దేశ సరిహద్దులను చెరిపి ప్రపంచ పాలన సాధించే దిశగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అడుగులు వేస్తున్నది. ప్రపంచీకరణను ఇంకా లోతుల్లోకి తీసుకెళ్లేలా కొత్త వ్యూహాలను రచిస్తున్నది. పర్యావరణం పట్ల శ్రద్ధ ఉన్నట్లు కనిపిస్తుంది కానీ తమ సభ్యులు ఆధిపత్యం కోల్పోని విధంగా ‘పరిష్కారాలు’ తెర మీదకు తేవడం ఈ సంస్థ ప్రత్యేకత. ప్రపంచంలో జరిగే కార్పొరేట్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరిగే నిరసనల మీద ‘డబ్ల్యూఈఎఫ్’ ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నది. ప్రజా ఉద్యమాలను నిర్వీర్యం చేయడంలో దీని పాత్ర ఉందని నమ్ముతున్నారు. అనేక రూపాలలో ప్రపంచ ఆలోచనలను, పరిశోధనలను, వ్యక్తులను, వ్యవస్థలను నియంత్రించే రీతిలో ఈ సంస్థ పని చేస్తున్నది.
గత నాలుగు దశాబ్దాలుగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశాల్లో వేలాది మంది అగ్రశ్రేణి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు,బ్యాంకర్లు, ఫైనాన్షియర్లు, దేశాధినేతలు, ఆర్థిక, వాణిజ్య మంత్రులు, ధనిక దేశాల విధాన నిర్ణేతలు పాల్గొంటున్నారు. అన్ని ప్రధాన అంతర్జాతీయ సంస్థల అధిపతులు కూడా అక్కడికి వెళ్తుంటారు. ఇంతమంది నాయకులు, ప్రముఖులు అక్కడ పోషించే పాత్ర ఏమిటో తెలియదు. ప్రజాధనం ఎంత ఖర్చు అవుతుందో చెప్పరు. ఈ సంవత్సరం కనీసం ముగ్గురు ముఖ్యమంత్రులు దావోస్(స్విట్జర్లాండ్) పోతున్నారు– మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక. తెలంగాణా నుంచి దావోస్ ప్రతి సమావేశంలో పాల్గొనే మంత్రి గారు వెళ్తున్నారు.
ఈ సమావేశాలు నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఒక ప్రైవేటు సంస్థ. దీని ఆలోచనలు, వ్యూహాలు తెలుసుకోవడం అవసరం. సాధారణంగా ప్రపంచంలో రెండు పెట్టుబడిదారీ నమూనాలు ఉన్నాయి. మొదటిది: చాలా పాశ్చాత్య సంస్థలు స్వీకరించిన ‘షేర్ హోల్డర్ క్యాపిటలిజం’. దీని ప్రకారం ఒక కార్పొరేషన్ ప్రాథమిక లక్ష్యం దాని లాభాలను గరిష్ఠంగా పెంచడం, తద్వారా వాటాదారు లకు లాభాలు పంచడం. రెండవ నమూనా: ‘స్టేట్ క్యాపిటలిజం’. ఇందులో దేశ ఆర్థిక వ్యవస్థ దిశను నిర్ణయించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వమే పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. చైనా, ఇంకా కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ తరహ వ్యవస్థ ఇటీవల ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ఈ రెండింటికి భిన్నంగా, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధినేత క్లాస్ శ్వాబ్ ప్రతిపాదించిన మూడవ తరహా ‘స్టేక్ హోల్డర్ పెట్టుబడిదారీ విధానం’లో ప్రైవేట్ కంపెనీలకు సమాజం, పర్యావరణం పట్ల బాధ్యత ఉంటుంది. ఇది ఒక విధంగా మన దేశంలో అమలవుతున్న సీఎస్‌ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబిలిటీ) లాంటిది. ఇది మంచిదేగా అనిపిస్తుంది. అసలు విషయం ఏమిటంటే, దేశ సరిహద్దులను చెరిపి ప్రపంచ పాలన సాధించే దిశగా ఈ సంస్థ అడుగులు వేస్తున్నది. వైఫల్యం చెందినప్పటికీ ప్రపంచీకరణను ఇంకా లోతుల్లోకి తీసుకెళ్లేలా కొత్త వ్యూహాలను రచిస్తూ, ప్రపంచ పరిపాలన మీద దృష్టి పెడుతున్నది. పర్యావరణం పట్ల శ్రద్ధ ఉన్నట్లు కనిపిస్తుంది కానీ ఏ సమస్యలో అయినా ‘డబ్ల్యూఈఎఫ్’ సభ్యులు తమ ఆధిపత్యం కోల్పోని విధంగా ‘పరిష్కారాలు’ తెర మీదకు తేవడం ఈ సంస్థ ప్రత్యేకత.
ఈ ఆలోచనలతో క్లాస్ శ్వాబ్ రాసిన పుస్తకం: ‘ది గ్రేట్ రీసెట్’. దీనిలో భాగస్వామ్య పెట్టుబడిదారీ విధానంతో పాటు తనదైన మార్క్సిజం బ్రాండ్‌తో ప్రపంచాన్ని పూర్తిగా పునర్నిర్మించాలని పిలుపు ఇచ్చాడు. దశాబ్దాలుగా ఒక క్లబ్ మీటింగ్ తరహాలో ఇక్కడ వార్షిక సమావేశాలు జరుగుతున్నాయి. నయా ఉదారవాదం పునాదిగా కార్పొరేట్ వాణిజ్య ఒప్పందాల వ్యాప్తి, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తులను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో విలీనం చేయడం ఇక్కడి ప్రక్రియలో భాగం. ప్రపంచ వాణిజ్య మార్కెట్లకు దన్నుగా ‘గ్లోబల్ గవర్నెన్స్’ను ప్రోత్సహించడానికి ఈ సమావేశాలను వాడుకుంటున్నారు.
వాస్తవానికి, ఈ ఆర్థిక వేదిక ప్రధాన ఉద్దేశ్యం ప్రపంచీకరణ ద్వారా ఉన్నత వర్గాల, పారిశ్రామికవేత్తల ప్రయోజనాలను కాపాడ టమే. 1990లో నెల్సన్ మండేలా జైలు నుండి విడుదలైనప్పుడు గనులు, బ్యాంకులు, గుత్తాధిపత్య పరిశ్రమలను ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ జాతీయం చేస్తుందని ప్రకటించారు. కాగా, అధ్యక్షుడైన వెంటనే 1992 జనవరిలో ‘డబ్ల్యూఈఎఫ్’ సమావేశాలకు హాజరై తన అభిప్రాయాలను మార్చుకుని ‘పెట్టుబడిదారీ విధానం, ప్రపంచీకరణ’ను స్వీకరించారు. చైనా, వియత్నాం, కంబోడియా వంటి కమ్యూనిస్ట్ దేశాలు కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటే తమ దేశానికి పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నాయి.
1997లో అమెరికా రాజకీయ శాస్త్రవేత్త శామ్యూల్ హంటింగ్టన్ ‘దావోస్ మగవాడు’ (దావోస్ మ్యాన్) అనే పదాన్ని సృష్టించారు. ‘దేశ సరిహద్దులను కనుమరుగవుతున్న అవరోధాలుగా, జాతీయ ప్రభు త్వాలను గతానికి అవశేషాలుగా చూస్తూ– అటువంటి ప్రభుత్వాలకు ఉండే ఏకైక ఉపయోగకరమైన పని ఉన్నత వర్గాల పుడమి స్థాయి కార్యకలాపాలను సులభతరం చేయడమే అని నమ్మేవారు’ అంటూ ఈ పదాన్ని ఆయన విశ్లేషించారు.
ఏటా దావోస్ సమావేశాలకు హాజరయ్యేవాళ్ళు తమ పరపతి, వనరులు పెంచుకోవడానికీ, ఇతరులతో కలిసి తమ ఆధిపత్యానికి అడ్డంకులు తొలగించుకోవడానికీ ఈ వేదికను ఉపయోగించుకుంటున్నారు. ఒకానొక సమావేశంలో, బోరిస్ బెరెజోవ్‌స్కీ నేతృత్వంలోని ఏడుగురు రష్యన్ నేతలు బోరిస్ యెల్ట్సిన్ తిరిగి ఎన్నిక కావడానికి నిధులు సమకూర్చాలనీ, ‘తమ దేశ భవిష్యత్తును పునర్నిర్మించడానికి’ కలిసి పనిచేయాలనీ నిర్ణయించుకున్నారు. ఈ కూటమి అనుకున్నది సాధించింది. ఇది వారందరినీ ఇంకా ధనవంతులను చేసింది.
2009 సంవత్సరంలో అంతర్జాతీయ బ్యాంకులు, ప్రపంచ ఆర్థిక సంస్థలపై ప్రజలకు విశ్వాసం తగ్గినప్పటికీ, ప్రైవేటు ఆర్థిక సంస్థల ప్రయోజనాలను పరిరక్షించడానికి కట్టుబడి దావోస్ పని చేసింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఫౌండేషన్ బోర్డు (దాని అత్యున్నత పాలక సంస్థ)లో ప్రపంచ కుబేరులు ఉన్నారు. 2002లో ఏర్పాటైన మరొక పాలక మండలి ‘ఇంటర్నేషనల్ బిజినెస్ కౌన్సిల్’ను 100 మంది ప్రముఖులతో ఏర్పాటు చేశారు.
వ్యూహాత్మక సలహాలు ఇస్తూ, వార్షిక సమావేశ ఎజెండా తయారీకి ఈ మండలి ఉపయోగపడుతుంది. ఇందులో ముఖేష్ అంబానీ కూడా ఉన్నారు. 2015 నాటికి ‘డబ్ల్యూఈఎఫ్’ వార్షిక వ్యూహాత్మక భాగస్వామి హోదా పొందాలంటే దాదాపు 7 లక్షల డాలర్ల రుసుము కట్టాలి. ఇందులో వ్యూహాత్మక భాగస్వామి సభ్యులుగా బ్యాంక్ ఆఫ్ అమెరికా, బార్‌క్లేస్, బ్లాక్ రాక్, బీపీ, చెవ్రాన్, సిటీ, కోకాకోలా, క్రెడిట్ సూయిజ్, డ్యూష్ బ్యాంక్, డౌ కెమికల్, ఫేస్‌బుక్, జీఈ, గోల్డ్‌మాన్ శాక్స్, గూగుల్, హెచ్‌ఎస్‌బీసీ, జేపీ మోర్గాన్ ఛేజ్, మోర్గాన్ స్టాన్లీ, పెప్సికో, సీమెన్స్, టోటల్, యూబీఎస్ లాంటి సంస్థలు ఉన్నాయి.
ప్రపంచంలో జరిగే కార్పొరేట్, ఆర్థిక శక్తి ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరిగే నిరసనలు, ప్రతిఘటన ఉద్యమాల మీద ‘డబ్ల్యూఈఎఫ్’ ఆసక్తి చూపిస్తున్నది. 1999లో ప్రపంచ వాణిజ్య సంస్థకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జరిగిన నిరసనల నేపథ్యంలో ఈ ఆసక్తి స్పష్టమైంది. అప్పటి నిరసనల వల్ల సియాటెల్ నగరంలో కీలక వాణిజ్య చర్చలకు అంతరాయం ఏర్పడింది. ఈ నిరసనలను పెరుగుతున్న ‘ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమం’గా ‘డబ్ల్యూఈఎఫ్’ అభివర్ణించింది. ప్రజా ఉద్యమాలను నిర్వీర్యం చేయడంలో, లేదా నిరంకుశంగా అణిచివేయడంలో దీని పాత్ర ఉందని నమ్ముతున్నారు.
2001 జనవరిలో దావోస్ సమావేశాలకు అంతరాయం కలగకుండా అసాధారణ భద్రతా చర్యలు తీసుకున్నారు. దావోస్ పట్టణం చుట్టూ కాంక్రీట్ బ్లాక్‌లు అమర్చి, కంచెకు అవతలి వైపునే వేలాది పోలీసులు నిరసనకారులను నిలువరించారు. అదే సమయంలో, దావోస్‌కు ప్రతి వేదికగా బ్రెజిల్‌లోని పోర్టో అలెగ్రేలో ఏర్పడిన వరల్డ్ సోషల్ ఫోరమ్ కాలక్రమేణా బలహీనపడగా, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ బలపడింది. అన్ని దేశాల ఒప్పందం మేరకు ఏర్పాటైన ప్రపంచ వాణిజ్య సంస్థ ఇటీవలి సంవత్సరాలలో బలహీనపడగా, ఒక ప్రైవేటు సంస్థ అయిన ‘డబ్ల్యూఈఎఫ్’ బలపడుతున్నది.
తన దగ్గర ఉన్న కోట్లాది సొమ్ముతో అనేక రూపాలలో ప్రపంచ ఆలోచనలను, పరిశోధనలను, వ్యక్తులను, వ్యవస్థలను నియంత్రించే రీతిలో ఈ సంస్థ పని చేస్తున్నది. కరోనా మహమ్మారి గురించిన వివిధ దేశాల ప్రభుత్వాల స్పందనను, విధానాలను శాసించే స్థితికి కూడా ఈ సంస్థ చేరిందని వ్యాఖ్యానించేవారూ ఉన్నారు.
డాక్టర్ దొంతి నరసింహారెడ్డి
వ్యాసకర్త విధాన విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment