శ్రీసిటీలో వెయ్యి పరిశ్రమల ఏర్పాటు
లక్ష మందికి ఉద్యోగావకాశాలు
12 పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు,
11 కంపెనీలకు భూమిపూజ చేసిన సీఎం
రోడ్లు అభివృద్ధి చేస్తామని ప్రకటన
సత్యవేడు : శ్రీసిటీలో వెయ్యి పరిశ్రమల ఏర్పాటే లక్ష్యమని, ప్రస్తుతానికి 10శాతం కంపెనీలే వచ్చాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఇక్కడ వెయ్యి కంపెనీలు ఏర్పాటైతే లక్ష మందికి ఉద్యోగావకాశాలు కలుగుతాయని తెలిపారు. శ్రీసిటీలో శుక్రవారం ముఖ్యమంత్రి 12పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, మరో 11కంపెనీలకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పెప్సికో యూనిట్‌ను సీఎం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటైన సభలో సీఎం మాట్లాడుతూ సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల పరిధిలోని శ్రీసిటీలో 7600 ఎకరాల్లో 25 దేశాలకు చెందిన 106 పరిశ్రమల ఏర్పాటుకు *20,500 కోట్లు పెట్టుబడి పెట్టారని, 25వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని చెప్పారు.
జపాన్‌కు చెందిన 16 కంపెనీలు, అమెరికాకు చెందిన 9కంపెనీలు, మరిన్ని కంపెనీలు ఇందులో ఉన్నాయన్నారు. సౌత్ ఇండియాలో పెప్సీ మార్కెట్‌ను పెంచేందుకు శ్రీసిటీలో 86 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటు చేశారన్నారు. జిల్లాలో మూడు లక్షల ఎకరాల్లో మామిడితోటలు ఉన్నాయని, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ మామిడితోటలు అధికంగా ఉన్నాయని చెప్పారు. బొప్పాయి,మామిడి, అరటి రైతులకు ఈ ప్లాంటు ఏర్పాటుతో రైతులకు ఆదాయం మెరుగుపడే అవకాశం అధికంగా ఉందని తెలిపారు. శ్రీసిటీలో ట్రిపుల్‌ఐటీ, ఐఐఎఫ్‌ఎం ఏర్పాటు చేయాలని కోరారని,ప్రస్తుతం ట్రిపుల్‌ఐటీ ఏర్పాటు చేశామని చెప్పారు. నెల్లూరులో కొత్త విమానాశ్రయం ఏర్పాటు చేస్తామన్నారు. కృష్ణపట్నం కాకుండా మరో పోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తిరుపతి, ఏర్పేడు, గూడూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి రోడ్లు శ్రీసిటీకి అనుసంధానంగా అభివృద్ధి చేస్తామన్నారు. రైతులు వ్యవసాయంపై దృష్టిపెట్టాలని కోరారు. అందరికీ ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీలు ఏర్పాటు కావాలని, ఇండస్ట్రీ ఏర్పాటుకు 21 రోజుల్లో క్లియరెన్స్ ఇస్తామని చెప్పారు. పెప్సీకో సీఈవో ఇంద్రనూయి లాగే మహిళలు ఎదగాలని కోరారు. స్థానిక కంపెనీలు సీఈవోలుగా ఎక్కువ మంది మహిళలనే నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. పెప్సికో సీఈవో సందీవ్‌చద్దా, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా చైర్మన్ శివకుమార్, మంత్రులు నారాయణ, గోపాలకృష్ణారెడ్డి, ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యేలు ఆదిత్య, సుగుణమ్మ , శ్రీసిటీ చైర్మన్ శ్రీనిరాజు, ఎండీ రవీంద్రసన్నారెడ్డి. ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య, ఇండస్ట్రియల్ సెక్రటరీ రావత్ తదితరులు పాల్గొన్నారు.
లక్ష్యం
Published Sat, Apr 4 2015 2:12 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement