగా పేర్కొంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేక పార్టీలు ఎద్దేవా చేశాయి. 2018–19 ఆర్థిక సంవత్సర మొదటి త్రైమాసిక వృద్ధి రేటు 5.8 శాతానికి పడిపోవడం, గత 17 త్రైమాసికాలతో పోల్చుకుంటే అత్యంత కనిష్టానికి చేరుకోవడం వంటి పరిణామాలను తీవ్రంగా పరిగణించిన సర్కారు.. ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే దిశగా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఆర్థిక వృద్ధిని, పెట్టుబడులను, ఉపాధిని పెంచేందుకు బుధవారం ప్రధాని మోదీ రెండు కేబినెట్ కమిటీలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment