సాక్షి, హైదరాబాద్: కరోనా రెండో వేవ్ దేశంలోని గ్రామీణ ప్రాంతాలపై తీవ్రంగా ప్రభావం చూపిందని.. దేశ ప్రజారోగ్య వ్యవస్థలోని లోపాలు, లోటుపాట్లు అనేకం బయటపడ్డాయని ఆక్స్‌ఫామ్ ఇండియా తన నివేదికలో పేర్కొంది. వైద్యారోగ్యపరంగా ఏదైనా అత్యవసర పరిస్థితి, విపత్తు వంటివి సంభవిస్తే.. దానిని ఎదుర్కొనేందుకు ఏ మేరకు సంసిద్ధంగా ఉన్నమనేది తేలిపోయిందని వ్యాఖ్యానించింది. దేశంలో వైద్య వసతులు, కరోనా ఉధృతి తదితర అంశాలపై ఆక్స్‌ఫామ్ ఇండియా సంస్థ తాజాగా ‘ఇనీక్వాలిటీ రిపోర్ట్ 2021: ఇండియాస్ అనీక్వల్ హెల్త్‌కేర్ స్టోరీ’ పేరిట నివేదిక విడుదల చేసింది. ప్రభుత్వపరంగా అందించే వైద్య సేవలే.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని వివిధ వర్గాల ప్రజల మధ్య ‘ఆరోగ్య సేవల అసమానతలు, అంతరాల’ను తగ్గించేందుకు ఉపయోగపడతాయని అందులో పేర్కొంది.
కానీ దేశంలోని వివిధ వర్గాల ప్రజల్లో ఇప్పటికే ఏర్పడిన సామాజిక, ఆర్థిక అసమానతలు.. అటు ఆరోగ్య రంగంలోనూ అసమానతలకు కారణమైనట్టు వెల్లడించింది. ఇటీవల వైద్యారోగ్య రంగంలో భారత్ మంచి పురోగతిని సాధించినా.. అది ప్రైవేట్ రంగంలోనే ఉండడం వల్ల పేద, అణగారిన వర్గాలు వైద్యసేవల్లో అసమానతలను ఎదుర్కొంటున్నాయని తెలిపింది.
నివేదికలో ప్రధాన అంశాలివీ..
► దేశంలో ఉన్నతాదాయ వర్గాలతో పోల్చితే.. తక్కువ ఆదాయం పొందేవారు ఐదు రెట్లు అధికంగా కోవిడ్ బారినపడ్డారు.
► కరోనా రెండో వేవ్‌లో ఏర్పడిన పరిస్థితులను పరిశీలిస్తే.. దేశంలో వైద్యపరమైన మౌలిక వసతులు సరిగ్గా లేవనేది స్పష్టమైంది
► గ్రామీణ ప్రాంతాల ప్రజలు కరోనాతో తీవ్రంగా ప్రభావితం అయ్యారు. నగరాల్లో మధ్య, ఎగువ మధ్యతరగతిపై అధికంగా ప్రభావం కనిపించింది.
► ప్రైవేట్ ఆస్పత్రుల్లో అడ్డగోలు ఫీజుల వసూలు, మందుల బ్లాక్ మార్కెటింగ్ బయటపడింది.
► దేశంలో వ్యాక్సినేషన్ సజావుగా సాగలేదు.
► నేషనల్ హెల్త్ ప్రొఫైల్ (2017) డేటా ప్రకారం.. దేశంలో 10,189 మందికి ఒక ప్రభుత్వ అల్లోపతి డాక్టర్ ఉన్నారు. 90,343 మందికి ఒక ప్రభుత్వ ఆస్పత్రి ఉంది.
► 2010–20 మధ్యకాలంలో ప్రతి 10 వేల మందికి అందుబాటులో ఉన్న బెడ్ల సంఖ్య 9 నుంచి 5కు తగ్గింది.
► దేశంలో 70 శాతం గ్రామీణ జనాభా కాగా.. ఆ ప్రాంతాల్లో 40 శాతమే బెడ్లు ఉన్నాయి.
ఆక్స్‌ఫామ్ నివేదికలో చేసిన సిఫార్సులివీ..
► ధనికులు, పేదల మధ్య ఆరోగ్యసేవల విషయంలో అంతరాలు, అసమానతలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలి. అందరికీ ఉచిత వ్యాక్సినేషన్ చేయాలి.
► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యారోగ్య రంగానికి కేటాయించే బడ్జెట్ పెంచాలి. ఎస్సీలు, ఎస్టీల జనాభాకు తగ్గట్టుగా కేటాయించాలి.
► అణగారిన, అట్టడుగు వర్గాల జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజారోగ్య సౌకర్యాలు మెరుగుపరచాలి.
► ఔట్ పేషెంట్ కేర్‌ను వైద్య బీమా పథకాల్లో అంతర్భాగం చేయాలి.
► ప్రభుత్వ ఆరోగ్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నచోట కేంద్ర ప్రాయోజిత పథకాల కింద నిధులు కేటాయించి, డయాగ్నొస్టిక్ సేవలు, అత్యవసర మందులు ఇవ్వాలి.
► అన్ని రాష్ట్రాలు ‘పేషెంట్స్ రైట్స్ చార్టర్’ను నోటిఫై చేసేలా ఆదేశించాలి.
► ఇష్టారీతిన బిల్లులు వసూలు చేయకుండా ప్రైవేట్ ఆరోగ్య రంగాన్ని క్రమబద్ధీకరించాలి.
► వైద్యారోగ్య వ్యవస్థలో మానవ వనరులు, మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాలి. కొండ ప్రాంతాలు, గిరిజన ఆవాసాలు, గ్రామీణ, ఇతర సుదూర ప్రాంతాల్లో వైద్య పరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి.
► తాగునీరు, పారిశుధ్యం, అక్షరాస్యత తదితర సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలి.
Comments
Please login to add a commentAdd a comment