కళ్లముందున్న వివక్ష కనబడదా? | Caste Discrimination In India Oxfam Report | Sakshi
Sakshi News home page

కళ్లముందున్న వివక్ష కనబడదా?

Published Thu, Nov 3 2022 12:26 AM | Last Updated on Thu, Nov 3 2022 1:25 AM

Caste Discrimination In India Oxfam Report - Sakshi

ఉద్యోగార్థుల కులం గురించి తెలిసేదాకా ప్రయత్నం చేసే అలవాటు కంపెనీలకు ఉందని గతంలోనే ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ దళిత్‌ స్టడీస్‌ (ఐఐడీఎస్‌) బయటపెట్టింది. ఇలాంటి అనుభవాలను చాలామంది దళిత, ఆదివాసీలు, కొన్ని వెనుకబడిన కులాల యువతీ యువకులు ఎదుర్కొనే ఉంటారు. ఈ వివక్ష దేశంలో ఇంకా అలాగే ఉందని తాజాగా ఆక్స్‌ఫామ్‌ నివేదిక కూడా వెల్లడించింది. కులం, మతం, స్త్రీ–పురుషులు – ఇలా రకరకాల వివక్ష కొనసాగుతూనే ఉందని ఆ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు అత్యంత అవసరమైనవే... ఉపాధి, ఉద్యోగం. కానీ వారికి ఆ రెండూ ఆమడ దూరంలో ఉన్నాయి. కుల వ్యవస్థ ప్రజల జీవితాలను ఇంకా నియంత్రిస్తూనే ఉంది.

రమేష్‌ మెష్రం అనే విద్యార్థి ఉద్యోగం కోసం ఒక కంపెనీకి దరఖాస్తు చేసుకున్నాడు. దానికి కావాల్సిన అర్హతలన్నీ అతడికి ఉన్నాయి. కావాల్సిన డాక్యుమెంట్స్‌ అన్నీ పంపాడు. కానీ పిలుపు రాలేదు. తన పేరును కొంచెం మార్చి, అంటే ఇంటిపేరును సంక్షిప్తీకరించి పంపిస్తే పిలుపు వచ్చింది. ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు అభ్యర్థుల కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడడం జరుగుతుంది. ఆధిపత్య కులాలైతే సంక్షిప్తంగా మాట్లా డడం, దళితులు, వెనుకబడిన కులాలైతే, వారి కుల వివరాలు తెలి యకపోతే, మీ తండ్రి ఏం చేస్తారు? గ్రామమా? పట్టణమా? ఎటు వంటి జీవనోపాధి ఉండేది?... అట్లా కులం తెలిసేదాకా లాగడం జరుగుతుంటుంది. ఒక వ్యక్తి కులం గురించి తెలిసేదాకా ప్రయత్నం చేసే అలవాటు కంపెనీలకు ఉందని పదిహేనేళ్ళ క్రితమే ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ దళిత్‌ స్టడీస్‌(ఐఐడీఎస్‌) బయటపెట్టింది. 

ఉద్యోగం మాత్రమే కాదు, ప్రాథమిక విద్య, వ్యాపారం, ఆరోగ్య అవకాశాలు, ఇట్లా కొన్ని అంశాలపై ఒక సంవత్సరానికిపైగా సర్వే చేసింది ఆ సంస్థ. ఆ సర్వే ఆ రోజుల్లో సంచలనం రేపింది. దానిని 2010 సంవత్సరంలో ‘బ్లాకెడ్‌ బై కాస్ట్‌’ పేరుతో పుస్తకంగా కూడా ముద్రించారు. దానికి ఐఐడీఎస్‌ ఛైర్‌పర్సన్‌ ప్రొఫెసర్‌ సుఖ్‌దేవ్‌ థోరట్‌ నేతృత్వం వహించారు. ఇటువంటి అనుభవాలను చాలామంది దళిత, ఆదివాసీ, కొన్ని వెనుకబడిన కులాల యువతీ యువకులు ఎదుర్కొనే ఉంటారు. ఈ కులాల్లో అత్యధిక నైపుణ్యం కలిగినవాళ్ళకు కొన్ని ఇబ్బందుల తర్వాతనైనా అవకాశాలు వచ్చి ఉంటాయి. ఆధిపత్య కులాల్లోని మంచివాళ్ళు, లేదా విదేశీ నిపుణులు ఇంటర్వ్యూ చేస్తే ఆ ఫలితం వేరుగా ఉంటుందనడంలో సందేహం లేదు. 

ఇప్పుడు దీని ప్రస్తావన ఎందుకనే ప్రశ్న చాలామందికి వచ్చే అవకాశం ఉంది. ‘ఆక్స్‌ఫామ్‌’ అనే అంతర్జాతీయ అధ్యయన సంస్థ ఇటీవల ‘ఇండియా డిస్క్రిమినేషన్‌ రిపోర్టు–2020’ పేరుతో ఒక నివే దికను విడుదల చేసింది. ఇందులో కులం, మతం, స్త్రీ–పురుషులు – ఇలా రకరకాల వివక్ష కొనసాగుతోందనీ, ఉద్యోగాలు పొందడంలో, వైద్య సౌకర్యాలు అందుకోవడంలో వివక్ష ఎదురవుతోందనీ ఆ నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను నేషనల్‌ సర్వే ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ అన్‌ఎంప్లాయ్‌మెంట్, పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వేల ఆధా రంగా రూపొందించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకూ, మిగతా సమాజానికీ మధ్య నెలవారీ సంపాదనలో తేడా ఉందని గుర్తించారు.

ఎస్సీ, ఎస్టీలు నెలకు 10,533 రూపాయలు సంపాదిస్తే, సమాజంలోని మిగతా వ్యక్తులు నెలకు సరాసరిగా 15,878 రూపాయలు పొందు తున్నారని వెల్లడించారు. పురుషులు, మహిళల మధ్య కూడా వేత నాలు, కూలీ విషయంలో వ్యత్యాసం ఉందని తేల్చారు. మగవారు నెలకు 19,779 రూపాయలు సంపాదిస్తే, మహిళలు 15,578 రూపా యలు మాత్రమే పొందుతున్నారు. పట్టణాల్లో ముస్లింలు నెలకు 13,672 రూపాయలు సంపాదిస్తే, ఇత రులు 20,345 రూపాయలు సంపాదిస్తున్నారు. స్వయం ఉపాధిలో మగవారు సరాసరి 15,996 రూపాయల ఆదాయం పొందితే, మహిళలు కేవలం 6,620 రూపా యలు మాత్రమే సంపాదిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిలో ఎస్సీ, ఎస్టీలు 7,337 రూపాయలు పొందితే, ఇతరులు 9,174 రూపాయలు సంపాదిస్తున్నారు.

కోవిడ్‌ అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు రెండు న్నర రెట్లు అధికమైందని ఈ సర్వే తెలుపుతున్నది. 10 శాతం నుంచి 22 శాతానికి పెరిగింది. పర్మినెంట్‌ ఉద్యోగాల్లో కోత పడింది. జీత భత్యాల్లో కూడా కోతపడింది. లాక్‌డౌన్‌ సమయంలో, ఆ తర్వాత చాలాకాలం సగం జీతాలే లభించాయి. మహిళల్లో కోవిడ్‌ తీవ్ర ప్రభావాన్ని కలుగజేసింది. స్వయం ఉపాధి పొందుతున్న వాళ్ళల్లో మగవారిలో 9 శాతం మంది దెబ్బతింటే, మహిళలు 70 శాతం మంది నష్టపోయారు.    

ఆర్థిక వృద్ధిలోనూ, ఆదాయం పెరగడానికి ప్రారంభించే వ్యాపా రాల్లోనూ అప్పు అనేది ముఖ్యం. ఎవరైతే అవసరానికి తగ్గ ఆర్థిక సాయం పొందుతారో వారు ఆర్థిక వనరులను పెంచుకోగలుగు తారు. వేలకోట్లు ఆస్తులు కలిగిన అనేక మంది పారిశ్రామిక వేత్తలు కూడా బ్యాంకుల నుంచి రుణాలు లభించడం వల్లనే తమ కార్యకలాపాలను కొనసాగించగలుగుతున్నారు. ఈ విషయంపై కూడా ఆక్స్‌ఫామ్‌ తన అధ్యయనాన్ని కొనసాగించింది. ఒక వ్యక్తి లేదా ఇద్దరు ముగ్గురు ఉమ్మడిగా లక్షల కోట్లు బ్యాంకుల నుంచి పొందితే, 120 కోట్ల మంది కేవలం కొన్ని కోట్ల రూపాయలను మాత్రమే అప్పుగా పొంద గలిగారు.

ఇందులో వివిధ వర్గాల మధ్యన మరింత వ్యత్యాసం ఉంది. ఎస్సీలు తాము తీసుకున్న రుణాల్లో 34 శాతం వాణిజ్య బ్యాంకులు, 9 శాతం సహకార బ్యాంకుల నుంచి తీసుకున్నట్టు లెక్కలు చెపు తున్నాయి. ఎస్టీలు 31 శాతం వాణిజ్య బ్యాంకులు, 29 శాతం సహకార బ్యాంకుల నుంచి తీసుకున్నట్టు లెక్కలు చెపుతున్నాయి. ఎస్సీలు అతి తక్కువ బ్యాంకు రుణాలు పొందడానికి ప్రధాన కారణం, దాదాపు 90 శాతం మందికి పైగా దళితులకు నికరమైన వ్యవసాయ భూమి లేదు. ఒకవేళ ఉన్నా అది అరెకరం, ఎకరానికి మించదు.

అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగుల సంఖ్య చాలా తగ్గింది. 96 శాతం ఉద్యోగాలు కేవలం ప్రైవేట్‌ రంగంలోనే ఉన్నాయి. నాలుగుశాతం ఉద్యోగాలు ప్రభుత్వ అధీనంలోని సంస్థల్లో ఉన్నాయి. 2018–19లో నిరుద్యోగుల శాతం ఎస్సీ, ఎస్టీల్లో 9.9 శాతంగా ఉంటే, అది ఇతరుల్లో 7.9 శాతంగా ఉంది. నిజానికి ఉద్యోగాల మీద ఆధారపడేది ఎక్కువగా ఎస్సీ, ఎస్టీలే. వారి చేతిలో భూమి లేదు. వ్యాపారాల్లేవు. ఆర్థిక వనరులు లేవు. కానీ ఉద్యోగ నియామకాల్లో మాత్రం ఆ వర్గాలు వివక్షను ఎదుర్కొంటున్నాయి.

ఇప్పుడు మళ్ళీ మొదటి విషయానికి వద్దాం. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వాలు  ఘోరంగా విఫలమవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు అత్యంత అవస రమైనవే...  ఉపాధి, ఉద్యోగం. కానీ వాళ్ళకు ఆ రెండూ ఆమడ దూరంలో ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం, దేశంలో ఉన్న అసమానతలు. వీటికి పునాది కుల వ్యవస్థలో ఉంది. ఆధిపత్య కులాల్లోని ఎక్కువ మందికి ఉద్యోగ, ఉపాధి, వ్యాపార రంగాల్లో ప్రవేశించడానికి ఏ అడ్డంకులూ లేవు. వారిలో కొద్ది శాతం మంది పేదలు ఉండొచ్చు. ఇది ఎట్లా అంటే దళితుల్లో ధనికులు ఉన్నట్టే. 
ఒక గ్రామానికి సంబంధించిన వివరాలను నేను రెండు రోజుల క్రితం సేకరించాను. ఆ గ్రామంలో ఉన్న ఆధిపత్య కులాలు భూమిని కలిగి ఉన్నాయి. అదే ఆధారంతో ఉద్యోగార్హమైన చదువులు చదివారు.

ఈ రోజు వాళ్ళు విదేశాల్లో తమ పిల్లలను చదివించి, ఉద్యోగాల్లో స్థిరపరిచారు. వెనుకబడిన కులాలకు ఆదాయాన్ని పొందే కుల వృత్తులున్నాయి. వాటి ద్వారా బతుకుదెరువుకు ఇబ్బంది లేని జీవితా లను గడుపుతున్నారు. కానీ 25 శాతానికి పైగా ఉన్న ఎస్సీలు మాత్రం రోజు రోజుకీ తమ బతుకు వెళ్ళదీయడానికి పరుగులు పెడుతున్నారు. వారు భద్రత కలిగిన ఉద్యోగాల్లో లేరు. తరతరాలుగా కుల వ్యవస్థ అవలంబించిన వివక్ష ప్రజల జీవితాలను నియంత్రిస్తున్నది. 

పరిస్థితి ఇట్లా ఉంటే, ఇటీవల కొంతమంది తప్పుడు భావాలను ప్రచారం చేస్తున్నారు. దళితులు కొందరి పట్ల విద్వేషాన్ని రెచ్చగొడు తున్నారని మాట్లాడుతున్నారు. పైన పేర్కొన్న వాస్తవాలు దళితులను రోజురోజుకీ ఇంకా పేదరికంలోకి, అభద్రతలోనికి నెడుతున్నాయి. వేలాది మంది దళితులు ఆధిపత్య కులాల చేతుల్లో హత్యలకు, అత్యా చారాలకు గురయ్యారు. ఎక్కడా కూడా దళితులు తిరిగి అణచివేతకు పూనుకోలేదు. దళితుల మీద నిందలు వేసేవాళ్లు అధ్యయనం చేయడం మంచిది. అంతిమంగా ఈ వివక్షను, హింసను ఎట్లా నివా రించాలో, నిర్మూలించాలో ఆలోచిస్తే మంచిది.

మల్లెపల్లి లక్ష్మయ్య

వ్యాసకర్త సామాజిక విశ్లేషకులుమొబైల్‌: 81063 22077

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement