హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ విత్తనాల పరిశ్రమ ఏటా 7–8 శాతం వృద్ధి చెందుతోందని ఫెడరేషన్ ఆఫ్ సీడ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐఐ) డైరెక్టర్ జనరల్ రామ్ కౌండిన్య తెలిపారు. ప్రస్తుతం విలువపరంగా సంఘటిత సీడ్ మార్కెట్ రూ. 23,000 కోట్ల స్థాయిలో ఉండగా, అసంఘటిత రంగం దాదాపు రూ. 20,000 కోట్ల మేర ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇందులో అత్యధికంగా కూరగాయల విత్తనాల విభాగం రూ. 6,500 కోట్లు, పత్తి సుమారు రూ. 4,000 కోట్ల స్థాయిలో ఉంటుందని కౌండిన్య వివరించారు. దేశీయంగా దిగుబడులను పెంచే దిశగా సాంకేతికతను ఆవిష్కరించేందుకు, పరిశోధనలకు ఊతమిచ్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు.
ప్రతిపాదిత కొత్త విత్తనాల బిల్లులో సాగు రంగానికి మేలు చేసే ప్రతిపాదనలు ఉన్నాయని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లు సత్వరం ఆమోదం పొందగలదని ఆశిస్తున్నట్లు కౌండిన్య చెప్పారు. మరోవైపు, 2026 నాటికి పత్తికి సంబంధించి దేశీయంగా టెక్స్‌టైల్స్ సంస్థల నుంచి 4.5 కోట్ల బేల్స్‌కి డిమాండ్ ఉంటుందని అంచనాలు ఉన్నాయని, కానీ దేశీయంగా ప్రస్తుతం ఉత్పత్తి సుమారు 3.2 కోట్ల బేల్స్ స్థాయిలోనే ఉందని ఈ నేపథ్యంలో అధునాతన సాగు విధానాలను అవిష్కరించేందుకు తోడ్పాటు అందించాలని, విత్తనాలపై ధరల నియంత్రణను తొలగించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment