దావోస్: ఆక్స్‌ఫామ్ ఇండియా సంచలన నివేదికను విడుదల చేసింది. దేశంలోని కోట్లామంది పేదరికంలోనే మగ్గుతుండగా సంపన్నుల సంపద మరింత పెరుగుతోందని తాజా రిపోర్టులో వెల్లడించింది. 2017లో భారత్‌లో లక్షాధికారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆక్స్‌ఫామ్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా స్విట్జర్లాండ్‌లోని దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ సమ్మిట్ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు ఈ అధ్యయనాన్ని విడుదల చేయడం ప్రాధాన‍్యతను సంతరించుకుంది. భారత్‌లో సంపద ఎక్కువ భాగం అత్యంత ధనవంతులైన కొద్ది మంది వద్దే కేంద్రీకృతమై ఉందని 'రివార్డ్ వర్క్, నాట్ వెల్త్' పేరుతో నిర్వహించిన సర్వే వెల్లడించింది. ఈ సందర్భంగా దేశంలో పెరుగుతున్న అసమానతలపై ఆందోళన వ్యక్తం చేసింది. 2017 సంవత్సరంలో సంపద సృష్టిలో 73శాతం కేవలం ఒక్క శాతం మంది వద్దే ఉందని ఆక్స్‌ఫామ్ సర్వే తెలిపింది.
సర్వే ప్రకారం.. భారత్‌లోని ఒక్క శాతం ధనికుల సంపద 2017లో రూ.20.9లక్షల కోట్లు పెరిగింది. ఇది దాదాపుగా ఓ ఏడాది కేంద్ర బడ్జెట్‌తో సమానం. మరోవైపు దాదాపు 67కోట్ల మంది భారతీయుల సంపద కేవలం ఒక్క శాతమే పెరిగిందని నివేదించింది. 2010 నుంచి భారత్‌లో బిలియనీర్ల సంపద ఏడాదికి సగటున 13శాతం పెరిగిందట. సాధారణ ఉద్యోగి సంపదతో పోలిస్తే ఇది ఆరు రెట్లు ఎక్కువ. భారత్‌లో ఓ ప్రముఖ కంపెనీలో అధిక వేతనం తీసుకునే ఎగ్జిక్యూటివ్ ఏడాదిపాటు సంపాదించిన మొత్తం సొమ్మును.. గ్రామీణ ప్రాంతంలో కనీస వేతనం తీసుకునే ఓచిన్న ఉద్యోగి సంపాదించడానికి దాదాపు 941 ఏళ్లు పడుతుందనే షాకింగ్ అంశాన్ని కూడా ఈ సర్వే తెలిపింది. అంతేకాదు ఇదే అమెరికాలో అయితే ఓ ప్రముఖ కంపెనీ సీఈఓ ఒక్క రోజు తీసుకునే వేతనాన్ని.. సాధారణ ఉద్యోగి సంపాదించడానికి ఏడాది పడుతుందట.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని కూడా వ్యాఖ్యానించింది. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన మొత్తం సంపదలో 82శాతం ధనివంతులైన కేవలం ఒక్క శాతం మంది వద్దకు చేరిందని సర్వే తెలిపింది. సుమారు 3.7బిలియన్ల మంది ప్రజలకు వారి సంపాదనలో ఏమాత్రం వృద్ధి లేదని పేర్కొంది.
కాగా ఈ సమావేశానికి భారత ప్రధానమంతి నరేంద్రమోదీ హాజరు కానున్నారు. గత20 ఏళ్లలో తొలిసారిగా ఇండియా ప్రధాని ఈ సదస్సు హాజరవుతుండగా బడ్జెట్ రూపకల్పనలో బిజీగా ఉన్న ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఈ సదస్సుకు హాజరు కావడం లేదు. అలాగే భారతదేశ ఆర్థిక వ్యవస్థ కేవలం కొంతమంది అదృష్టవంతుల కోసమేకాకుండా ప్రతి ఒక్కరి కోసం పనిచేయాలని భారత ప్రభుత్వాన్ని ఆక్స్‌ఫామ్ కోరింది. మరిన్ని ఉద్యోగాలు సృష్టించే కార్మికశక్తిని ప్రోత్సహించటం, వ్యవసాయంలో అధిక పెట్టుబడి పెట్టుబడులు, సామాజిక రక్షణ పథకాలను సమర్ధవంతంగా అమలు చేయడం ద్వారా ప్రోత్సాహకరమైన అభివృద్ధిని సాధించాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment