CM Jagan Davos Tour: Andhra Pradesh as Manufacturing Hub - Sakshi
Sakshi News home page

CM YS Jagan Davos Tour: తయారీ హబ్‌గా ఏపీ

Published Mon, May 23 2022 3:43 AM | Last Updated on Mon, May 23 2022 9:34 AM

CM Jagan Davos Tour Andhra Pradesh manufacturing hub - Sakshi

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో బీసీజీ గ్లోబల్‌ చైర్మన్‌ హాన్స్‌ పాల్‌ బక్నర్‌తో సమావేశమైన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి

సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణ ఊపందుకునేలా సౌకర్యాలు అభివృద్ధి చేస్తున్నాం. కాలుష్యం లేని పారిశ్రామిక ప్రగతి కోసం తగిన చర్యలు తీసుకుంటున్నాం. కొత్తతరం పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల తయారీ, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. కోవిడ్‌ పరిణామాలతో దెబ్బతిన్న ఆర్థిక, పారిశ్రామిక వ్యవస్థలను తిరిగి గాడిలో పెడుతున్నాం. ప్రజల కొనుగోలు శక్తి పెరిగేలా అడుగులు ముందుకు వేశాం. పాలనలో విప్లవాత్మక సంస్కరణలతో అనేక సేవలు అందిస్తున్నాం. పలు రంగాల్లో త్వరితగతిన మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నాం.
– దావోస్‌ వేదికపై సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: పర్యావరణ హిత తయారీ రంగంలో అవకాశాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక దృష్టి సారించింది.  కొత్తగా అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంతో పాటు, కాలుష్యం లేని ఇంధన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. దావోస్‌లో ప్రారంభమైన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సులో తొలి రోజు ఆదివారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలు అంశాలపై అంతర్జాతీయ ప్రతినిధులతో చర్చిస్తూ బిజీబిజీగా గడిపారు.

డబ్ల్యూఈఎఫ్‌తో ప్లాట్‌ఫాం పార్ట్‌నర్‌గా ఒప్పందం కుదుర్చుకోవడంతోపాటు డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు క్లాజ్‌ ష్వాప్, బీసీజీ గ్లోబల్‌ చైర్మన్‌ హాన్స్‌ పాల్, అదానీ గ్రూపు సంస్థల చైర్మన్‌ గౌతం అదానీలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా విద్య, వైద్య రంగాలపై రాష్ట్ర ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాన్ని పలువురు కొనియాడారు. కొత్త పెట్టుబడులు రావాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా విద్య, వైద్య రంగాలే కీలక పాత్ర పోషిస్తాయన్నారు.  
అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతం అదానీకి ఏపీలో పెట్టుబడుల అవకాశాలకు సంబంధించిన సమాచారం అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

ఫుడ్‌ హబ్‌గా ఏపీ
దావోస్‌లోని కాంగ్రెస్‌ సెంటర్లో డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ క్లాజ్‌ ష్వాప్‌తో సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్లాజ్‌ మాట్లాడుతూ.. ఏపీకి అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా ధాన్యాగారంగా పేరొందిన రాష్ట్రం ఫుడ్‌ హబ్‌గా మారేందుకు అన్ని రకాల పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. ప్రపంచంలో పలు చోట్ల ఆహార కొరత ఏర్పడుతున్న పరిస్థితులను తీర్చడంలో ఆంధ్రప్రదేశ్‌ కీలక పాత్ర పోషించగలదని తెలిపారు.

అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ భాగస్వామ్యంపై డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ష్వాప్‌ ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. కొత్తగా నిర్మిస్తున్న మూడు పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణం, అభివృద్ధిపై చర్చించారు. పోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగు పరచడంపై శ్రద్ధ పెట్టామని చెప్పారు.

సోషల్‌ గవర్నెన్స్, పర్యావరణ పరిరక్షణ అంశాల్లో డబ్ల్యూఈఎఫ్‌ వేదిక ద్వారా రాష్ట్రానికి మంచి ప్రయోజనాలు అందాలని ఆకాక్షింస్తూ.. ప్రాధాన్యతలుగా నిర్ణయించుకున్న అంశాల గురించి వివరించారు. పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు, భవిష్యత్‌ తరాలను ఉత్తమంగా తీర్చిదిద్దడానికి విద్య, వైద్య రంగాల్లో పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నామని సీఎం వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రతి ఇంటికీ, వారి గడప వద్దకే సేవలు అందిస్తున్నామని చెప్పారు. 


డబ్ల్యూఈఎఫ్‌తో కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలు చూపుతున్న అధికారులు

వైద్య రంగంలో భాగస్వామ్యం కండి
వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ఆరోగ్యం – వైద్య విభాగాధిపతి డాక్టర్‌ శ్యాం బిషేన్‌తో కాంగ్రెస్‌ సెంటర్లో సీఎం సమావేశమయ్యారు. బయోటెక్నాలజీ, వైద్య రంగంలో వస్తున్న వినూత్న ఆవిష్కరణలపై డబ్ల్యూఈఎఫ్‌తో కలిసి పనిచేసే అంశంపై ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఏపీలో ఆరోగ్య రంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులను సీఎం వివరించారు. ప్రతి 2 వేల జనాభాకు వైఎస్సార్‌ క్లినిక్స్‌.. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు ద్వారా పాలనా వికేంద్రీకరణ తదితర అంశాలను సీఎం వివరించారు.

నూతన బోధనాస్పత్రులు, సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోందని, ఈ కార్యక్రమాల్లో డబ్ల్యూఈఎఫ్‌ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం తర్వాత సీఎం కాంగ్రెస్‌ వేదిక నుంచి నేరుగా ఏపీ పెవిలియన్‌కు చేరుకుని, జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలు, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అంశాలను తెలియజేసేలా ఏపీ పెవిలియన్‌ను తీర్చిదిద్దారు. ఆ తర్వాత పలువురు ప్రముఖులతో వరుస సమావేశాలు జరిపారు. 

కాలుష్య రహిత వ్యవస్థే లక్ష్యం
డబ్ల్యూఈఎఫ్‌ మొబిలిటీ, సస్టెయిన్‌బిలిటీ విభాగాధిపతి, పెడ్రో గోమెజ్‌తో ఏపీ పెవిలియన్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. డబ్ల్యూఈఎఫ్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే చేపట్టిన మూవ్‌ ఇండియా కార్యక్రమానికి ఏపీని మొదటిసారిగా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో వీరి సమావేశానికి కీలక ప్రాధాన్యం ఏర్పడింది. రవాణా రంగంలో వస్తున్న మార్పులపై, కాలుష్యం లేని రవాణా వ్యవస్థ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై, ఇంధన రంగం భవిష్యత్‌పై ఇద్దరి మధ్య విస్తృతంగా చర్చ జరిగింది.

ప్రస్తుతం వివిధ వాహనాలకు వినియోగిస్తున్న బ్యాటరీలను ఎలాంటి కాలుష్యం లేకుండా డిస్పోజ్‌ చేయాల్సిన అవసరం ఉందని సీఎం నొక్కి చెప్పారు. లేకపోతే నీటి వనరులు, భూమి కాలుష్యం అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి సమస్యల నేపథ్యంలో పంప్డ్‌ స్టోరేజ్‌ కాన్సెప్ట్‌ను ఏపీకి తీసుకొచ్చామని వివరించారు. విండ్, సోలార్, హైడల్‌.. ఈ మూడింటినీ సమీకృత పరిచే ప్రాజెక్టును రాష్ట్రంలో చేపట్టామని, భవిష్యత్తు సవాళ్లకు ఇదొక చక్కని పరిష్కారం కాగలదని విశదీకరించారు.

ఇలా వచ్చే కరెంటును రవాణా వ్యవస్థలకు వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. గ్రీన్‌ హైడ్రోజన్, గ్రీన్‌ అమ్మెనియా లాంటి కొత్తతరం ఇంధనాల ఉత్పత్తిపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. తర్వాత డబ్ల్యూఈఎఫ్‌తో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒప్పందం కుదుర్చుకున్నారు. 


సీఎం జగన్‌తో మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాక్రే

డబ్ల్యూఈఎఫ్‌ ఒప్పందంతో ఉపయోగాలు ఇలా..
► డబ్ల్యూఈఎఫ్‌ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడుతుంది.
► రాష్ట్రంలోని పారిశ్రామిక రంగానికి అత్యాధునికత, కాలుష్యం లేని విధానాలను జోడించడానికి డబ్ల్యూఈఎఫ్‌ తగిన సహకారం అందిస్తుంది. 
► రాష్ట్రాన్ని అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది.
► నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, పరిశ్రమలకు అవసరమైన నాణ్యమైన మానవ వనరుల తయారీ, స్థిరంగా ఉత్పత్తులు, రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ వ్యవస్థలు, డేటా షేరింగ్, ఉత్పత్తులకు విలువ జోడించడం లాంటి ఆరు అంశాల్లో రాష్ట్రానికి మార్గనిర్దేశం లభిస్తుంది. 

ఏపీ చర్యలు భేష్‌
బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు (బీసీజీ) గ్లోబల్‌ చైర్మన్‌ హాన్స్‌పాల్‌ బక్నర్‌తో సీఎం జగన్‌ సమావేశమ్యారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకున్న చర్యలను వివరించారు. అనుమతుల్లో జాప్యం లేకుండా సింగిల్‌ డెస్క్‌ విధానం ద్వారా పరిశ్రమలు పెట్టాలనుకునేవారికి అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో తూర్పు భాగానికి రాష్ట్రం గేట్‌వేగా మారేందుకు అన్ని రకాల అవకాశాలున్నాయని, ఇందుకోసం కొత్తగా మూడు పోర్టుల నిర్మాణం ప్రారంభించామన్నారు.

విద్య, వైద్య రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను బీసీజీ గ్లోబల్‌ చైర్మన్‌ బక్నర్‌ ప్రశంసించారు. నైపుణ్య మానవ వనరులను తయారు చేయడానికి చేపట్టిన కార్యక్రమాల వల్ల పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. అనంతరం మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాకరే ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఏపీ పెవిలియన్‌ సమీపంలోనే మహారాష్ట్ర కూడా పెవిలియన్‌ ఏర్పాటు చేసింది. అనంతరం ముఖ్యమంత్రి.. అదానీ గ్రూపు సంస్థల చైర్మన్‌ గౌతం అదానీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి సంబంధించిన పలు అంశాలపై వారిద్దరూ చర్చించారు.   

దావోస్‌లో నేడు సీఎం జగన్‌ పాల్గొనే కార్యక్రమాలు 
ఫ్యూచర్‌ ఫ్రూఫింగ్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ అంశంపై డబ్ల్యూఈఎఫ్‌ పబ్లిక్‌ సెషన్‌లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  మాట్లాడనున్నారు. స్విస్‌ కాలమానం ప్రకారం ఉ.8:15 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉ.11.45 గంటలకు) సెషన్‌ ప్రారంభం.
టెక్‌ మహీంద్రా ఛైర్మన్, సీఈఓ సీపీగురానీతో భేటీ.. దస్సాల్ట్‌ సీఈఓ బెర్నార్డ్‌ ఛార్లెస్‌తో సమావేశం. è జపాన్‌కు చెందిన ప్రముఖ రవాణా సంస్థ మిట్సుయి ఒ.ఎస్‌.కె.లైన్స్‌ లిమిటెడ్‌ సీఈఓ తకేషి హషిమొటోతో భేటీ. 
హీరోమోటార్‌ కార్పొరేషన్‌ చైర్మన్, ఎండీ పవన్‌ ముంజల్‌తో సమావేశం.. ఐబీఎం చైర్మన్, సీఈఓ అరవింద్‌ కృష్ణతో భేటీ. మరింత మంది ప్రముఖులనూ కలిసే అవకాశం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement