సాక్షి, న్యూఢిల్లీ:ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన విలయం అంతా ఇంతాకాదు. దిగ్గజ ఆర్థికవ్యవస్థలు కూడా తీవ్ర మాంద్యంలోకి జారుకున్నాయి. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా దేశీయంగా కోట్లాదిమంది కార్మికులు ఉపాధిలేక రోడ్డున పడ్డారు. కనీసం ఆదాయం లేక తీరని సంక్షోభంలోకి కూరుకుపోయారు. ఈ సంక్షోభానికి సంబంధించిన ఆక్స్‌ఫాం నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. దేశంలో తీవ్రమవుతున్న ఆదాయ అసమానతలపై ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేసింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో సోమవారం ఈ నివేదికను ప్రవేశపెట్టింది. దీనిప్రకారం భారతీయ బిలియనీర్ల సంపద 35 శాతం పుంజుకుంది. దీంతో వారి ఆస్థి 422.9 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. ఈ విషయంలో అమెరికా చైనా, జర్మనీ, రష్యా , ఫ్రాన్స్ తరువాత భారతదేశం ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉంది.
కరోనావై మహమ్మారి మూలంగా భారతదేశంలోని దేశ బిలియనీర్ల సంపద 35 శాతం పెరిగింది. మరోవైపు పేదలు నిరుద్యోగం, ఆకలితో చావులకు గురయ్యారు. కోట్లాది కార్మికులు ఉపాధిని కోల్పోయారు. ఫలితంగా ఆదాయ అసమానతల రేషియో మరింత దిగజారిందని వ్యాఖ్యానించింది. లాక్‌డౌన్ సమయంలో 84 శాతం కుటుంబాలు వివిధ రకాల ఆదాయ నష్టాలను చవిచూశాయని, 2020 , ఏప్రిల్‌లోనే ప్రతి గంటకు 1.7 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని నివేదిక పేర్కొంది. ఇది అనధికారిక రంగాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీసినట్లు నివేదిక పేర్కొంది. మొత్తం 12.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోగా, వీరిలో 75 శాతం మంది అనధికారిక రంగంలో 9.2 కోట్ల ఉద్యోగాలు కోల్పోయారని తెలిపింది. ఈ పరిస్థితులను వెంటనే పరిష్కరించకపోతే ఈ సంక్షోభం మరింత తీవ్రమవుతుందని ఆక్స్‌ఫాం ఇండియా సీఈఓ అమితాబ్ బెహార్ హెచ్చరించారు.
మరోవైపు లాక్‌డౌన్ అమలు చేసిన 2020 మార్చి కాలంనుంచి భారతదేశంలోని టాప్ 100 బిలియనీర్ల ఆదాయం భారీ పెరుగుదలను చేసింది. అంతేకాదు వీరి ఆదాయాన్ని 138 మిలియన్ల పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి, రూ. 94,045 చొప్పున పంచడానికి సరిపోతుందని వెల్లడించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ ఒక గంటలో ఆర్జించిన సంపదను పొందాలంటే సగటు నైపుణ్యం లేని కార్మికుడికి వెయ్యి సంవత్సరాలు పడుతుందని పేర్కొంది. అలాగే ఒక సెకనులో సృష్టించిన దాన్ని సాధించాలంటే మూడు సంవత్సరాలు పడుతుందని నివేదిక తెలిపింది.
ఆరోగ్య సంరక్షణలో ఉన్న అసమానతలను కూడా ఎత్తి చూపిన నివేదిక మరో కీలక వ్యాఖ్య చేసింది. కోవిడ్ సమయంలో దేశంలోని టాప్ 11 బిలియనీర్లు ఆర్జించిన సంపదపై కేవలం ఒక శాతం పన్ను విధించినా ప్రజలకు సరసమైన ధరలో నాణ్యమైన మందులను అందించే కేంద్ర జనఔషధి పథకం కేటాయింపులను 140 రెట్లు పెంచుకోవచ్చని అభిప్రాయపడింది. అలాగే 2020 ఏప్రిల్‌లో 1.7 కోట్ల మంది మహిళలు ఉద్యోగాలు కోల్పోయారని తెలిపింది. ముఖ్యంగా లాక్‌డౌన్ తరువాత మహిళా నిరుద్యోగిత 15 శాతం పెరిగిందని నివేదించింది.
కాగా 2020 ఆగస్టులో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఈ గ్రహం మీద నాల్గవ ధనవంతుడిగా నిలిచిన సంగతి తెలిసిందే. మహమ్మారి సమయంలో ఒకవైపు దేశంలో 24 శాతం మంది ప్రజలు నెలకు 3,000 లోపే ఆర్జించగా, అంబానీ మాత్రం గంటకు 90 కోట్ల రూపాయలు సంపాదించారు. ఒక్క అంబానీ ఆర్జించిన సంపాదనతోనే 40 కోట్లమంది అసంఘటిత కార్మికులను కనీసం అయిదునెలలపాటు ఆదుకోవచ్చని ఆక్స్‌ఫాం నివేదించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment