సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాధాన్యతనిస్తున్నారు. పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తున్నారు. కొత్త పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా పరిశ్రమలు త్వరితగతిన ఉత్పత్తి ప్రారంభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఉత్పత్తి ప్రారంభించడం ద్వారా పెట్టుబడులను వాస్తవరూపంలోకి తేవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉంది.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ డిపార్టమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) తాజా గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల కాలంలో రాష్ట్రంలో రూ.19,409 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. ఈ పెట్టుబడులు పెట్టిన 15 పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయి. వీటిలో నోవా ఎయిర్, తారక్ టెక్స్‌టైల్స్, టీహెచ్‌కే ఇండియా, కిసాన్ క్రాఫ్ట్, తారకేశ్వర స్పిన్నింగ్ మిల్ వంటివి ఉన్నాయి.
ఇదే కాలంలో దేశవ్యాప్తంగా 221 యూనిట్ల ద్వారా రూ.65,929 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవరూపం దాల్చాయి. వీటిలో 29.4 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నట్లు డీపీఐఐటీ గణాంకాలు తెలిపాయి. పారిశ్రామికంగా అతి పెద్ద రాష్ట్రంగా భావించే మహారాష్ట్రలో ఈ మూడు నెలల్లో వాస్తవ రూపం దాల్చిన పెట్టుబడులు రూ.11,882 కోట్లు మాత్రమే. మిగతా రాష్ట్రాలన్నీ ఈ విషయంలో చాలా వెనుకబడి ఉన్నాయి.
ఈ మూడు నెలల్లోనే రాష్ట్రంలో రూ.4,939 కోట్ల విలువైన 15 యూనిట్లకు ఒప్పందాలు జరిగాయి. ఒకపక్క కోవిడ్ ఇబ్బందులు వెంటాడుతున్నప్పటికీ 2020 డిసెంబర్‌లో నిర్మాణం ప్రారంభించి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 11 నెలల్లోనే పనులు పూర్తి చేసినట్లు నోవాఎయిర్ ప్రతినిధులు ‘సాక్షి’కి వెల్లడించారు. దీనివల్ల 250 టన్నుల ఆక్సిజన్ రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.
27 నెలల్లో రూ.39,599 కోట్ల పెట్టుబడులు
గడిచిన 27 నెలల్లో రాష్ట్రంలో కొత్తగా 104 యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించాయి. వీటి ద్వారా రూ.39,599 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. అలాగే 12 యూనిట్లు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. వీటివల్ల మరో రూ.24,039 కోట్ల విలువైన పెట్టుబడులు రానున్నాయి. సీఎం వైఎస్ జగన్ పరిశ్రమల ప్రోత్సాహకానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారని, రాష్ట్రంలో కంపెనీలకు వైఎస్సార్ ఏపీ వన్ ద్వారా జీవితకాలం సహకారాన్ని అందిస్తున్నట్లు పరిశ్రమల మంత్రి గుడివాడ అమరనాథ్ చెప్పారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తల్లో నమ్మకం ఏర్పడి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు.
డీపీఐఐటీ లెక్క ఇలా..
ఏదైనా ఒక కంపెనీ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని పనులు ప్రారంభించగానే డీపీఐఐటీ వద్ద ఇండస్ట్రియల్ ఎంటర్‌ప్రెన్యూర్ మెమోరాండం (ఐఈఎం) పార్ట్–ఏ దాఖలు చేస్తాయి. ఆ సంస్థలు వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించిన వెంటనే ఐఈఎం పార్ట్‌బీని దాఖలు చేస్తాయి. వీటి ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం దేశంలోకి వచ్చిన పెట్టుబడులను లెక్కిస్తుంది.
పెట్టుబడుల వాస్తవరూపంలో ఏపీ నంబర్ 1
Published Sun, Jul 17 2022 4:47 AM | Last Updated on Sun, Jul 17 2022 7:38 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment