జనావళిపై ప్రపంచీకరణను రుద్ది, దానిద్వారా దేశదేశాల్లోని సహజ వనరులను అపరిమితంగా కొల్లగొట్టిన అగ్రరాజ్యాలు స్వరం మార్చి ఇప్పుడు రక్షణాత్మక విధానాలకు తిరోగమిస్తున్న వేళ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఈఎఫ్) సమావేశాలు ప్రారంభమయ్యాయి. ‘ప్రపంచాన్ని బాగా కలవర పెడుతున్న అంశాలపై చర్చించడానిక’ంటూ డబ్ల్యుఈఎఫ్ 1971లో ఈ వార్షిక సమావేశాలకు అంకురార్పణ చేసింది. వర్తమాన ప్రపంచ ధోరణులపైనా, పర్య వసానంగా పుట్టుకొచ్చిన సమస్యలపైనా, వాటివల్ల కలిగే ప్రమాదాలపైనా మేధో మథనం చేయడం, పరిష్కారాలను సూచించడం ఈ సమావేశాల ఉద్దేశం. ఎప్పటిలానే ఈసారి కూడా దావోస్‌కు దాదాపు వంద దేశాల నుంచి ప్రపంచ కుబేరులు, రాజకీయ నాయకులు, వివిధ దేశాల అధినేతలు, ఆర్థికమంత్రులు, బ్యాంకర్లు, కార్పొరేట్ అధిపతులు, మేధావులు, పాత్రికేయులు 3,000మంది హాజరయ్యారు. డబ్ల్యుఈఎఫ్ తో సమస్యేమంటే ప్రపంచంలో పెరిగిపోతున్న అసమానతల గురించి అక్కడ అందరూ కూర్చుని మాట్లాడుకోవడమే తప్ప కార్యాచరణ శూన్యం. పేద, గొప్ప తారతమ్యాలు అంతకంతకూ పెరగడమే తప్ప తగ్గుతున్న దాఖలాలు లేవు. ఇందుకు ఏటా విడుదలవుతున్న ఆక్స్‌ఫామ్ నివేదికలే సాక్ష్యం.
ఈ సదస్సునుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ భారత్ సాధించిన ప్రగతి గురించి చెబుతూ వెల్లడించిన గణాంకాలు సదస్సులో పాల్గొన్నవారిని సహజంగానే ఆకట్టుకుని ఉంటాయి. 1997లో అప్పటి ప్రధాని దేవెగౌడ ఈ సదస్సులో పాల్గొన్నప్పుడు భారత్ జీడీపీ దాదాపు రూ. 26 లక్షల కోట్లుంటే ఇప్పుడది ఆరు రెట్లు పెరిగిందని చెప్పారు. అభివృద్ధిలో అందరినీ భాగస్వా ములను చేసి, ఆ ఫలాలు అందరికీ దక్కేటందుకు అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. కానీ ఆయన ప్రసంగానికి ముందురోజే ఆక్స్‌ఫామ్ విడుదల చేసిన నివేదిక ఈ అభివృద్ధి తీరుతెన్నులను ఎత్తిచూపింది. కేవలం 1 శాతంగా ఉన్న సంపన్నుల వద్ద 73 శాతం సంపద చిక్కుకున్నదని తెలిపింది. ఆదాయాల్లో వ్యత్యాసాలు, సంపద పంపిణీలో అసమతుల్యత అంతిమంగా సామాజిక అశాంతికే దారితీస్తాయి. ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసిన నివేదిక ఈ వ్యత్యాసాల గురించి మరింత లోతుగా పరిశీలించింది. ప్రభుత్వాలు ఆర్థికా భివృద్ధికి ప్రాధాన్యమిచ్చినంతగా సామాజిక సమగ్రాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వక పోవడాన్ని ప్రస్తావించింది.
సమ్మిళిత వృద్ధిలో మన పొరుగునున్న పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ కన్నా దిగువనున్నామని ఆ నివేదిక చెప్పడాన్నిబట్టి మోదీ ప్రస్తావించిన ఆర్థిక ప్రగతంతా ఎవరి గుప్పిట చిక్కుకున్నదో ఇట్టే అర్ధమవుతుంది. ఎంతసేపూ వృద్ధి రేటు చుట్టూ తిరుగుతూ దాన్నే నిజమైన వృద్ధిగా పరిగ ణించొద్దని సామాజికార్థిక నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. ఒక దేశం నిజమైన అభివృద్ధి అక్కడి పౌరుల ఆర్థిక భద్రతలో, వారి సామాజిక అభివృద్ధిలో, అక్కడి ఉద్యోగితలో, జీవనప్రమాణాల్లో ఉంటుంది తప్ప జీడీపీలో కాదు. అసమానతలను పారదోలేందుకు, సంపద పంపిణీ సక్రమంగా ఉండేందుకు ఎలాంటి చర్యలూ లేకపోవడం వల్ల గణాంకాలు ఘనంగా కనబడుతున్నా సగటు పౌరుల జీవనం మెరుగుపడటం లేదు. ఏడెనిమిదేళ్లుగా మన దేశం ఆర్థికంగా నిలదొక్కుకున్నదంటే దానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్‌లో క్షీణిం చిన చమురు ధరల పర్యవసానమని మరువకూడదు. గత కొన్ని వారాలుగా అవి మళ్లీ పైపైకి పోతున్నాయి. ఇంధన వినియోగం దేశంలో నిరుటితో పోల్చినా రెట్టింపయింది. నిరుడు చమురు డిమాండు రోజుకు 93 వేల బ్యారెళ్లు ఉంటే ఇప్పుడది 1,90,000 బ్యారెళ్లు అయింది. మనకు కావలసిన చమురులో 80 శాతం దిగుమతుల ద్వారానే లభిస్తుంది. కనుక చమురు ధర పైపైకి ఎగిసేకొద్దీ ఆమేరకు విదేశీ మారకద్రవ్య నిల్వలు హరించుకుపోతాయి. అందువల్ల తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని మన ఆర్థిక వ్యవస్థను కట్టుదిట్టం చేసుకోవడం అవసరం.
నిరుడు సదస్సుకు చైనా ప్రధాని షీ జిన్‌పింగ్ హాజరై హడావుడి చేయడం వల్ల కావొచ్చు ఈసారి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే తదితరులు వస్తున్నారు. మన ప్రధాని ఒకరు దావోస్ సదస్సుకు వెళ్లడం రెండు దశాబ్దాల తర్వాత ఇదే ప్రథమం. 2000 సంవత్సరంలో బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దావోస్ వచ్చారు. మళ్లీ ఇన్నేళ్లకు ఆ దేశాధినేత అడుగుపెడుతున్నారు. అయితే తాను వెళ్లేది ‘అమెరికాకే అగ్ర ప్రాధాన్యం’ అన్న తన నినాదాన్ని నొక్కి చెప్పడానికేనని ట్రంప్ ప్రకటించారు. అగ్రరాజ్యాల ప్రయోజనాలను నెరవేర్చే స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలను ఇన్నేళ్లుగా బడుగు దేశాలకు అంటగట్టి వాటిని ప్రపంచీకరణలో భాగస్వాములను చేయడంలో ప్రపంచ ఆర్థిక వేదిక పాత్ర తక్కు వేమీ కాదు. ఆ వేదిక పైనుంచే ప్రపంచీకరణ స్ఫూర్తికి విరుద్ధమైన అభిప్రాయాలు ఆయన వ్యక్తం చేస్తే అది ఆసక్తిదాయకమే.
ఆక్స్‌ఫామ్ 2010నాటి నివేదిక ప్రపంచ జనాభాలోని సగంమంది ఆస్తికి సమానమైన సంపద కేవలం 388మంది కుబేరుల వద్ద కేంద్రీకృతమైందని తెలి పింది. మరో ఆరేళ్లకు... అంటే 2016లో విడుదలైన సంస్థ నివేదిక ప్రకారం ఆ సగం సంపదా మొత్తం 62మంది కుబేరుల వద్దకు చేరిందని వెల్లడించింది. తాజా నివేదిక ఇప్పుడా సంపద కేవలం 8మంది వద్ద ఉన్నదంటున్నది. ఆ కుబేరులు పన్నుల బెడదలేని మారుమూల దేశాల్లో 7.6 లక్షల కోట్ల డాలర్ల సంపద దాచి పెట్టారని చెబుతోంది. ప్రపంచ ఆర్థిక ప్రగతి దేనికి దారితీస్తున్నదో, చివరికెలాంటి ఫలితాలిస్తున్నదో ఈ నివేదిక అద్దం పడుతోంది. దీన్ని గురించి దావోస్‌లో ఆత్మ పరిశీలన చేసుకుంటేనే... సరైన పరిష్కారానికి ప్రయత్నిస్తేనే ఈ సదస్సుకొక అర్ధం, పరమార్ధం ఉంటుంది. లేనట్టయితే ఎప్పటిలా ఊకదంపుడు ఉపన్యాసాల వేదికగా మిగిలిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment