
దావోస్: ఆర్థిక వృద్ధి గణాంకాలు ఎలా ఉన్నప్పటికీ దేశీయంగా ఆర్థిక అసమానతలు మాత్రం అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గతేడాది జరిగిన మొత్తం సంపద సృష్టిలో 73 శాతం సొమ్మంతా ఒక్క శాతం సంపన్నుల దగ్గరే పోగుపడింది. అదే సమయంలో దేశ జనాభాలో దాదాపు సగభాగమైన 67 కోట్ల మంది పైగా పేదల సంపద కేవలం ఒకే ఒక్క శాతం పెరిగింది. అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆక్స్‌ఫామ్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే తరుణంలో ఈ నివేదిక విడుదల కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్థిక అసమానతలను రూపుమాపడంపై దృష్టి పెడుతున్న ప్రపంచ దేశాల నేతలు ఆక్స్‌ఫామ్ నివేదికపై కూలంకషంగా చర్చించనున్నారు. ఓవైపు తిండికి కూడా గతిలేక కోట్ల మంది ప్రజలు పేదరికంలో మగ్గిపోతుంటే.. సంపన్నులు మరింత సంపద పోగు చేసుకునేలా ప్రపంచ ఎకానమీ తీరుతెన్నులు మారుతున్నాయని ఆక్స్‌ఫామ్ అధ్యయనంలో పేర్కొంది.
కేంద్ర బడ్జెట్‌కి సమాన సంపద ..
ఆక్స్‌ఫామ్ 2017కి సంబంధించి నిర్వహించిన సర్వేలో భారత్‌లో కుబేరుల సంపద రూ. 20.9 లక్షల కోట్లకు పైగా పెరిగినట్లు వెల్లడైంది. ఇది 2017–18 కేంద్ర ప్రభుత్వ మొత్తం బడ్జెట్‌కి దాదాపు సరిసమానం. ఆక్స్‌ఫామ్ గతేడాది నిర్వహించిన సర్వేలో 2016లో దేశీయంగా మొత్తం సంపదలో 58 శాతం వాటా ఒక్క శాతం సంపన్నుల వద్దే ఉన్నట్లు వెల్లడైంది.
అంతర్జాతీయంగా నమోదైన సగటు 50 శాతం కన్నా ఇది అధికం కావడం గమనార్హం. ప్రభుత్వ విధానాలను బడా కంపెనీలు ప్రభావితం చేస్తుండటం, ఉద్యోగులు అణిచివేతకు గురవుతుండటం, వాటాదారులకు మరిన్ని లాభాలు పంచే యావతో.. కార్పొరేట్ కంపెనీలు వ్యయాలను భారీగా తగ్గించుకుంటూ ఉండటం తదితర అంశాలు.. కార్పొరేట్ బాసులు, వాటాదారుల లాభాల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఈ సర్వేలో మొత్తం పది దేశాలకు చెందిన 70,000 మంది ప్రజలు పాల్గొన్నారు.
17 మంది కొత్త బిలియనీర్లు..
గతేడాది భారత్‌లో కొత్తగా 17 మంది బిలియనీర్లు పుట్టుకొచ్చారు. దీంతో వీరి సంఖ్య 101కి చేరింది. భారతీయ బిలియనీర్ల సంపద పరిమాణం గతేడాదితో పోలిస్తే రూ. 4.89 లక్షల కోట్లు పెరిగి రూ. 20.7 లక్షల కోట్లకు చేరింది. ఇది అన్ని రాష్ట్రాలు కలిపి.. విద్య, ఆరోగ్యానికి కేటాయించిన బడ్జెట్‌లో దాదాపు 85 శాతానికి సమానం. 37 శాతం దేశీ బిలియనీర్లకు కుటుంబం నుంచి వారసత్వంగా సంపద వచ్చింది. దేశీయంగా మొత్తం బిలియనీర్ల సంపదలో వీరి సంపద వాటా 51 శాతం మేర ఉంది.
బిలియనీర్ల సంఖ్య పెరగడమనేది ఎదుగుతున్న ఎకానమీకి సంకేతం కాదని, విఫలమవుతున్న ఆర్థిక వ్యవస్థకు నిదర్శనమని ఆక్స్‌ఫామ్ ఇండియా సీఈవో నిషా అగర్వాల్ వ్యాఖ్యానించారు. సంపన్నులు, పేద వర్గాల మధ్య వ్యత్యాసం పెరిగిపోతుండటం మరింత అవినీతికి దారితీస్తుందని తెలిపారు. ‘2017లో బిలియనీర్ల సంఖ్య గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. ప్రతి రెండు రోజులకు ఒక బిలియనీర్ పుట్టుకొచ్చారు. ఇక 2010 నుంచి బిలియనీర్ల సంపద సగటున ఏడాదికి 13 శాతం మేర పెరిగింది. ఇది సామాన్య ఉద్యోగుల జీతభత్యాల పెరుగుదల కన్నా ఆరు రెట్లు ఎక్కువ.
సాధారణంగా వారి జీతభత్యాలు ఏడాదికి సగటున కేవలం 2% మాత్రమే పెరిగాయి‘ అని ఆక్స్‌ఫామ్ పేర్కొంది. దేశీయం గా గ్రామీణ ప్రాంతాల్లో కనీస వేతనం అందుకునే ఒక సామాన్యుడు.. ఒక దిగ్గజ దుస్తుల తయారీ సంస్థ సీఈవో వార్షిక వేతన స్థాయిని అందుకోవడానికి ఏకంగా 941 సంవత్సరాలు పడుతుందని అధ్యయనం అంచనా వేసింది. ఇక అమెరికాలోనైతే.. సీఈఓ సుమారు ఒక రోజులో ఆర్జించే వేతనం.. ఒక సామాన్య ఉద్యోగి ఏడాది సంపాదనకు సమానంగా ఉంటోంది.
ఈ చర్యలు అవసరం..
కేవలం కొద్ది మంది సంపన్నులకు మాత్రమే కాకుండా ప్రజలందరికీ ప్రయోజనాలు చేకూరేలా ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దేలా భారత ప్రభుత్వం దృష్టి సారించాలని ఆక్స్‌ఫామ్ తెలిపింది. ఉద్యోగావకాశాలు ఊతమిస్తూ కార్మిక శక్తి ప్రాధాన్యం ఎక్కువగా ఉండే రంగాలను ప్రోత్సహించడం, వ్యవసాయంలో పెట్టుబడులు పెంచడం, ప్రస్తుత సామాజిక సంక్షేమ పథకాలను మరింత సమర్ధంగా అమలు చేయడం వంటి చర్యలతో సమ్మిళిత వృద్ధిని సాధించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment