సొంత విత్తనమే రైతుకు దన్ను!
♦ దేశవాళీ పత్తి విత్తనోత్పత్తిలో రాణిస్తున్న రైతు వేణుబాబు
♦ ఐదెకరాల్లో 28 దేశవాళీ పత్తి వంగడాల విత్తనోత్పత్తి
♦ మరో ఐదెకరాల్లో 9 ఇతర పంటల విత్తనాల ఉత్పత్తి
♦ విత్తన రైతు సేవా సంఘం తరఫున విత్తనాల మార్కెటింగ్
రైతులే సంఘాలుగా ఏర్పడి విత్తనాలు ఉత్పత్తి చేసుకుంటూ.. ఇతర రైతులకు అందిస్తే నాణ్యమైన, నమ్మకమైన విత్తనాలు, తక్కువ ధరకే లభ్యమవుతాయి. కర్నూలు జిల్లాకు చెందిన 9 మంది రైతులు ‘ఆంధ్రప్రదేశ్ విత్తన రైతు సేవా సంఘం’ ఏర్పాటు చేసుకొని విత్తనోత్పత్తిలో ఆదర్శంగా నిలిచారు. వేరు శనగ, మినుము, శనగ, కంది, వరి, మిరప వంటి పంటలతోపాటు పత్తిలోనూ అనేక దేశవాళీ వంగడాలను సేకరించి, విత్తనోత్పత్తి చేస్తూ రైతులకు అందుబాటులోకి తెస్తుండడం విశేషం. అభ్యుదయ విత్తన రైతు కందిమళ్ల వేణుబాబు నేతృత్వంలోని ఈ సంఘంవిత్తనోత్పత్తికి, మార్కెటింగ్‌కు సంబంధించి వ్యవసాయ శాఖ నుంచి లెసైన్స్ కూడా పొందింది. ప్రస్తుతం 9 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ఏడుగురు చురుగ్గా విత్తనోత్పత్తి చేస్తున్నారు. వేణుబాబు పదెకరాల పొలం కౌలుకు తీసుకొని సాగు చేస్తూ 9 రకాల పంటల్లో విత్తనోత్పత్తి చేస్తున్నారు.
28 రకాల దేశవాళీ పత్తి వంగడాల విత్తనోత్పత్తి
ప్రకాశం జిల్లాకు చెందిన వేణుబాబు 20 ఏళ్ల క్రితం కర్నూలుకు వచ్చి ముఖ్యంగా పత్తి విత్తనోత్పత్తిలో రాణిస్తున్నారు. జిల్లాలోని కల్లూరు సమీపంలోని పందిపాడు దగ్గర పది ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని విత్తనోత్పత్తి చేపట్టారు. ఐదెకరాల్లో పత్తి, ఇంకో ఐదెకరాల్లో ఇతర పంటల విత్తనాలు సాగు చేస్తున్నారు. ఆయన ఈ ఏడాది సాగు చేసిన 28 రకాల పత్తి వంగడాలన్నీ దేశవాళీ (సూటి) రకాలే. తిరిగి వాడుకోదగిన వంగడాలివి. నరసింహ, శివనందిని, శ్రీరామ 938 రకం, సుమంగళి, సుప్రియ, హెచ్ఓపీఎస్, ఎన్‌హెచ్-44, సూరజ్, అంజలి, ఎంసీ-5వీటీ, ఎల్ఆర్ఏ-2166 పత్తి రకాలతో పాటు మరో 17 రైతు రకాలను ఆయన సాగు చేస్తున్నారు.
ఒక్కో రకాన్ని 10, 15 సెంట్లలో సాగు చేస్తున్నారు. పత్తిలో కందిని అంతరపంటగా సాగు చేస్తున్నారు. 6 సాళ్లు పత్తి పంట, 1 సాలు కంది పంట వేస్తున్నారు. ఇతర పంటల్లోనూ దేశవాళీ రకాలతోనే విత్తనోత్పత్తి చేస్తున్నారు. చిక్కుడు, మిరప, జొన్న, వరిగ, ఎర్ర కొర్ర, సొర, పొట్ల, కంది పంటల విత్తనోత్పత్తి చేస్తున్నారు. చిక్కుడులో 3 వంగడాలను సాగు చేస్తున్నారు. ఒక్కో పత్తి వంగడాన్ని సెంటుకు 100 మొక్కలు సాగు చేస్తున్నారు. ఎకరాకు 750 కిలోల పత్తి విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నారు.
ఎకరానికి 25 వేల పత్తి మొక్కలు లాభదాయకం
పత్తి హైబ్రిడ్ విత్తనాలకు బదులు దేశవాళీ పత్తి విత్తనాలను ఎకరానికి 15 వేల నుంచి 25 వేల వరకు వత్తుగా (హై డెన్సిటీ) వేసుకుంటే మేలని వేణుబాబు అంటున్నారు. మూడేళ్లకోసారి పశువుల ఎరువు వేసుకుంటూ.. ఎకరానికి 5 బస్తాల రసాయనిక ఎరువులు వాడితే చాలు. పత్తి సాగు చేసే చిన్న రైతులు ఎకరానికి అన్ని ఖర్చులూ కలిపి రూ. 15 వేల పెట్టుబడితో.. రూ. 25 వేల వరకు నికరాదాయాన్ని పొందవచ్చని ఆయన చెబుతున్నారు. 150 రోజుల్లో పంట పూర్తవుతుందన్నారు. పూర్తిగా చౌడుబారిన పొలాన్ని మూడేళ్లుగా కౌలుకు తీసుకొని తనదైన విలక్షణ శైలిలో సేంద్రియ, ప్రకృతి సేద్య పద్ధతులను మేళవించి సాగు చేస్తున్న వేణుబాబు ఈ ఏడాది లాభాల బాట పట్టారు. బీడు భూమిని సాగులోకి తెచ్చి దేశవాళీ పత్తి వంగడాల మధ్య కందిని అంతరపంటగా ఈ ఏడాది సాగు చేశారు. 6 క్వింటాళ్ల పత్తి తీశారు. 5 క్వింటాళ్ల కందుల దిగుబడిని ఆశిస్తున్నారు.
ఖాళీ అనేదే లేకుండా...
వేణుబాబు పొలంలో ఎక్కడా మీటరు విస్తీర్ణంలో భూమి ఖాళీ లేకుండా పంటలు వేశారు. ఖాళీ స్థలాల్లో అంతర పంటలుగా మిరప, కంది, టమోటా.. పలు రకాల పంటలు వేస్తున్నారు. రెండేళ్ల క్రితం 10 దేశవాళీ చిక్కుడు విత్తనాలు దొరికితే.. వీటి నుండి అభివృద్ధి చేసిన విత్తనంతో ఈ ఏడాది ఎకరంలో చిక్కుడు తోట వేశారు. ఘనజీవామృతం, జీవామృతం వాడుతూ ఈ చిక్కుడును సాగు చేస్తున్నారు. ఈ చక్కటి వంగడం ద్వారా ఇప్పటికే రూ. 70 వేల ఆదాయం రాగా, మరో రూ. 80 వేల వరకు ఆదాయం రావచ్చని ఆశిస్తున్నారు.
సొర, పొట్ల కాయలు సాధారణంగా అర్థ మీటరు నుంచి మీటరు వరకు పొడవు ఉంటాయి. కానీ, వేణుబాబు పొలంలో ఒకటిన్నర మీటరు పొడవున ఆకట్టుకుంటున్నాయి. వీటిని విత్తనోత్పత్తి కోసమే ఉంచారు. విత్తనోత్పత్తిపై ఆసక్తి కలిగిన రైతుల బృందాలతోపాటు, వ్యవసాయ విద్యార్థులు సైతం వేణుబాబు విత్తన క్షేత్రాన్ని చూసి స్ఫూర్తిని పొందుతున్నారు.
- గవిని శ్రీనివాసులు, కర్నూలు వ్యవసాయం
మన విత్తనం మనమే ఉత్పత్తి చేసుకోవాలనేదే లక్ష్యం
రైతులు ఎవరి విత్తనాలు వారే ఉత్పత్తి చేసుకుంటే పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు రైతులు హైబ్రిడ్ విత్తనాల మోజులో పడి నష్టపోతున్నారు. రైతులుగా మన విత్తనాలను మనమే ఉత్పత్తి చేసుకొని వినియోగించుకోవాలనేదే మా ప్రధాన లక్ష్యం. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ విత్తన రైతు సేవాసంఘం ఏర్పాటు చేసుకున్నాం. లెసైన్స్ కూడా పొందాం. రైతులు విత్తనోత్పత్తిపై దృష్టి సారించేలా చేస్తున్నాం. వచ్చే ఏడాది కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకొని ప్రతి రైతూ రెండెకరాల్లో దేశవాళీ పత్తి, ఇతర పంటల విత్తనోత్పత్తి చేపట్టేలా కృషి చేయాలనుకుంటున్నాం. తద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, తక్కువ ధరకు లభిస్తాయి.
- కె. వేణుబాబు (94408 61443), విత్తన రైతు, కర్నూలు