దావోస్ : ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పలువురు అంతర్జాతీయ కంపెనీల సీఈవోలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దేశ ఆర్థిక పురోగమనాన్ని వారికి వివరించి, పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. దావోస్‌లో మోదీ రౌండ్ టేబుల్ భేటీకి సంబంధించిన వివరాలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ వెల్లడించారు.
భారత్ అంటే.. : సీఈవోలతో మాట్లాడుతూ మోదీ.. భారత్‌కు సరికొత్త నిర్వచనం చెప్పారు. ‘‘భారతదేశం అంటేనే వ్యాపారం.. వ్యాపరమంటేనే భారతదేశం. ప్రపంచంలోనే వేగవంతంగా అభివృద్ధిచెందుతోన్న ఆర్థిక వ్యవస్థ మాది. అవకాశాలగని కూడా. మీరంతా పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో అనువైన దేశం’’ అని వ్యాఖ్యానించారు. ఐదురోజులపాటు జరిగే దావోస్ సదస్సులో ప్రధాని ఒకరోజు మాత్రమే పాల్గొన్నారు. అంతర్జాతీయ కంపెనీల సీఈవోలతో సమావేశం అనంతరం వివిధ దేశాధి నేతలతో ద్వైపాక్షిక చర్చలు చేస్తారు.
20 ఏళ్ల తర్వాత.. : 1997లో నాటి ప్రధాని దేవేగౌడ అనంతరం.. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటున్న తొలి భారత ప్రధానిగా ప్రధాని మోదీ నిలిచారు. ప్రపంచంలో కీలక ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్‌లో వివిధ వ్యాపారాలకున్న అవకాశాలను ఈ సదస్సులో మోదీ వివరించారు. ప్రధానితోపాటు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సురేశ్ ప్రభు, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు దావోస్ వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment