ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
జాతిహితం
ప్రధానమంత్రి, పలువురు కీలక కేంద్ర మంత్రులు, సీఎంల హాజరుతో ఇంత కృషి జరిగినా దావోస్ సమావేశ ఫలితాలు పరిమితమనే చెప్పాలి. ప్రధాని మోదీ సహా భారత ప్రతిని ధులు ఎంతటి చక్కటి సందేశాలిచ్చినాగానీ చివరికి వారు ప్రపంచ వ్యాపార సంస్థలకు ఇవ్వజూపేది ఏంటనేదే కీలకమవుతుంది. ఇండియాలో వృద్ధి రేటు ఏడు శాతం ఉంటే మంచిదే. కాని, చైనా జనాభాకు సరిసమానమైన జనం, దానిలో ఐదో వంతు మాత్రమే ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పుడు ప్రయోజనాలు పరిమితంగానే ఉంటాయి.
దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశానికి భారత్ హాజరుకావడం ఇది మూడోసారి. 2006లో ‘అన్ని చోట్లా ఇండియా’ అనే నినాదంతో, 2011లో ‘సమ్మిళిత భారత్’ పేరిట దావోస్‌లో పాల్గొనడానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఈ రెండు సందర్భాలకు భిన్నంగా ఇప్పుడు భారత ప్రధాని దావోస్ వెళ్లారు. ఇంతకు ముందు దావోస్ సదస్సుకు హాజ రైన చివరి ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ. 1997 నాటి ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ విషయ పరిజ్ఞానంతో పాటు తనకంటూ సొంత శైలి ఉన్న నేత. ఆయన సర్కారుకు పార్లమెంటులో భారీ మెజారిటీ ఉంది. బీజేపీ, దాని మిత్రపక్షాలు 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. ఇందిరాగాంధీ తర్వాత పార్టీపై మోదీకి ఉన్నంత పట్టు మరే ప్రధా నికీ లేదు. నేడు మరే ఇతర పెద్ద ప్రజాస్వామ్య దేశంలోనూ ఏ ఒక్క నాయ కునికీ ఇంతటి నియంత్రణ లేదనేది మనం గుర్తుంచుకోవాలి.
విదేశీ ప్రయా ణం హుషారుగా చేసే అలవాటు ఉన్న మోదీకి ప్రపంచనేతలతో మంచి సంబంధాలున్నాయి. ప్రపంచదేశాల నేతల శిఖరాగ్రసభల్లో వారిని సుదీర్ఘ గాఢాలింగనం చేసుకోవడం మోదీ ప్రత్యేక ముద్రగా మారింది. దావోస్‌లో ఆయన పాల్గొనడం డబ్ల్యూఈఎఫ్‌కు, దాని స్థాపకుడు క్లాజ్ ష్వాబ్‌కు నిజంగా ఘనవిజయం. ఆర్థిక వేదిక సదస్సులో మోదీ ఏం చేశారనే విషయం అలా ఉంచితే, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయనకు దావోస్‌తో మంచి అనుభ వం, అనుబంధమే ఉంది. ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లోనే ఆయన డబ్ల్యూఈఎఫ్ సమావేశాలకు హాజరవడంతోపాటు 2007లో దాలియన్‌లో జరిగిన వేసవి దావోస్ సదస్సులో పాల్గొన్నారు. అక్కడ జరిగిన ఓ చర్చకు నేను సమన్వయకర్తగా వ్యవహరించాను. భారత రాజకీయాలపై అనేక ప్రశ్న లడిగినా, ఆయన మాత్రం తాను రాజకీయనేతగా ఇక్కడికి రాలేదనీ, దేశ సమ స్యలను చర్చంచనని మోదీ తెగేసి చెప్పారు.
మోదీకి ఆహ్వానం గిట్టని యూపీఏ సర్కారు!
భారత పారిశ్రామికవేత్తలకు మోదీపై మోజు పెరిగేకొద్దీ దావోస్ సదస్సులో దేశ రాజకీయాల ప్రస్తావన, వాటిపై చర్చ తప్పలేదు. మోదీకి ఆహ్వానం పంపడం తమకు ఇష్టంలేదనే విషయాన్ని కూడా ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వా హకులకు అప్పటి యూపీఏ సర్కారు తెలిపింది. రాజకీయ ఒత్తిడి కారణం గానే తనకు ఆహ్వానం రాలేదని మోదీ నమ్మడంలో తప్పేమీ లేదు. అందుకే గత మూడేళ్లలో దావోస్ శిఖరాగ్ర సదస్సుపై ఆయన సర్కారు ఆసక్తి చూప లేదు. తర్వాత పరిస్థితిని చక్కదిద్దడానికి డబ్ల్యూఈఎఫ్ చేయాల్సిందంతా చేసింది. ప్రారంభ ప్లీనరీ సమావేశంలో ప్రసంగించే అవకాశం మోదీకి ఇచ్చారు. అగ్రదేశాల నేతలకు లభించే ఈ అవకాశం కిందటేడాది చైనా అధ్య క్షుడు షీ జిన్‌పింగ్‌కు దక్కింది. ఈ ఏడాది దీనికి గట్టి పోటీ ఏర్పడింది. డబ్ల్యూ ఈఎఫ్ సదస్సుకు డొనాల్డ్ ట్రంప్, ఇమాన్యుయేల్ మాక్రాన్, జస్టిన్ ట్రూడో, థెరిజా మే, బెంజిమిన్ నెతన్యాహూ, ఏంజెలా మెర్కెల్ వంటి హేమాహే మీలు హాజరయ్యారు.
కిటకిటలాడిన మోదీ సభ!
మోదీ ప్రసంగించిన సభా ప్రాంగణం నేతలతో కిక్కిరిసింది. ట్రంప్ పాలన లోని అమెరికాపైనా, జిన్‌పింగ్ నాయకత్వాన నడుస్తున్న చైనాపైనా మోదీ కొన్ని చెప్పుకోదగ్గ వ్యాఖ్యలు చేశారు. ప్రాచీన భారత సంస్కృతి, జ్ఞానం ఆధారంగా ఆయన ప్రపంచ దేశాల నేతలకు ఎన్నో సలహాలు, సూచనలు అందించారు. మోదీ ఉపన్యాసం సదస్సు అంతటా చర్చనీయాంశమైంది. ఆయన ప్రారంభ ప్రసంగం చేసిన నాలుగు రోజుల వరకూ నాకు ఎదురైన ప్రతి భారతీయుడూ, ‘ప్రధాని ఉపన్యాసంపై మీరేమనుకుంటున్నారు?’ అని ప్రశ్నించాడు. దీనికి జవాబివ్వడానికి ముందే, తన అభిప్రాయం చెప్పాడు. పొగడ్తల వర్షం కురిపించాడు. ఇక్కడే ఓ విశేషముంది. భారతీయుడు కాని ఏ వ్యక్తీ ఈ ప్రశ్న అడగలేదు. అలాగే, అంతర్జాతీయ వార్తా ప్రచారసాధనాలు మోదీ ప్రసంగాన్ని పెద్దగా పట్టించుకోలేదు. చైనాతో పాశ్చాత్య దేశాలతో పాటు, బడా అంతర్జాతీయ వ్యాపార సంస్థలు విసిగిపోయి ఉన్నాయి. చైనా అంటే వాటికి చికాకు.
చైనాకు ప్రత్యామ్నాయంగా ఇండియా విజయవంత మైన పాత్ర పోషించాలని, తమ పెట్టుబడులకు మంచి కేంద్రంగా మారాలని అవి కోరుకుంటున్నాయి. చైనాలో వ్యతిరేక ఫలితాలతో నష్టపోయే అంతర్జా తీయ కంపెనీల సంఖ్య పెరిగేకొద్దీ గత కొన్నేళ్లుగా ఇండియాపై వాటికి అభి మానం పెరుగుతూ వస్తోంది. ఇండియా ఆర్థికశక్తిగా విజయం సాధించాలని అవి కోరుకుంటున్నాయి. అయితే, నేడు ఇండియా ఈ విషయంలో వాగ్దానం చేసేది ఎక్కువ– సాధించేది తక్కువ అనే పరిస్థితి ఉంది. మోదీ ప్రధాని పదవి చేపట్టాక దేశంలో మరిన్ని భారీ సంస్కరణలు వస్తాయని, అదే స్థాయిలో ఆర్థిక, వ్యూహాత్మక సుస్థిరత నెలకొంటుందని అంచనాలు సాగాయి. భారత్‌కు సంబంధించి దావోస్‌లో ఇలాంటి చర్చలు, ఊహాగానాలు ఇటీవల పెరి గాయి. ప్రపంచ ఆర్థికాభివృద్ధి రేటు మరోసారి భారీగా అంటే 3.9 శాతానికి పెరగడంతో ఇండియాపై ఆశలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. వాస్తవానికి లాభసాటి ఒప్పందాలు చేసుకోడానికి సరైన వేదిక దావోస్. పైకి ప్రపంచ పరిస్థితులు మెరుగుపరచాల్సిన అవసరం గురించి నేతలందరూ మాట్లాడు తున్నా, తెర వెనుక జరిగేది వేరు.
పోటీపడిన రాష్ట్రాలు
దావోస్‌లో ఇండియాకు సంబంధించిన వ్యవహారాలు బాగానే నడిచాయి. భారత ప్రభుత్వం–సీఐఐ, చంద్రబాబు నాయుడి ఆంధ్ర, దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో–ఇలా పలు రాష్ట్ర ప్రభుత్వాలు బడా కంపెనీలు తమ బృందాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అన్ని చోట్లా గట్టి ప్రయత్నాలే చేశాయి. ప్రధానమంత్రి, పలువురు కీలక కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రుల హాజరుతో ఇంత కృషి జరిగినా ఫలితాలు పరి మితమనే చెప్పాలి. ప్రధాని మోదీ సహా భారత ప్రతినిధులు ఎంతటి చక్కటి సందేశాలిచ్చినాగానీ చివరికి వారు ప్రపంచ వ్యాపార సంస్థలకు ఇవ్వజూపేది ఏంటనేదే కీలకమవుతుంది. ఇండియాలో వృద్ధి రేటు ఏడు శాతం ఉంటే మంచిదే. కాని, చైనా జనాభాకు సరిసమానమైన జనం, దానిలో ఐదో వంతు మాత్రమే ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పుడు ప్రయోజనాలు పరిమితంగానే ఉంటాయి. ఇది వాస్తవానికి క్రూర ప్రపంచమని చెప్పాలి.
ఇది ఇబ్బందికర ప్రశ్నలనే అడుగుతుంది. ఇప్పుడు మీది నిజంగా బలమైన ప్రభుత్వమే అయితే వోడాఫోన్ కంపెనీని వెనుకటి కాలానికి పన్ను చెల్లించమని చేసిన చట్టసవరణను ఇంకా ఎందుకు రద్దు చేయలేదు? వంటి ప్రశ్నలు ఈ వేదికపై తలెత్తాయి. దశాబ్దం క్రితం ఇండియా దావోస్‌లో ఆర్భాటంగా తన బలం ప్రదర్శించినపుడు అప్పట్లో దేశంలో వృద్ధి రేటు 9 శాతం (పాత సూత్రం ప్రకారం) దాటుతోంది. టెక్నాలజీ కంపెనీలు పరుగులు పెడుతున్నాయి. ఐటీ సేవల ఔట్‌సోర్సింగ్ కారణంగా బెంగళూరు కొత్త సిలికాన్ వ్యాలీగా అవతరిం చింది. ఈ పరిస్థితుల్లో మన్మోహన్‌సింగ్ వంటి నియమితుడైన ప్రధాని సైతం దావోస్ వచ్చి ప్రసంగిస్తే కొంత ప్రభావం చూపించేవారు. వాగ్ధాటిలో మోదీకి పోటీ శక్తి ఆయనకు ఏ మాత్రం లేదనే విషయం పక్కనబెట్టినా డాక్టర్ సింగ్ మంచి ఫలితాలే సాధించేవారని భావించవచ్చు. మన్మోహన్ దావోస్ వెళ్లాల నుకున్నారు. కాని, ప్రపంచీకరణను వ్యతిరేకించే వామపక్షాలు ఆయనను వెళ్లనీయలేదు. దావోస్ సదస్సుకు సింగ్ హాజరైతే మద్దతు ఉపసంహరిస్తా మని అవి బెదిరించాయి. ఈ విషయం రాహుల్ బజాజ్ ఇక్కడి మీడియాకు వెల్లడించారు.
నాయకుడు బలవంతుడేగాని పరిస్థితి అనుకూలంగా లేదు!
ఏ సందేశం ఎలా ఇవ్వాలో తెలిసిన ప్రపంచస్థాయి బలమైన నాయకుడు భారత్‌ను పరిపాలిస్తున్నాడు. అయితే, పరిస్థితులు ఉత్సాహపూరితంగా లేవు. 2006 నుంచి 2011 వరకూ, మళ్లీ అప్పటి నుంచి 2018 వరకూ ఆహార పదార్థాలు, వంటకాలు ( ఆంధ్ర సహా దేశంలో చాలా ఎక్కువ) బాలీవుడ్ సినిమాలు, ఆధ్యాత్మికత, (ఇప్పుడు) యోగా– రంగాల్లో తన ప్రత్యే కతలు, విజయాల గురించే ఇండియా గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. కాని ఈ రంగాల్లో ఒకదేశానికి ఉన్న శక్తియుక్తులు దాన్ని ఉన్నత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి చాలా పరిమితులున్నాయి. ఇలాంటి కొన్ని ప్రత్యేక అంశాల్లో సాధించిన ప్రగతి థాయిలాండ్ వంటి చిన్న దేశానికి ప్రయోజన కరం కావచ్చు. కిందటేడాది ఈ దేశానికి మూడు కోట్ల 60 లక్షల మంది పర్యాటకులు రాగా, ఇండియాను కోటీ రెండు లక్షల మంది టూరిస్టులు సందర్శించారు.
భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోరుకుంటున్న ఇండియా ఓ సైనిక శక్తిలా గట్టిగా మాట్లాడాలని ప్రపంచదేశాలు కోరుకుంటున్నాయి. ప్రపంచ రక్షణ, భద్రత, వ్యూహాత్మక విషయాలపై ఇండియా ఎందుకు మాట్లా డదని ప్రపంచ నేతలు అడుగుతున్నారు. ఈ అంశాలపై కొన్ని ప్రకటనలు చేస్తే ఇండియాకు, మోదీకి గొప్ప ప్రచారం లభించేది. దావోస్‌లో భారత్ కొన్ని ప్రత్యేక రంగాల్లో తన శక్తియుక్తుల గురించి ప్రచారం చేసుకుంది. రిపబ్లిక్ దినోత్సం రోజున పది మంది ఆగ్నేయాసియా నేతలను ముఖ్య అతిధులుగా ఆహ్వానించి తన సైనికపాటవాన్ని ఢిల్లీలో ప్రద ర్శించింది. సముద్రయానంలో నిబంధనల ప్రకారం నడుచుకోవడం, దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం వంటి అంశాలపై ఇండియా గట్టి సందేశ మిచ్చి ఉంటే బాగుండేది.
దావోస్ సందేశానికి రిపబ్లిక్ డే దౌత్యం తోడైతే గొప్ప ఫలితాలు అందేవి. ఈ అవకాశాన్ని జారవిడుచుకుంది. గత పదేళ్లలో ఇండియా చెప్పింది ఎక్కువ–చేసింది తక్కువ అనే భావన ఇతర దేశాల్లో కనిపిస్తోంది. అయితే, ఈసారి కూడా తన స్వభావానికి భిన్నమైన ప్రదర్శనకు దిగింది. తన శక్తిసామర్థ్యాలను తగినంతగా ప్రపంచానికి అర్థమయ్యేలా చూపించలేకపోయింది. దావోస్‌లో పదేళ్ల క్రితం కనిపించిన భారతీయ ప్రము ఖులే ఈసారి కనిపించారు. ఇండియా తరఫున జరిపిన భేటీలకు వివిధదేశాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరైతే తప్ప ప్రపంచపటంలో భారత్‌కు తగిన గుర్తింపు, ప్రయోజనం ఉండదు. మన గురించి ఎంత గొప్పగా మనం చెప్పు కున్నా జరిగేది ఇంతే.
- శేఖర్ గుప్తా
వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్
twitter@shekargupta
Comments
Please login to add a commentAdd a comment