CM Jagan Davos Tour: More Investments in Energy Sector Andhra Pradesh - Sakshi
Sakshi News home page

CM YS Jagan Davos Tour: ఏపీకి మరో రూ.65 వేల కోట్లు

Published Wed, May 25 2022 4:06 AM | Last Updated on Wed, May 25 2022 9:23 AM

CM Jagan Davos Tour more investments energy sector Andhra Pradesh - Sakshi

దావోస్‌లో ఆర్సిలర్‌ మిట్టల్‌ సీఈవో ఆదిత్య మిట్టల్‌తో సమావేశమైన సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: కర్బన ఉద్గారాలు లేని విద్యుదుత్పత్తి (గ్రీన్‌ ఎనర్జీ) లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థికసదస్సు (డబ్ల్యూఈఎఫ్‌) వేదికగా గ్రీన్‌ ఎనర్జీ రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ముందుకొచ్చాయి. ఆ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మరో మూడు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఒప్పందాలపై ప్రభుత్వ అధికారులు, ఆయా సంస్థల అధిపతులు సంతకాలు చేశారు. రూ.65 వేల కోట్ల పెట్టుబడితో 14 వేల మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ విద్యుదుత్పత్తి చేసి 18 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం తాజా ఒప్పందాలను కుదుర్చుకుంది.

మచిలీపట్నంలో గ్రీన్‌ ఎనర్జీ ఆధారంగా ఎస్‌ఈజెడ్‌ ఏర్పాటుపై కూడా ఒప్పందం కుదిరింది. ఇప్పటికే రూ.60 వేల కోట్ల పెట్టుబడితో 13,700 మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి కోసం అదానీ సంస్థతో ప్రభుత్వం సోమవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 10 వేలమందికిపైగా ఉద్యోగాలు రానున్నాయి. దీంతో ఒక్క గ్రీన్‌ ఎనర్జీ విభాగంలోనే దావోస్‌ వేదికగా రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేలా అవగాహన ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకున్నట్లైంది.

గ్రీన్‌ కో గ్రీన్‌సిగ్నల్‌..
కర్బన రహిత విద్యుదుత్పత్తికి గ్రీన్‌కో – ఏపీ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. 8 వేల మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి కోసం ఒప్పందం జరిగింది. ఇందులో వెయ్యి మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ జలవిద్యుత్‌ ప్రాజెక్టు, 5 వేల మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టు, 2 వేల మెగావాట్ల విండ్‌(పవన విద్యుత్‌) ప్రాజెక్టు ఉన్నాయి. దీని కోసం రూ.37 వేల కోట్ల పెట్టుబడిని ఆ సంస్థ పెట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 10 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. 

6 వేల మెగావాట్లతో అరబిందో 
రాష్ట్రంలో 6 వేల మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వంతో అరబిందో రియాల్టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 2 వేల మెగావాట్ల పంప్డ్‌ హైడ్రో ప్రాజెక్టు, మరో 4వేల మెగావాట్ల సోలార్, విండ్‌ ప్రాజెక్టులు ఉంటాయి. ప్రస్తుతం కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో సదుపాయాలను వినియోగించుకుని ఈ ప్రాజెక్టులను అరబిందో రియాల్టీ చేపట్టనుంది. ప్రాజెక్టు కోసం దాదాపు రూ.28 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 8 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. 

బందరులో ఇండస్ట్రియల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ జోన్‌..
మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ జోన్‌ ఏర్పాటుకు ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదర్చుకుంది. గ్రీన్‌ ఎనర్జీతో సహాయంతో ఈ జోన్‌లో పారిశ్రామిక ఉత్పత్తి చేపట్టనుంది. ఈ జోన్‌లో ప్రపంచస్థాయి కంపెనీలకు అవసరమైన వసతులు కల్పిస్తారు. 

బహ్రెయిన్‌కు ఏపీ ఎగుమతులు 
దావోస్‌లో మూడో రోజు మంగళవారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బహ్రెయిన్‌ ఆర్థిక శాఖ మంత్రి సల్మాన్‌ అల్‌ ఖలీపాతోపాటు పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఉన్న అపార అవకాశాలను వివరించారు. ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్, గ్రీన్‌ ఎనర్జీ, హై ఎండ్‌ టెక్నాలజీ విభాగాల్లో అవకాశాలను ప్రధానంగా తెలియచేశారు.

రాష్ట్రం నుంచి బహ్రెయిన్‌కు విరివిగా ఎగుమతులపై చర్చించారు. విద్యారంగంలో పెట్టబడులపై సల్మాన్‌ అల్‌ ఖలీపాతో చర్చలు జరిపారు. అనంతరం సెకోయ క్యాపిటల్‌ ఎండీ రంజన్‌ ఆనందన్‌తో సీఎం జగన్‌ సమావేశమై స్టార్టప్‌ ఎకో సిస్టం అభివృద్ధిపై చర్చించారు. సెకోయా క్యాపిటల్‌ ఏపీలో కార్యకలాపాల ప్రారంభం అంశంపైనా చర్చించారు.

అంతర్జాతీయ ఉత్పత్తి కేంద్రంగా ఏపీ
► డబ్ల్యూఈఎఫ్‌ వేదికగా ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ లుక్‌ రెమంట్‌తో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. దేశీయ, అంతర్జాతీయ అవసరాలను తీర్చే విధంగా ఉత్పత్తి కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దడంపై చర్చించారు. గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్రంలో భారీగా రానుండటంతో ఆ అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. 
► వ్యవసాయం, ఆహారం, ఫార్మా రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న జుబిలియంట్‌ గ్రూపు సంస్థల వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ కాళీదాస్‌ హరి భర్తియాతో ఏపీ పెవిలియన్‌లో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాసెసింగ్‌పై విస్తృతంగా చర్చించారు. విశాఖలో ఐఐఎం క్యాంపస్‌ నిర్మాణం వచ్చే ఆగస్టు నాటికి పూర్తి కానుందని, దీనికి సీఎం జగన్‌ను ఆహ్వానించనున్నట్లు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కాళీదాస్‌ హరి భర్తియా తెలిపారు.

► ప్రఖ్యాత స్టీల్‌ దిగ్గజ కంపెనీ ఆర్సెల్‌ మిట్టల్‌ సీఈవో ఆదిత్య మిట్టల్‌తో ఏపీ పెవిలియన్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశమై గ్రీన్‌ ఎనర్జీ విద్యుదుత్పత్తిపై విస్తృతంగా చర్చించారు. గ్రీన్‌కో భాగస్వామ్యంతో ఏపీలోకి అడుగుపెడుతున్నామని ఆదిత్య మిట్టల్‌ ప్రకటించారు. ప్రపంచంలోనే తొలి హైడ్రో పంప్డ్‌ ప్రాజెక్టులో భాగస్వామి అవుతున్నట్లు వెల్లడించారు. తమ కంపెనీ తరఫున 600 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెడుతున్నట్టు చెప్పారు. 
► గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తిపై ఐఎసీఎల్, ఎల్‌ అండ్‌ టీలతో జాయింట్‌ వెంచర్‌ రెన్యూ పవర్‌ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఏపీ పెవిలియన్‌లో సీఎం జగన్‌తో  రెన్యూ  పవర్‌ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ సుమంత్‌ సిన్హా సమావేశమయ్యారు. రాష్ట్రంలో హైడ్రోజన్‌ తయారీ ప్లాంట్‌  ఏర్పాటుపై చర్చించారు. అనంతరం ఐబీఎం ఛైర్మన్, సీఈవో అరవింద్‌ కృష్ణతో సీఎం జగన్‌ సమావేశమై టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధిపై చర్చించారు. విశాఖను హై ఎండ్‌ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని సీఎం జగన్‌ వివరించారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement