
కైరో: ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి, గ్లోబల్ వార్మింగ్, అంతర్యుద్ధ పరిస్థితులు ఆకలి కేకల్ని పెంచేస్తున్నాయి. తినడానికి తిండి లేక ఆకలిబాధతో ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 11 మంది మరణిస్తున్నట్టుగా పేదరిక నిర్మూలనపై కృషి చేస్తున్న అంతర్జాతీయ సంస్థ ఆక్స్‌ఫామ్ తన తాజా నివేదికలో వెల్లడించింది. ‘‘ది హంగర్ వైరస్ మల్టిప్‌లైస్’’ అన్న పేరుతో ఆక్స్‌ఫామ్ సంస్థ గురువారం ఒక నివేదికను విడుదల చేసింది.
కరోనా మహమ్మారితో నిమిషానికి ఏడుగురు మరణిస్తూ ఉంటే, అదే సమయంలో ఆకలి బాధ తట్టుకోలేక నిమిషానికి 11 మంది మరణించడం హృదయ విదారకర పరిస్థితులకు అద్దం పడుతోందని ఆ సంస్థ సీఈఓ అబ్బీ మ్యాక్స్‌మ్యాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ గణాంకాలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. మన ఊహకి కూడా అందని దుర్భర పరిస్థితుల్ని ఎందరో ఎదుర్కొంటున్నారు. అంతర్యుద్ధాలు, పర్యావరణ మార్పులతో ఏర్పడే విపత్తులు, ఆర్థిక సంక్షోభాలు కోట్లాది మందిని తిండికి దూరం చేశాయి’’ అని ఆయన అన్నారు. ‘‘మార్కెట్లపై బాంబులు వేస్తున్నారు. పండిన పంటల్ని ధ్వంసం చేస్తున్నారు. వాతావరణ మార్పులతో దుర్భర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవన్నీ ఆకలిని పెంచేస్తున్నాయి. ఇలాంటి విపత్తు నుంచి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలపై ఉంది’’ అని మ్యాక్స్‌మ్యాన్ అన్నారు.
నివేదికలో అంశాలివే..
► ప్రపంచవ్యాప్తంగా 15.5 కోట్ల మంది ఆహార కొరత ఎదుర్కొంటున్నారు. గత ఏడాదితో పోలిస్తే వీరి సంఖ్య 2 కోట్లు పెరిగింది.
► ఆహార కొరతని ఎదుర్కొంటున్న వారిలో దాదాపుగా 66% మంది మిలటరీ సంక్షోభం నెలకొన్న దేశాల్లోనే ఉన్నారు
► కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పులతో 5,20,000 మంది ఆకలితో నకనకలాడిపోతున్నారు
► కోవిడ్–19 ప్రభావం, వాతావరణ మార్పులతో గత ఏడాదికాలంలోనే ఆహార ఉత్పత్తుల ధరలు 40% పెరిగాయి
► గత ఏడాది కాలంలో ప్రపంచ దేశాల్లో కరువు పరిస్థితులు ఆరు రెట్లు పెరిగిపోయాయి
► కరోనా కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగంపై చేసే ఖర్చు 5,100 కోట్ల డాలర్లు పెరిగింది. ఆకలి కేకల్ని నిర్మూలించడానికి ఐక్యరాజ్యసమితి అంచనా వేసిన ఖర్చు కంటే మిలటరీపై చేస్తున్న ఖర్చు ఆరు రెట్లు ఎక్కువ.
► అఫ్గానిస్తాన్, ఇథియోపియా, దక్షిణ సూడాన్, సిరియా, యెమన్ దేశాల్లో ఆకలి కేకలు అత్యధికంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment